Advertisement

Advertisement


Home > Movies - Interviews

నాకు నచ్చాలి..నాకు నప్పాలి - వరుణ్ తేజ

నాకు నచ్చాలి..నాకు నప్పాలి - వరుణ్ తేజ

మెగా హీరోల్లో విభిన్న ధోరణి వరుణ్ తేజది. ఆ మాటకు వస్తే, మనిషి ఆహార్యం కూడా విభిన్నమే. మెగా హీరోలందరిలో పొడవు, అందరికన్నా కలర్, పైగా చేసేవి క్లాస్ సినిమాలు. ఇలా అన్నీ కలిసి మెగా హీరోల మధ్య వైవిధ్యంగా నిలబెట్టాయి వరుణ్ తేజను. పక్కా మాస్ ఫన్ ఎంటర్ టైనర్లు అందిస్తూ, టాలీవుడ్ లో ఇది శ్రీనువైట్ల స్టయిల్ అని ఓ ఫార్ములా తయారుచేసి పెట్టిన దర్శకుడు శ్రీనువైట్ల. ఇలా అటు క్లాస్, ఇటు మాస్ కలిసి చేస్తున్న సినిమా మిస్టర్. ఈ శుక్రవారం మిస్టర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో వరుణ్ తేజతో చిట్ చాట్.

*మిస్టర్ అని కంచెలో హీరోయిన్ తో ఓసారి అనిపించేసుకున్నారు. మళ్లీ ఇది మరోసారినా?

నిజంగా కథ, టైటిల్ రెండూ విన్నపుడు ఆ విషయం గుర్తుకురాలేదు. తరువాత ఫేస్ బుక్ లో నా ఫ్యాన్స్ ఆ సినిమా బిట్ టాగ్ చేస్తుంటే అప్పుడు గుర్తుకు వచ్చింది. 

*రెండు ఫ్లాపుల తరువాత శ్రీనువైట్లకు అవకాశం?

ఆ మాటకు వస్తే లోఫర్ ముందు పూరి గారికి కూడా పెద్దగా విజయాలు లేవుగా? శ్రీనుగారు, పూరిగారు వీళ్లంతా ఏమిటో నాకు తెలుసు. వాళ్లకు వుండే కసి తెలుసు. అన్నింటికి మించి వాళ్లు చెప్పిన కథకు కనెక్ట్ అయ్యాను కాబట్టే ఒకే అన్నాను.

*అంటే లోఫర్ విషయంలో నో రిగ్రెట్స్.

అబ్సల్యూట్ లీ. ఆ సినిమా షూట్ ను ఎంతో ఎంజాయ్ చేసాను. నిజానికి ఆ సినిమాకు నాకు మంచి అప్లాజ్ వచ్చింది. ఎమోషనల్ సీన్లు బాగా చేసారని. అలాగే ఫైట్లు బాగా చేసారని. వరుణ్ తేజ కోసం ఇలాంటి పాత్రలు కూడా ట్రయ్ చేయవచ్చని అన్నారు. అంటే ఆ సినిమా వల్ల నాకు లాభమేగా. ఎక్కడో కొంచెం తేడా, జనాలకు రీచ్ కావడంలో. పైగా విడుదల తేదీ కూడా సరికాదని అనుకుంటాను.

*అసలు వైవిధ్యమైన కథలు ఎన్నుకోవడం మీకు ఎలా పట్టుబడింది?

కథలు విన్నపుడు నేను ఆ పాత్రకు సూటవుతానా? కానా అన్నది కీలకంగా చూస్తాను. ఆ తరువాత ఆ కథ బాగుందా లేదా అన్నది ఆలోచిస్తాను. ఒక్కోసారి నాకు నప్పవు అని వదిలేసినవి పెద్ద హిట్ లు అయినవీ వున్నాయి. కానీ అవి నాకు సూట్ కావు అంతే. అలాగే నాకు నచ్చలేదు అన్నవి ఫ్లాప్ అయినవీ వున్నాయి, హిట్ అయినవీ వున్నాయి. హిట్ అయితే నా జడ్జ్ మెంట్ తప్పు అనుకుంటాను. అన్నిసార్లు మన జడ్జ్ మెంట్ కరెక్ట్ కావాలని లేదు కదా.

