Advertisement

Advertisement


Home > Movies - Interviews

నేను బాగా స్పిరుట్యువల్... ఎన్టీఆర్

నేను బాగా స్పిరుట్యువల్... ఎన్టీఆర్

ఎన్టీఆర్..జూనియర్..బుడ్డోడు..తారక్..ఇలా ఇలా ఎన్ని పేర్లున్నా..అభిమానులకు మాత్రం..హీరో. తాత రూపు రేఖల్నే కాదు..వాచకాన్ని, అభినయాన్ని పుణికి పుచ్చుకున్న అదృష్టం. మూడు పదులు దాటిన వయసుకే ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూసేసిన అనుభవం..పాతిక సినిమాలు వెనకేసుకున్న వైనం..దాదాపు మూడు నాలుగు రోజులుగా 'నాన్నకు ప్రేమతో' సినిమా పై కబుర్లు చెప్పి,చెప్పి అలిసిన తారక్ ను 'గ్రేట్ ఆంధ్ర' ప్రత్యేకంగా పలకరించింది. ఎన్టీఆర్ అంతరంగాన్ని తెలుసుకునే చిన్న ప్రయత్నం చేసింది..ఆయన గుండె గదికి వున్న చిన్న కిటికీ తెరిచి చూసింది..ఎన్ని చిత్రాలో..ఇంత చిన్న వయసులో..చిత్రమేమిటంటే..తారక్ ను ప్రశ్న వేస్తుంటే, ఆఖరి అక్షరం పలికేలోగా, ఆయన సమాదానం మొదటి పదం వినిపించేస్తుంది. అస్సలు తడుముకోరు.. తడబడరు.. సమాధానం సిద్దంగా వుంటుంది... అవలోకించండి మీరు కూడా.

ఫంక్షన్ లలో, ఇతరత్రా మిమ్మల్ని పరిశీలిస్తుంటే..ఎప్పుడూ ఏదో ఆలోచనలో వున్నట్లు అనిపిస్తుంది.?

అవునండి..నేను ఎప్పుడు ఆలోచనల్లోనే వుంటారు. నిజమండి..చిన్నప్పటి నుంచీ అంతే. అలా అని ఏమిటో తెలియదు..ఏమిటి ఆలోచిస్తానో తెలియదు. ఏదో ఒకటి మాత్రం ఆలోచిస్తూనే వుంటాను. మీకు తెలుసా..ఇప్పుడు మీతో మాట్లాడుతూ కూడా ఈ టేబుల్, దీనిపై ఈ వస్తువులు, ఇలాగే ఎందుకు వున్నాయి..ఇలా ఏదో ఆలోచన.

ఎందువల్ల అంటారు?

తెలియదు. అందుకే నేను ఒంటరిగా వుండాలనుకోను. చుట్టూ జనాలు వుండాలనుకుంటాను. అప్పుడయినా ఈ ఆలోచనలు నన్ను చుట్టుముట్టవేమో అని. 

కానీ మీ అడియో ఫంక్షన్లు, పబ్లిక్ ఫంక్షన్లు చూస్తుంటే, అక్కడా మీరు ఇలాగే..

అవునండీ..అది కూడా నిజమే. 

చిన్నప్పటి పరిస్థితులు లేదా పెరిగిన వాతావరణం కూడా కారణం కావచ్చంటారా?

కావచ్చు. నేను లోన్లీగా పెరిగాను. అమ్మ..నేను..అంతే. అంటే చుట్టాలు లేరని కాదు. పిన్ని, ఇంకా చాలా మంది వున్నారు. కానీ ఎక్కువగా ఫ్రెండ్స్ తో వుండేవాడిని కాదు. ఇంట్లో అమ్మతోనే ఎక్కువగా వుండేవాడిని.

కానీ మీరు చిన్నప్పుడు అల్లరి బాగా చేసేవారని..

అదీ నిజమే..చాలా అల్లరిగా వుండేవాడిని..అంతెందుకు ఈ మధ్యదాకా కూడా వుండేది అల్లరి. ఇదిగో ఇప్పుడు కొడుకు పుట్టాక..ఒక్కసారిగా మాయం అయిపోయింది. నాకేంటో..నేను పెద్దవాడిని అయిపోయాను అనిపించేస్తోంది. వయసు హటాత్తుగా మీద పడినట్లు అనిపిస్తోంది. 

మీరు స్పిరుట్యువల్ నా? డివోషనల్ నా?

