Advertisement

Advertisement


Home > Movies - Interviews

ఈ సినిమా తర్వాత ఇక పెళ్లే - నిఖిల్

ఈ సినిమా తర్వాత  ఇక పెళ్లే - నిఖిల్

అందరిలో ఒకడిగా కాదు, తన దారి తనది, తన సినిమాలు తనవి, తన ప్రయత్నాలు తనవి. ఇదే హీరో నిఖిల్ ప్రస్థానం. స్వామిరారా సినిమా దగ్గర నుంచి తన రూట్ ఏమిటో తను క్లియర్ గా తెలుసుకున్నాడు. ఆ బాటలో సాగిపోతున్నాడు.

శంకరాభరణంతో కాస్త ఎదురు దెబ్బ తిని, మళ్లీ మరోసారి తన వైవిధ్యమైన బాటలో ఎక్కడికిపోతావు చిన్నవాడా అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఈ సందర్భంగా హీరో నిఖిల్ చిట్ చాట్.

శంకరాభరణం షాక్ నుంచి తేరుకుని మళ్లీ సినిమాతో రావడానికి కాస్త ఎక్కువ టైమ్ నే పట్టినట్లుంది.

సినిమాకు గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. ఇదేమీ షాక్ కాదు. అన్ని సినిమాలు మనం అనుకున్నట్లే ముందుకు వెళ్లవు కదా? ఇది ఎవరికైనా కామన్. లాస్ట్ ఇయర్ నావి రెండు సినిమాలు విడుదలయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్ లు ఇచ్చాక ఒక డిస్సపాయింట్ మెంట్. అంతే. మళ్లీ వచ్చే ఏడాది రెండు సినిమాలు వుంటాయి.

డిఫరెంట్ సబ్జెక్ట్ లే మీకు రైట్ ట్రాక్ అని మీకు క్లియర్ అయినట్లుంది

నిజంగా. ప్రేక్షకులు నా సినిమాలు అంటే ఏ అయిడియాతో వుంటారో అర్థం అయిందన్నది వాస్తవం. ఆ దిశగానే సబ్జెక్ట్ లు వింటున్నాను. నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నా.

ఒకేసారి ముగ్గురు హీరోయిన్లతో. అదేనా ఈ సినిమాలో వైవిధ్యం..ఇంకేమన్నా?

అయ్యో...హీరోయిన్లు ముగ్గురు అన్నది కథ కోసం. అసలు కథంతా వేరు..సినిమా చూస్తారుగా?

ఆత్మలు, దెయ్యాలు అంటున్నారు..హర్రర్ జోనర్ లోకి కాస్త లేటుగా ఎంటర్ అయినట్లున్నారు.

ఈ సినిమా కేవలం హర్రర్ జోనర్ కాదు. నవరసాలు వున్నాయి. ప్రేమ, ఫ్యామిలీ, భయం, ఫన్ ఇలా అన్నీ. 

ట్రయిలర్ లో ఒక్క డ్యూయట్టూ చూపించలేదు. 

లేదండీ. ఫన్, లవ్ ఇలా వేరే వేరే టీజర్లు కట్ చేసాం..కాస్త ఆలస్యమైంది రిలీజ్ చేయడంలో.

సినిమా మేకింగ్ కూడా ఆలస్యమైంది. దీనిపై చాలా గ్యాసిప్ లు కూడా.

సినిమా ఆలస్యానికి ఒక కారణం కాదు. ముగ్గురు హీరోయిన్లు, కాంబినేషన్ లు, కాల్ షీట్ లు, ఇలా చాలా వున్నాయి. 

నిర్మాతతో సమస్యలని..

అబ్బే అదేం లేదండీ. నా తపన అంతా సినిమా బాగా రావాలి. నాకు సక్సెస్, నిర్మాతకు డబ్బులు రావాలి. అంతే తప్ప మరేం లేదు. ఇండస్ట్రీలో తెలిసిందే గా, సౌండ్ కన్నా రీసౌండ్ ఎక్కువ వుంటుంది. 

ఓవర్ బడ్జెట్ అయిందా?