*సినిమా స్టార్ట్ చేసాక, అనుకున్నట్లు వస్తోందో లేదో గమనిస్తారా? రష్ చూడడమేనా, ఫైనల్ ప్రొడక్ట్ చూస్తారా?

కంటిన్యూగా మోనటరింగ్ చేయడం సరికాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే నేను హీరోను మాత్రమే. మేకర్ని కాదు. మేకర్ కు తెలిసినంత నాకు తెలియదు అని అనుకుంటాను. అందుకే ఎడిట్ సూట్ లో కూర్చోవడం, మిగిలిన వ్యవహారాల్లో వేలుపెట్టడం వంటివి నేను చేయను. మీకో ఉదాహరణ చెబుతాను. మిస్టర్ సినిమాలోనే ఓ ట్యూన్ నాకు అంతగా నచ్చలేదు. కానీ శ్రీనువైట్ల సినిమాలు అన్నీ మ్యూజికల్ హిట్ లే. అంటే ఆయనకు మంచి జడ్జిమెంట్ వుంది ఆ విషయంలో. అందువల్ల ఈ ట్యూన్ కూడా జనాలకు నచ్చుతుందేమో అని పైకి ఏమీ చెప్పకుండా ఊరుకున్నా. ఇప్పుడు అదే పాట అన్నింటికన్నా బాగా వింటున్నారు. అందువల్ల నేను మరీ ఎక్కువగా సినిమా పనిలో ఇన్ వాల్వ్ అయిపోను.

*మెగా హీరోలంటేనే మాస్ ఫాలోయింగ్. కానీ మీకు లోఫర్ ప్రయత్నం సక్సెస్ కాలేదు. మళ్లీ ట్రయ్ చేస్తారా?

ట్రయ్ అంటూ లేదండీ. మంచి సబ్జెక్ట్ వస్తే చేస్తాను. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ వుంది కొత్తగా వుందనిపించింది చేస్తున్నా. దీని తరువాత రెండూ కూడా లవ్ అండ్ రొమాంటిక్ జోనర్లే. అలా వచ్చాయి అంతే. 

*తొలిసారి ఇద్దరు హీరోయిన్లతో చేస్తున్నట్లున్నారు. ఎలా వుందీ అనుభవం?

ఇద్దరు కూడా మాంచి ఫైర్, కసివున్న ఆర్టిస్టులు. మంచి ఫెర్ ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటారు. పైగా ఓ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు సమానమైన పాత్రలు దొరకడం కష్టం. అలాంటిది ఈ సినిమాలో కుదిరింది. అందుకే బాగా వచ్చింది.

*ఈ సినిమా బన్నీ చేయాల్సిందట కదా?

అది రాంగ్ గా వెళ్లిందండీ న్యూస్ లోకి. వాస్తవానికి ఈ కథ బన్నీకి తెలుసు. నా దగ్గరకు శ్రీనుగారు చెప్పినపుడు ఆ సంగతి నాకు తెలియదు. తెలిసిన తరువాత కనుక్కుంటే, సత్యమూర్తి తరువాత మళ్లీ క్లాస్ సినిమా అంటేకాదు, వరుణ్ కు బాగుంటుందని బన్నీనే సజెస్ట్ చేసాడని తెలిసింది. అంతే కానీ బన్నీ రిజెక్ట్ చేయడం మాత్రంకాదు.

*సజెస్ట్ అంటే గుర్తుకు వచ్చింది. ఫిదా సినిమాను మీకు రామ్ చరణ్ సజెస్ట్ చేసారట కదా?

అవును. ఆ సినిమా రామ్ చరణ్ చేయాల్సింది. నాకు చెప్పాడు కూడా. ఓ ఢిఫరెంట్ సినిమా ఓకె చేసాను అని. కానీ తరువాత శేఖర్ కమ్ముల నా దగ్గరకు వచ్చారు. అదేంటీ అని చరణ్ కు ఫోన్ చేసా. నాకు కుదరడంలేదు. నువ్వు ఓకే చేసావా? అని అడిగారు. చేసా అన్నాను. మంచి సినిమా వచ్చింది ప్రొసీడ్ అన్నాడు.