నేను బాగా స్పిరుట్యువల్ అండీ..కర్మ సిద్దాంతాన్ని బాగా నమ్ముతాను. ఎక్కడో ఏదో వుంది అంటే కాదు. సూపర్ నాచురల్ పవర్ అంటూ ఒకటి వుంది. ఈ భూమ్మీద చేసిన తప్పులు ఇక్కడే తీర్చేయాలి..అంతే కాదు..మన తల్లితండ్రులు చేసిన పుణ్యం వల్ల మనం ఇలా వుండగలిగాం..నిజం. నా తల్లితండ్రుల పుణ్యమే ఇప్పుడు నా స్థితి. నేను చేసే పుణ్యమే రేపు నా కొడుక్కు పనికి వచ్చేది.

అంటే పూజలు అవీ బాగా చేస్తారా?

లేదండీ..నా భావాలు స్పిరుట్యువల్ అంతే. దేవుడ్ని నమ్ముతాను. అందులో సందేహం లేదు. 

ఇది ఎక్కడి నుంచి వచ్చింది..అమ్మ నుంచేనా?

అవును..అమ్మ బాగా డివోషనల్, స్పిరుట్యువల్. మీకు తెలుసా..ఓ దశలో అమ్మను చూస్తే భయం వేసేది..ఎక్కడ సన్యాసుల్లో కలిసిపోతుందో అని. అంతటి డివోషనల్.

మీ వయసులో అంతా షార్ట్ టెంపర్ తో వుంటారు..మీరు షార్ట్ ఎమోషనల్ అనుకుంటా?

అవునండీ..నేను ఏదీ దాచుకోలేను. నవ్వొస్తే నవ్వేయడం..ఏడుపొస్తే ఏడ్చేయడం..

అది కూడా నిజమే..మీరు నటుడే కానీ, మీ ఫీలింగ్స్ దాచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయరెందుకు? ఈ రంగంలో జీవితంలో కూడా నటన తప్పదు కదా?

లేదండీ..నాకు రాదు. నా ముఖం నా ఫీలింగ్స్ ను ఇట్టే చెప్పేస్తుంది. పైగా నేను ఎమోషనల్ అయితే ఇట్టే బరస్ట్ అవుతాను. లోపల అగ్నిపర్వతం పెట్టుకుని, నవ్వుతూ ఎలా వుంటామండి? కక్కేయడమే.

కానీ దీనివల్ల మీతో వున్నవారికి ఇబ్బందేమో? ముఖ్యంగా మీ శ్రీమతికి?

లేదు..పైగా ఆమెకు నేను అలా వుండడమే ఇష్టం. తను నన్ను అలాగే వుండమంటుంది.

మీ వయస్సువాళ్లలో తక్కువగా కనిపించే మెచ్యూరిటీ మీలో కాస్త ఎక్కువగా వుంటుంది? ఎలా సాధ్యమైంది?

అనుభవం..చిన్నప్పటి నుంచి నేర్చుకున్న అనుభవం. 17వ ఏట నుంచీ ప్రపంచాన్ని చూస్తూ పెరిగాను. డ్యాన్స్ ప్రదర్శనలకు, ఇతరత్రా వాటికి అన్నింటికీ నేనే ఒంటరిగా వెళ్లేవాడిని. నా పనులు నేనే చేసుకోవాలి. ఎవరి సాయం లేదు. దాంతో ఎత్తుపల్లాలు అన్నీ చూసాను.

చిన్నప్పుడు మీరు మిస్ అయింది..ఇప్పుడు మీరు మీ కొడుక్కు ఇవ్వాలనుకుంటున్నారా?

నేనేం మిస్ కాలేదండి. మా నాన్న నన్ను ఇండిపెండెంట్ గా పెంచారు.నన్నే కాదు అన్నయ్యలు ఇద్దరిని కూడా. నేను నా కొడుకును అలాగే పెంచుతాను. ఇండిపెండెంట్ గా.

హరికృష్ణ కొడుకు గొప్పా? తారక్ కొడుకు గొప్పా?

రెండూ కాదండీ..మనం ఎంతండి..మనం ఎవరండి..ఆయన (ఎన్టీఆర్ ఫోటో వైపు చూపిస్తూ)..ఆయన లేకుంటే నేనెవరు..జస్ట్ తారకరామారావు..అంతేగా..ఎన్టీఆర్ గొప్ప నటుడనో, గొప్ప రాజకీయవేత్త అనో అనడం లేదండీ..గొప్ప సోల్.. గొప్ప మనిషి.. అలాంటి వాళ్లు చాలా రేర్ గా పుడతారండి..వాళ్ల ముందు మనం ఎంత. ఆయన మనవడిగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. 

