cloudfront

Advertisement


Home > Movies - Interviews

నిర్మాణం వేరు.. డిస్ట్రిబ్యూషన్ వేరు

నిర్మాణం వేరు.. డిస్ట్రిబ్యూషన్ వేరు

వర్తమాన తెలుగు సినిమా చలన చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ బ్యానర్లకు కాస్త విలువ వుంది. వాటిల్లో వారాహి చలనచిత్ర ఒకటి. ఈ బ్యానర్ అధినేత సాయి కొర్రపాటిది భిన్నమైన వ్యక్తిత్యం. ఒక పక్క బ్యానర్ విలువ నిలబడేలా చిన్న పెద్ద సినిమాలు. మరోపక్క కమర్షియల్ గా ఆడతాయి అంటే చాలు డిస్ట్రిబ్యూటర్ గా కొనడం. ఇంకోపక్క రెండో చేతికి తెలియకుండా గుళ్లు గోపురాలకు దాన ధర్మాలు..మరోపక్క మంచి మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రచురింప చేసి, వితరణ చేయడం. ఇవి కాక ఎక్కడ విపత్తు వచ్చినా లక్షలు ఖర్చు చేసి కనస్ట్రక్టివ్ వర్క్ చేపట్టడం..ఇవన్నీ ఒక ఎత్తు..ఇటు రాజమౌళి అండ్ బ్రదర్స్ అటు బాలయ్య లతో కుటుంబ సాన్నిహిత్యం. 

ఇలా వైవిధ్యమైన వ్యక్తిత్వం కలిగి, జీవితం సాగిస్తున్న సాయి కొర్రపాటి లేటెస్ట్ డిస్ట్రిబ్యూషన్ వెంచర్ గుంటూరు టాకీస్..ఈ సినిమా విడుదల సందర్భంగా చిన్న చిట్ చాట్.

పంపిణీ వేరు.. నిర్మాణం వేరు

వారాహి చలన చిత్ర అంటే ఓ పేరు వుంది..అదంటే ప్రేక్షకులకు ఓ అంచనా వుంది. అది నాకు తెలుసు. కానీ నేను ఆ బ్యానర్ పై మంచి సినిమాలు అందించాలంటే డబ్బులు కావాలి. అలా కావాలి అంటే డిస్ట్రిబ్యూషన్ ఆపకూడదు. కమర్షియల్ గా జనం ఏం చూస్తారు అన్నవి పంపిణీ చేస్తాను.. ఏం చూడాలి అన్నవి నిర్మిస్తాను. నేను వచ్చింది పంపిణీరంగం నుంచి అని మరిచిపోకూడదు మీరు. ఒకప్పుడు బళ్లారి ప్రాంతానికి మాత్రమే పంపిణీ దారుఢిని. ఇప్పుడు కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నా. అలా చేస్తున్న అనేక సినిమాల్లో గుంటూరు టాకీస్ ఒకటి. గొప్ప సినిమా అని చెప్పడం లేదు. మాస్ ప్రేక్షకులు కాలక్షేపం కోసం కచ్చితంగా చూసే సినిమా అని మాత్రం చెబుతాను. పంపిణీ చేసిన సినిమాలకు వారాహి బ్యానర్ వుండదు.. నిర్మించిన సినిమాలకే ఆ బ్యానర్.

డబ్బులు వచ్చిన ప్రతీదీ పెద్ద సినిమానే

ఈగ చిన్న సినిమాగా ప్రారంభమై పెద్ద సినిమా అయింది. లెజెండ్ నేను తీసిన రెండో పెద్ద సినిమా. అవి మినహా అన్నీ చిన్న సినిమాలే. కానీ ఒక్క మాట. రెండు కోట్లతో సినిమా తీస్తే, నిర్మాతకు రెండు కోట్లు లాభం వస్తే అది చిన్న సినిమా అని ఎలా అనగలం? మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆయనతో సినిమా చేస్తున్నా.. మన టాప్ హీరోలు ఎలాగో అక్కడ ఆయన అలాగ.. అది చిన్న సినిమా ఎలా అవుతుంది?

