cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Interviews

నా పద్దతులు అన్నీ మార్చేసాను-వంశీ

నా పద్దతులు అన్నీ  మార్చేసాను-వంశీ

వంశీ అనగానే మన జనాలకు రాయడానికైనా చెప్పడానికైనా గుర్తు వచ్చేది గోదావరే. ఆ జిల్లాలో పుట్టి, ఆ జిల్లా మాటను, ఆ జిల్లా జనాలను, ఆ జిల్లా గ్రామాలను ఎంతగా ప్రేమిస్తాడో, అంతకు రెట్టింపు ప్రేమిస్తాడు గోదావరిని. పైగా ఆయన సినిమాలు చాలా వరకు గోదావరి నేపథ్యంలో చిత్రీకరించినవే.

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేని వంశీ లేటెస్ట్ గా ఫ్యాషన్ డిజైనర్ లేడీస్ టైలర్ తో ప్రేక్షకుల ముందుకు కొత్తగా వస్తున్నారు.

ఈ సినిమాలో మారిన వంశీని చూస్తారని ఆయన అంటున్న వంశీతో ముఖాముఖి

ఫ్యాషన్ డిజైనర్..పల్లెటూరిలోనా?

ఇది లేడీస్ టైలర్ కొడుకుగా పుట్టి, ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకున్న కుర్రాడి కథ. పల్లెటూరి నుంచి పట్టణానికి వెళ్లి ప్యాషన్ డిజైనర్ కావాలని ఓ కుర్రాడు చేసిన ప్రయత్నాలు. ఆ ప్రయత్నాల్లోంచి పుట్టిన హాస్యం.

ఇంకా పల్లెటూళ్లు అలాగే వున్నాయంటారా? అరుగలపై కుట్టుమెషీన్లు వున్నాయంటారా?

చాలా మంది ఇలాగే అనుకుంటున్నారు. కానీ నేను ఆ మధ్య కృష్ణభగవాన్ వాళ్ల స్వంత గ్రామం, ఈస్ట్ గోదావరి గొల్లల మామిడాడ దగ్గర వుంటే వెళ్లాను. అక్కడ రెండు గంగరావి చెట్లు, మధ్యలో ఇల్లు, అరుగు, దానిపై మెషీన్ తో ఓ పెద్దాయిన. మరేమంటారు?

ఇది సీక్వెల్ నా? రీమేక్ నా? రీమిక్స్ నా?

కచ్చితంగా చెప్పాలంటే ఏదీ కాదు. లేడీస్ టైలర్ ఛాయలు అయితే వుంటాయి. కానీ అదే కథ కాదు. తండ్రిలాగే మంచి పనితనం వున్న కుర్రాడు. పట్నం వెళ్లి ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంటాడు. అందుకు డబ్బులు కావాలి. మరి దానికోసం ఏం చేసాడు అన్నది కథ.

వంశీ అంటే సకుటుంబ హాస్యం. లేడీస్ టైలర్ కూడా విషయం ఏదయినా సినిమా అలాగే వుంటుంది. కానీ ఫ్యాషన్ డిజైనర్ ఏ సర్టిఫికెట్ కు తగినట్లు కనిపిస్తోంది.

లేడీస్ టైలర్ కూ ఏ సర్టిఫికెట్ నే అప్పట్లో. సర్టిఫికెట్ అయితే ఏ ఇచ్చారు కానీ సెన్సారు వాళ్లు ఏ అక్షింతలు వేయలేదు. ఈ సినిమా కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. భయం లేదు.

వంశీ పాటలు అంటే అదో స్టయిల్. వంశీ హీరోయిన్లు అంటే నల్లంచు తెల్లచీరలు, పెద్ద బొట్టు, వగైరా. ఈ సినిమాలోనూ అదేనా?

లేదు ఈ సినిమా వేరుగా వుంటుంది. నా పద్దతులు అన్నీ మార్చేసాను. ఎక్కడో తప్ప, నా స్టయిల్ కనిపించదు. పాటలు అన్నీ చిత్రీకరణ వేరు వేరుగా వుంటుంది.

బట్టలసత్యం, థమ్ లాంటి వాళ్లు లేని లోటు పూడ్చగలిగారా?

లేదు. వాళ్లకు రీప్లేస్ మెంట్ కష్టం. అయితే కొత్తవాళ్లని కొందరిని పరిచయం చేస్తున్నాను. కచ్చితంగా మంచి పేరు తెచ్చుకుంటారు.

తొలి రోజుల్లో సితార, ఆలాపన లాంటి హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్లు వుండే సినిమాలు తీసి, కామెడీ బాట పట్టేసారు. ఎందువల్ల?

ఆలాపనపై చాలా ఆశలు పెట్టుకున్నాను. కానీ సరిగ్గా ఆడలేదు. కామెడీ వైపు వెళ్లాలని వుండేది. దాంతో అటు వెళ్లాను అక్కడ చాలా హిట్ లు రావడంతో అటే సెటిల్ అయిపోయాను.

కథకుడిగా ఇంత పేరు తెచ్చుకున్న మీరు, మీ సినిమాలకు కథలకు , మాటలకు వేరే  వాళ్లపై ఎందుకు ఆధారపడుతున్నారు?

ఇక్కడా నా కథలే చదివి, అక్కడా నా కథలే చూడ్డమా ? అని ఓ అనుమానం. బాపుగారు అన్నారు. మంచి కథలు రాస్తావు. సినిమాలకు వాటిని వాడకుండా, ఏవో చేస్తావు ఏమిటి? అని? అయినా ఏమిటో అలా అయిపోతోంది.

ఇప్పుడు అంతా థ్రిల్లర్లు అంటున్నారు. మీరు ఆ రోజుల్లోనే అన్వేషణ తీసారు.

అవును, ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ అల్యూమినియం ఫ్యాక్టరీలో కనిపించి, ఇక్కడే ఈ స్పాట్ లోనే అన్వేషణ 2 తీయచ్చు కదా? అని అన్నారు. అలా అని కాదు కానీ, అన్వేషణ లాంటి థ్రిల్లర్ ఒకటి హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఫ్లాన్ చేస్తున్నాను.

కొత్త ఆలోచనలు ఏమన్నా చేస్తున్నారా?

కొన్ని డిటెక్టివ్ కథలు తీసుకుని, వెబ్ సిరీస్ చేద్దామనే ఆలోచన వుంది. అలాగే మరో ప్రాజెక్టు కూడా డిస్కషన్లలో వుంది.

ఇంతకీ ఫ్యాషన్ డిజైనర్ ఎలా వచ్చింది?

మీరు హాయిగా, నిశ్చితంగా నిద్రపొండి అన్నారు నిర్మాత మధుర శ్రీధర్. ఆ కాంప్లిమెంట్, ఆ భరోసా చెబుతోంది సినిమా ఎలా వచ్చిందో?

ధాంక్యూ, బెస్టాఫ్ లక్

థాంక్యూ