మీ చిన్నతనంలో లోన్లీనెస్..పెద్దయ్యాక కాస్త అందరూ దగ్గరయ్యారు..మళ్లీ ఇప్పుడు మిమ్మల్ని కార్నర్ చేస్తున్నారు..ఓ మూలకు తోస్తున్నారు అని ఏమైనా అనిపిస్తోందా?

లేదండి..చిన్నప్పుడు కూడా అన్నయ్యలు, నాన్న వున్నారు. కాస్త తక్కువగా కలయిక..ఇప్పడు బాగా పెరిగింది అనుబంధం. ఇక నన్ను మూలకు తోయడం అవీనా..నేను అవేం ఆలోచించనండీ..అలాంటివి అన్నీ ఆలోచిస్తే మనమేం చేయలేం..మరి ముందుకు వెళ్లలేం. ఆ మూలనే వుంటాం..అందుకే అస్సలు అవేం పట్టించుకోను.

కానీ మీరు చేయనది చేసారని, అననది అన్నారని, ఇలా లేనివి మీమీదకు వస్తే..

ఏం చేయమంటారు? ఎంతమందికి చెప్పమంటారు..నేను అనలేదు..నేను చేయలేదు..అని టైమ్ వేస్ట్. నేనేంటో నాకు తెలుసు. నేను అన్నానో లేదో తెలుసు..నేను చేసానో లేదో తెలుసు. ఇంకెందుకు అదే తలుచుకుని బాధపడడం. 

ఇలా మాట్లాడుతుంటే పెద్దరికం బాగా వచ్చినట్లు అనిపిస్తోంది?

వచ్చినట్లు ఏమిటండీ..నాకయితే కొడకు పుట్టాక వయసైపోతోంది అనిపిస్తోంది. ఏముంది..ముఫై, నలభై, యాభై, అరవై..మహా అయితే అటో ఇటో పోతాం..అంతేగా.

మీ వయసు కుర్రాళ్లలో కనిపించనది..మరోటి..మీ ఉచ్చారణ..వాడే తెలుగు పదాలు?

మా చిన్నప్పడు ఓ తెలుగు టీచర్ వుండేవారండీ..ఆమె బాగా నేర్పారు నాకు మాట్లాడడం. మరి ఆమె ఎందుకు నేర్పిందో..నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. నా కొడుకు ఎక్కడ డాడీ అంటాడో అని భయపడ్డాను. కానీ నాన్నా అమ్మా అంటున్నాడు. మమ్మీ డాడీ తప్పు అని కాదు. కానీ అమ్మ, నాన్న అంటే ఆ పదాల్లో ఏదో గొప్పదనం వుందండీ.

మరి కాస్త గట్టి పదాలు వాడుతుంటారు..ఎక్కువగా చదువుతుంటారా?

అస్సలు చదవనండీ..నాకు భయం. ఇంతంత నవలలు, కథలు ఎలా రాస్తారా? అని. అందుకే చదవను. కానీ వింటాను..

ఏం వింటారు?

ఎవరు మంచి విషయాలు చెప్పినా వింటాను. మీరు మాట్లాడండి..గంట అయనా వింటాను. వక్కంతం వంశీ మంచి రచయిత..రాజీవ్ కనకాల మంచి సాహిత్య నేపథ్యం వున్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఇలాంటి వాళ్లంతా నా చుట్టూ వుంటారు..మంచి విషయాలు చెబుతుంటారు. నేను అలా వింటూనే వుంటాను. అలాగే బాల రాయాయణం చేయడం కూడా నాకు పనికి వచ్చింది. మల్లెమాల గారు ఎన్నో నేర్పారు అప్పట్లో.

ఖాళీ దొరికితే ఏం చేస్తారు?

ఇప్పుడైతే నా కొడుకుతో ఆడుకోవడమే. వాడిని చూడకుండా వుండలేకపోతున్నాను. లండన్ లో షూటింగ్ కోసం వున్నన్ని రోజులు ఎంత కిందామీదా అయిపోయానో? నాకు వంటబాగా వచ్చు..ఇంట్లో ఖాళీ వుంటే వండేస్తాను.

మీకు మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలు వున్నాయి కదా..వాటిని పేపర్ పై పెట్టచ్చు కదా..ఏదైనా రాయచ్చు కదా.?

నిజమే..రాయాలనే వుంటుంది..ఏకంగా ఆత్మకథ రాసేస్తాను (నవ్వేస్తూ) ఒకటి మాత్రం నిజం..ఇలాంటి ప్రశ్నలు ఇంతవరకు నన్ను ఎవరూ అడగలేదు..మీతో ఓ పూట మాట్లాడుతూ కూర్చోవాలని వుంది. ఖాళీ దొరకగానే కబురు చేస్తాను.

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి

[email protected]

https://twitter.com/vsnmurty

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?