cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Interviews

నాకు నప్పే సబ్జెక్ట్ లే చేస్తాను - శిరీష్

నాకు నప్పే సబ్జెక్ట్ లే చేస్తాను - శిరీష్

అల్లు శిరీష్. మెగా క్యాంప్ అనే భవనానికి కింగ్ పిల్లర్ లాంటి అల్లు అరవింద్ తనయుడు. టాలీవుడ్ టాప్ స్టార్ ల్లో ఒకరైన అల్లు అర్జున్ సోదరుడు. తను కూడా హీరో కావాలని ప్రయత్నం ప్రారంభించి రెండు సినిమాలు చేసి, మూడో సినిమా దగ్గరకు వచ్చాడు.  సోలో, యువత, లాంటి యూత్ ఫుల్ ఫ్యామిలీ సినిమాలు అందించిన  పరుశురామ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా. ఈ సినిమాతో మరోసారి శిరీష్ ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. మంచి ప్రీ పబ్లిసిటీతో, పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా శిరీష్ తో ఇంటర్వూ.

గౌరవం, కొత్త జంట, ఈ రెండు సినిమాలు..ఏం పాఠాలు నేర్పాయి.?

మనకంటూ ఓ స్థాయి లేకుండా ఇలాంటి మెసేజ్ సినిమాలు చేయకూడదు అని గౌరవం నేర్పింది. ముందుగా జస్ట్ క్యాజువల్ లుక్, క్యాజువల్ నటన వుండే సినిమాలు చేసాక, కాన్సెప్ట్, సీరియస్ నెస్ వున్న సినిమాలకు వెళ్తే బెటర్ అని కొత్త జంట నేర్పింది.

సబ్జెక్ట్ పరంగా సరే, నటన పరంగా, క్రిటిక్స్ పరంగా?

యా. నటన అన్నది ఎప్పటికీ ఇంప్రూవ్ చేసుకుంటూనే వుండాల్సిన వ్యవహారం. ఈ రెండు సినిమాలు చేసిన తరువాత అన్నయ్య, నాన్నగారు చాలా సలహాలు ఇచ్చారు. పక్కవాళ్లని చూసి, వాళ్లేదో చేస్తున్నారని నువ్వు చేయవద్దు. మామూలుగా నువ్వు చాలా జోవియల్ గా, ఫ్రీగా వుంటావు. అలాగే కెమేరా ముందు కూడా వుండు. అలాంటి సబ్జెక్ట్ లే టేకప్ చేయి. ఇలా చాలా చెప్పారు. అన్నయ్య అయితే గెటప్ పరంగా కూడా హెయిర్ ఇలా వుంటే బాగుంటుంది. ఇలా చాలా చెప్పాడు.

మెగా హీరోలు అన్నా, మెగా ఫ్యాన్స్ అన్నా మాస్ మసాలా సినిమాలు పడాలేమో?

నిజమే. కానీ నాకు కంఫర్ట్ జోనర్ ఇదే అని అనుకుంటున్నాను. మే బీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా చేస్తానేమో? ఇప్పటికైతే ఇలాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్, యూత్ ఫుల్ సినిమాలే.

మరి మెగాభిమానులు ఏక్సెప్ట్ చేస్తారా?

అలవాటు పడతారు. రెండు మూడు ఇలాంటి సినిమాలే చేస్తే, శీరీష్ అంటే ఇలాంటి సినిమా అయి వుంటుంది అని అనుకుంటారు. అయినా మెగా హీరోలు అందరు మాస్ సినిమాలు చేస్తే, ఇలాంటి సినిమా చేసేవాళ్లు కూడా వుండాలి కదా?

అసలు బేసిక్ గా మీకెలాంటి సినిమాలు ఇష్టం?

మురారి, పరుగు, సోలో, మిస్టర్ పెర్ ఫెక్ట్ ఇలా ఇటు యువతకు నచ్చే అంశాలు వుంటూ, ఫ్యామిలీ సెంటిమెంట్లు కూడా మిళితం కావాలి. అలా అని డ్రామా వుండకూడదు.

అరవింద్ లాంటి భారీ ప్రొడ్యూసర్ అంటే మీ సినిమా మగధీర లెవెల్లో వుండాలేమో?