గత ఏడాది 150 సినిమాలకు పైగా విడుదలయ్యాయి. నిర్మాతలకు డబ్బులు వచ్చిన పది సినిమాల పేర్లు చెప్పండి. మహా అయితే ఎనిమిది వుంటాయి. పరిశ్రమ అలా వుంది. ఇక్కడ మనం చెప్పినా వినరు.. వద్దన్నా మానరు. ఇక్కడకు వచ్చేవారు డెభై శాతం గ్లామర్ కోసమో, పేరు కోసమో వస్తారు.. డబ్బులు కావాలని, ఇక్కడే వుండి.. ఇక్కడే పెరిగిన వారు జాగ్రత్తగానే వుంటారు.

అయిదు సినిమాలు

నారా రోహిత్..తారకరత్న కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నాం. తారకరత్నకు చెప్పా.. ఆయన గ్రహించాడు.. ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇక దూసుకుపోతాడు. ఇక మోహన్ లాల్ ..గౌతమి కాంబినేషన్ లో యేలేటి చంద్రశేఖర్ లో ఓ సినిమా చేస్తున్నా..అవసరాల శ్రీనివాస్ డైరక్షన్ లో నాగశౌర్య-నారారోహిత్ లతో ఓ సినిమా చేస్తున్నాం. లెజెండ్ నిర్మాణ కాంబినేషన్ లోనే బాలయ్య బాబు వందో సినిమా వుంటుంది. ఆయన ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత నందమూరి వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా కూడా మా బ్యానర్ కే ఇస్తారు బాలయ్య బాబు.

బాహుబలి 2

బాహబలి పార్ట్ వన్ ఎన్ని ఏరియాల పంపిణీ చేసానో, అంతకన్నా ఓ ఏరియా ఎక్కువే చేస్తాను పార్ట్ 2 కూడా. విజయవాడకు పంపిణీ రంగాన్ని విస్తరించాను. విశాఖకు కూడ విస్తరించాలి. ఎందుకుంటే ఇవ్వాళ డిస్ట్రిబ్యూటర్లు దొరకడం లేదు. సినిమాలు భయంకరంగా విఫలం కావడం కూడా ఓ కారణం. 

బాలయ్య బాబు

నేను స్ట్రయిట్ గా మనసులో మాట చెప్పేస్తా.. బాలయ్య బాబు కూడా అంతే. అందుకే ఆయనతో నాకు కుదిరింది. ఆయన మనిషిగా నాకు ఇష్టం.ఇప్పుడు హిందూపూర్ లో చేపడుతున్న పనులు చూస్తుంటే రాజకీయ నాయకుడిగా కూడా ఇష్టం ఏర్పడిపోతోంది.

నో పబ్లిసిటీ.. తోచింది చేయడమే

నాకు పబ్లిసిటీ ఇష్టం వుండదు. భగవంతుడిని నమ్ముతాను. అందుకే గుళ్లు గోపురాలు తిరుగుతాను. వాటికి నాకు చేతనయింది చేస్తాను. లక్ష్మీనరసింహ స్వామి, దుర్గలపై మంచి పుస్తకాలు వేసి అందరికీ అందించాను. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అయిదు వాహనాల్లో నేను ప్రచరించిన దుర్గ పుస్తకం వుంటుంది. అది ఆ అమ్మ దయ. త్వరలో ఆంజనేయ స్వామిపై పుస్తకం వేస్తున్నా.  సినిమా వాళ్లకు పబ్లిసిటీ ఇష్టం కావచ్చు.. తప్పు లేదు. నా మటుకు నేను చేసుకు వెళ్లడం..ఇలా ఎవరైనా అడిగితే చెప్పడం తప్ప.. నో పబ్లిసిటీ.

మరిన్ని సినిమాలు

ఈ రంగంలో కొన్నాళ్లు వుండాలి. కొన్నయినా బ్యానర్ విలువ నిలబెట్టే సినిమాలు తీయాలి. మంచి చిన్న సినిమాలకు దన్నుగా నిలవాలి. అంతే అంతకన్నా మరేం లేదు.

విఎస్ఎన్ మూర్తి