Advertisement

Advertisement


Home > Movies - Interviews

కమర్షియల్ కాని సినిమా లేదు-సాయి ధరమ్

కమర్షియల్ కాని సినిమా లేదు-సాయి ధరమ్

ఏ హీరోను తన సినిమా విడుదలకు ముందు పలకరించినా చెప్పే మాట సాధారణంగా ఒకటే వుంటుంది. మంచిప్రయత్నం చేసాం. ప్రేక్షకుల తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం అనే. అయితే హీరో సాయి ధరమ్ తేజ స్టయిల్ వేరు. ఆయన తన సినిమా ఏమిటో చెబుతారు. ఏం చేసారో చెబుతారు. ఏముందో చెబుతారు. అంతే తప్ప, ఊ ఊడపొడిచేసాం అనే విధంగా మాట్లాడరు.

సక్సెస్ కొట్టే ప్రయత్నం చేస్తున్నాం అనే అంటారు. హిట్ అయిన సినిమాల ముందూ ఇదే మాట, ఫ్లాప్ అయిన సినిమాల ముందు అదే మాట. అలా సింపుల్ గా, సిన్సియర్ గా మాట్లాడే సాయి ధరమ్ తేజ లేటెస్ట్ సినిమా జవాన్ మరో ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఓ చిట్ చాట్

జవాన్.. మెసేజ్ సినిమానా? పక్కా కమర్షియల్ సినిమానా?

నా దృష్టిలో ఏ సినిమా అయినా కమర్షియల్ నే. ఎందుకంటే నిర్మాత పెట్టిన ప్రతి పైసా వెనక్కు రావాలి. ఆపైన ఎంతో కొంత లాభం రావాలి. అంటే కమర్షియల్ నే కదా. అయితే ఇలా కమర్షియల్ గా విజయం సాధించడం కోసం ప్రేక్షకులను అలరించే సబ్జెక్ట్ ను తీసుకుంటాం. అలా తీసుకోవడంలో కాస్త వైవిధ్యం వుండేలా చూసుకుంటాం.

అంటే ఇంతకీ జవాన్ లో ఆ వైవిధ్యం వుందా? లేదా?

తప్పుకుండా వుంది. కేవలం వైవిధ్యమే కాదు, ఒక సగటు తెలుగు సినిమా నుంచి సగటు ప్రేక్షకుడు ఏమి ఆశిస్తాడో ఆ ఎలిమెంట్స్ అన్నీ వున్నాయి.

అంటే నవరసాలు వున్నాయంటారా?

అలా అని కాదు, మాంచి పాటలు, డ్యాన్స్ లు, ఫైట్లు కామన్. వాటితో పాటు అంతర్లీనంగా ఓ సందేశం, ఫ్యామిలీ ఎమోషన్లు, కనీసం కొందరైనా వాళ్లకి వాళ్లు ఐడెంటిఫై చేసుకునేలాంటి ఒకటి రెండు పాత్రలు. ఆపై వినోదం ఇలా అన్నమాట. 

మిగిలిన మీ ఏజ్ గ్రూప్ హీరొలతో పోల్చుకుంటే మీరెందుకు వైవిధ్యమైన సబ్జెక్ట్ ల కన్నా, రెగ్యులర్ ఫార్మాట్ కథల వైపు మొగ్గు చూపుతున్నారు?

అలా అని ఏమీ నిబంధన పెట్టుకోలేదు. నా దగ్గరకు వచ్చిన కథల్లో మంచివి ఎంచుకుంటున్నాను. ఇవే చేస్తానని అనలేదు. అలాంటివి చేయననీ అనలేదు. ఎవరు ఏమాత్రం వైవిధ్యమున్న సబ్జెక్ట్ తో వచ్చినా చేసేందుకు నేను రెడీ. బహుశా నాకు, నా బాడీ లాంగ్వేజ్ కు ఇలాంటి కథలు నప్పుతాయని అనుకుని, వాటితోనే వస్తున్నారేమో?

సక్సెస్ రేషియో అంతగా లేని దర్శకులను ఎంచుకోవడం వెనుక?

సక్సెస్, ఫెయిల్యూర్ అనేది ఒక్క ప్రాజెక్టుతో డిసైడ్ చేసేస్తే, ఇక్కడ చాలా మంది ఒక్క ఫెయిల్యూర్ తో ఇక కనిపించకుండా వెళ్లిపోవాలి. కానీ మరో అవకాశం వచ్చి, బౌన్స్ బ్యాక్ అయిన వాళ్లు ఎంతో మంది వున్నారు. అయినా నేను కథ మాత్రమే చూస్తాను.కథ బాగుంటే బాగా చేయగల సత్తావున్న వాళ్లే నేను చేస్తున్న, చేయబోతున్న వాళ్లంతా.

వినాయక్ తో సినిమా ఎలా వుండబోతోంది?

ఆయన లెవెల్ అందరికీ తెలిసిందే కదా? ఆ లెవెల్ కు ఏ మాత్రం తగ్గకుండా వుంటుంది. నన్ను మరో మెట్టు ఎక్కించేలా వుంటుంది.

ఇప్పటి దాకా మీ కెరీర్ ను వెనక్కు తిరిగి చూసుకుంటే..?

అంత లాంగ్ కెరీర్ కాదు కదా నాది. ఏదో అలా అడుగు ముందుకు, వెనక్కు వేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నా. మరింత జాగ్రత్తగా వెళ్లాలని మాత్రం అనుకుంటున్నా.

జవాన్ గురించి ఏం చెప్తారు జనానికి?

ప్రతి కుటుంబం కోసం జవాన్ లా నిల్చునే వాడు ఒకడు వుంటాడు. జనంలోనూ అలాంటి వాళ్లు ఎందరో? అందుకే జవాన్ సినిమా ఓసారి చూడండి.. దట్సాల్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?