అదేం లేదు. నేను ముందుగా చేసింది ముంబాయ్ లో జర్నలిజమ్ అండ్ మాస్ కమ్యూనికేషన్స్. అందువల్ల నాకు కాస్త మంచి సబ్జెక్ట్ ల మీదే దృష్టి తప్ప, భారీ సినిమాల మీద కాదు. గౌరవం లాంటి సినిమాను ఫస్ట్ సినిమాగా తీసుకోవడానికి కూడా నాలో వుండే ఆ అభిరుచే కారణం.

చిరంజీవి గారు మీరు ప్రొడ్యూసర్ అవుతారేమో అనుకున్నారట. అవుతారా ఎప్పటికైనా?

చెప్పలేనండీ. ఇప్పటికైతే నో. ఎందుకంటే కోట్ల రూపాయిల బడ్జెట్ హ్యాండిల్ చేయాలంటే చాలా విషయాలపై అవగాహన వుండాలి. చాలా నేర్చుకోవాలి. అందువల్ల ఇప్పట్లో అది సాధ్యం కాకపోచవ్చు.

సరే, ఇంతకీ ఈ సినిమా ఎలా వచ్చింది?

చాలా బాగా. ఫస్ట్ కాపీ చూసాం. నేను, డాడీ, మామయ్య, అన్నయ్య అందరం. అందరికీ నచ్చింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని పూర్తి నమ్మకం వుంది. పరుశురామ్ చాలా మంచి డైలాగులు రాశారు. అన్ని విధాలా సినిమా జనాలకు నచ్చుతుందనే నమ్మకం వుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా జోవియల్ గా వుంటుంది. సెకండాఫ్ ఫామిలీ టచ్ వుంటుంది. అలా అని డ్రామా ఎక్కడా వుండదు. అంతా నాచురల్ గానే సాగుతుంది.

ఈ సినిమాకు చాలా టైమ్ తీసుకున్నారు. పైగా రీషూట్ లు జరిగాయని టాక్?

అలాంటిది అస్సలు లేదండీ. ఏం చేసినా స్క్రిప్ట్ లెవెల్ లోనే. డాడీ స్క్రిప్ట్ లెవెల్ లోనే చాలా స్ట్రిక్ట్ గా వుంటారు. అక్కడ ఓకె అయ్యేదాకా ఆయన సెట్ మీదకు వెళ్లరు. అందువల్ల రీషూట్ క్వశ్చనే రాదు. ఈ సినిమా కాదు, ఆయన తీసే ఏ సినిమాకైనా కూడా. ఇక టైమ్ తీసుకోవడం అన్నది స్క్రిప్ట్ ను బాగా తయారుచేయడానికి, పైగా ఈ సినిమా ప్యాడింగ్ కాస్టింగ్ కూడా ఎక్కువే. అందరి డేట్ లు సింక్ కావాలి. ఇలా తప్పని సరి కారణాలే తప్ప వేరు కాదు.

ఈ చిన్న సినిమాకు ఏడు కోట్ల వరకు బడ్జెట్ అవసరమా?

చిన్న సినిమా అంటే దేన్ని బట్టి? నన్ను పక్కన పెట్టండి. ఇందులో స్టార్ కాస్ట్ చూడండి. హీరోయిన్ దగ్గర నుంచి. అలాగే సినిమా లొకేషన్లు. టెక్నికల్ టీమ్. సో, ఆ క్వాలిటీ కావాలన్నపుడు ఆ మాత్రం ఖర్చు తప్పదు కదా.

తరువాత సినిమా సంగతులు?

అది కూడా ఇలాగే మంచి సబ్జెక్ట్ అండి. అయితే అందులో కాస్త విలన్, చిన్న ఫైట్ ఇలాంటి అదనపు వ్యవహారాలుంటాయి.

ఈ సినిమాతో మీ కెరీర్ గాడిలో పడి చకచకా ముందుకు వెళ్లిపోతుందని ఆశించవచ్చా?

తప్పకుండా అండి. అలా అని హడావుడిగా సినిమాలు చేసేయాలని నాకు లేదు. నాకు తగిన స్క్రిప్ట్ లు వస్తేనే చేస్తా. అది కూడా పూర్తిగా క్వాలిటీ, క్లారిటీ రెండు వుండేలా చూసుకుంటూ చేస్తా.

ఓకె. థాంక్యూ, బెస్టాఫ్ లక్.

థాంక్యూ అండీ

విఎస్ఎన్ మూర్తి

 


×