అదేం లేదండీ. ఈ సినిమాకు, ఈ సబ్జెక్ట్, ఈ స్టార్ కాస్ట్ కు ఇంతకన్నా తక్కువలో ఎవరూ ప్రొడ్యూస్ చేయలేరు. పైగా మంచి బిజినెస్ జరిగింది. నేను, నిర్మాత ఇద్దరం హ్యాపీ.

సినిమాల్లో మీ జోక్యం ఏ మేరకు

కథ విని, ప్రాజెక్ట్ ఓకె చేసి, ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయ్యేవరకు. ఆ తరువాత ఇక కెప్టెన్ డైరక్టరే. ఆయన ఎలా చెబితే అలా చేసుకుపోవడమే.

ఈ సినిమాకైనా మీరు పూర్తి రెమ్యూనిరేషన్ అందుకున్నారా? స్ట్రగుల్ కాకుండా మీ సినిమాలు విడుదల కావేమో?

పూర్తి రెమ్యూనిరేషన్ అందుకున్న సినిమాలు చాలా వున్నాయండీ. శంకరాభరణం, సూర్య వెర్సస్ సూర్య. స్ట్రగుల్ అంటారా? సినిమా నిర్మాణం అంటే చిన్న విషయం కాదు. అయినా ఫైనల్ ప్రొడక్ట్ బాగా వచ్చినపుడు ఇవేవీ పెద్ద విషయాలు కావు. 

ఈ సినిమాకు ప్రచారం కూడా కాస్త సమస్య అయినట్లుంది?

డబ్బింగ్ సినిమా అనుకోండి. తక్కువలో తీసి, ఎక్కువ ప్రచారం మీద ఖర్చుచేయచ్చు. అయినా ఈ సినిమాకు లోటేం చేయలేదు. ఈ నోట్ల సమస్య అదీ అనుకోకుండా మీద పడడం వల్ల కాస్త ఇబ్బంది అయిందంతే.

మీ ఏజ్ హీరోలంతా మాస్ మాస్, యాక్షన్ అంటుంటే, మీరు ఆ రూట్ పూర్తిగా వదిలేసినట్లుంది

సుధీర్ వర్మతో చేస్తున్న సినిమా ఓ మాంచి డిఫరెంట్ సినిమా అండీ. అందులో యాక్షన్ వుంటుంది. కానీ అది కూడా భలేగా వుంటుంది.

టాలీవుడ్ హీరోలంతా ప్రేమలు అంటున్నారు..రెడ్ల అమ్మాయిలు ఎక్కడున్నారా అన్ని చూస్తున్నట్లుంది..మరి మీరు.

అయ్యో..అదేం లేదండీ. అమ్మ నాన్న ఎవర్ని చూపిస్తే వారినే. వాళ్లు అదే పనిలో వున్నారు.

ఎప్పుడో సూర్య వెర్సస్ సూర్య టైమ్ లో హ్యాట్రిక్ హిట్ తరువాత పెళ్లి అన్నారు. మళ్లీ మరో హ్యాట్రిక్ వస్తే కానీ చేసుకోరా?

ఈ సారి పక్కా. ఈ సినిమా హిట్ అయిపోనీండి. ఇక పెళ్లే.

చందు మొండేటి తో మళ్లీ సినిమా ఎప్పుడు? 

ఆయన కమిట్ మెంట్ లు, నా కమిట్ మెంట్లు పూర్తి కాగానే వుంటుంది. 

సుధీర్ సినిమా తరువాత?

రెండు మంచి సబ్జెక్ట్ లు విన్నాను. ఫైనల్ చేయాలి. పెళ్లిచూపులు డైరక్టర్ స్క్రిప్ట్ వాటిలో ఒకటి. 

ప్రతి సినిమా తరువాత ప్రచారం కోసం వెళ్లడం మీకు అలవాటేగా..ఈ సినిమా తరువాత కూడా

బయ్యర్లు రమ్మంటున్నారు. చూద్దాం. వెన్నెల కిషోర్, హీరోయిన్లు కూడా వెళ్దాం అంటున్నారు.

సో, సక్సెస్ కు, సక్సెస్ టూర్ కు ప్రిపేర్ అయిపోతున్నారన్నమాట. కంగ్రాట్స్

థాంక్స్ అండీ. అందరి బ్లెస్సింగ్స్, కోపరేషన్ అంతే.

విఎస్ఎన్ మూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?