*ఎలా వుంది శేఖర్ కమ్ములతో ఎక్స్ పీరియన్స్?

అది చాలా డిఫరెంట్ అండీ. స్క్రిప్ట్ లో డైలాగ్ అలాగే చెప్పాలి అంటారు శ్రీనువైట్ల. స్క్రిప్ట్ లో డైలాగ్ అర్థం చేసుకుని, నీ స్టయిల్ లో, నా లాంగ్వేజ్ లో చెప్పు అంటారు శేఖర్ కమ్ముల. ఆయనదంతా ఓ డిఫరెంట్ నాచురల్ స్కూలు. ఆయన కూడా ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వర్క్ చేస్తున్నారు.

*పూరి, శ్రీనువైట్ల, ఇప్పుడు శేఖర్ కమ్ముల అంతా ఆ కసితో మీ దగ్గరకు వచ్చిన వారే కదా?

ఆ కసి చూసే నేను వారితో పని చేస్తున్నా అనుకోండి.

*తొలిసారి కొత్త దర్శకుడితో చేయబోతున్నారు. అవును. బోగవిల్లి ప్రసాద్ గారి నిర్మాణంలో. నిజానికి నేను చాలా మంది కొత్తవారి కథలు ఎన్నోసార్లు, ఎప్పుడో విన్నా. కానీ ఒక్కటీ సెట్ కాలేదు. ఈ కథ వినగానే ఓకే చేసా. కొత్తవాళ్లతో చేయకూడదన్న నియమం ఏమీలేదు.

*మీ సిస్టర్ రెండో సినిమా సంగతేమిటి?

మా సిస్టర్ కు నటనకు అవకాశం వున్న పాత్రలు కావాలి. కానీ అలాంటివి మన తెలుగులో ఎన్నివస్తాయి? ఓ తమిళ్ సినిమాలో అలాంటి చాన్స్ వచ్చింది. చేస్తోంది.

*మీ డామీ మీ స్క్రిప్ట్ లు వినడం, మీ సినిమాలు చూడడం.

నేను విన్న తరువాతే ఆయన వింటారు. అలాగే సినిమా విడుదలయ్యాకే థియేటర్లో చూస్తారు. ముందు చూడడానికి ఆయనకు భయం. చూడరు. 

*మిమ్మల్ని ఇద్దర్ని నటుల్ని చేసారు. ఇంటివాళ్లను ఎప్పుడు చేస్తారు?

ట్రాడిషన్లు మిస్ కాను నేను. ముందు చెల్లి పెళ్లి కావాలి. ఆ తరువాతే నాది. కానీ తనకు ఇప్పటికి ఆ ఆలోచన లేదు. తొందరలేదు. అందువల్ల ఇంకా చాలా అంటే చాలా టైమ్ వుంది.

*మీ సినిమాల విషయంలో మీరు ఆలోచించేది ఇంకేమైనా వుందా?

మరి కాస్త పబ్లిసిటీ వుంటే బాగుంటుందని అనిపిస్తుంటుంది. హిందీ సినిమాలు పబ్లిసిటీ విషయంలో బాగా చేస్తున్నాయి. మన దగ్గర మాత్రం ఇంకా ఆ తరహా రావడంలేదు. పబ్లిసిటీ అంటే ప్రకటనలు, ప్రెస్ మీట్లే కాదు, ఇంకా చాలా రకాలుగా చేయాలి. రాజమౌళి గారు ఆ విషయంలో మార్కెట్ ను బాగా పసిగట్టారు. సినిమాను ఎలా, ఎన్ని విధాల, ఎన్ని రకాల ప్రమోట్ చేయాలో అంతా చేస్తున్నారు.

*ఇంతకీ మిస్టర్ ఫైనల్ కాపీ చూసారా? ఎలా వుంది?

చూసానండీ. నాకయితే హ్యాపీ. మంచి ప్రొడెక్ట్ వచ్చిందనిపించింది. ఇక ప్రేక్షకులే కదా అసలైన జడ్జ్ లు. వాళ్ల నిర్ణయం కోసమే వెయిటింగ్.

విఎస్ఎన్ మూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?