cloudfront

Advertisement


Home > Movies - Interviews

వైవిధ్యమైన సినిమాలకే ఇక ప్రాధాన్యత

వైవిధ్యమైన సినిమాలకే ఇక ప్రాధాన్యత

నారా రోహిత్ అనగానే బాణం సినిమా గుర్తుకొస్తుంది ఇప్పటికీ.. మరి కాస్త ఆలోచిస్తే సోలో.. ఇంకాస్త దృష్టి పెడితే ప్రతినిధి. ఇవన్నీ మరే హీరో టచ్ చేయని జోనర్లకు చెందిన సినిమాలు,. ఇలాంటి సినిమాలే హీరో నారా రోహిత్ బలమూ.. బలహీనత కూడా. రోహిత్ సినిమా అంటే చాలు జనం ఈ వైవిధ్యాన్నే ఆశిస్తారు. అందువల్లే రోహిత్ తను రొటీన్ మాస్ సినిమాల వైపు మొగ్గాలని, తనకూ అందరు హీరోల్లా వున్న ఆ చిన్న సరదా తీర్చకోవాలని ప్రయత్నించినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పుడు మరో సినిమా అందిస్తున్నాడు.. అదే 'రాజా చేయి వేస్తే'. ఈ నేపథ్యంలో రోహిత్ తో ముఖాముఖి.

రాజా చేయి వేస్తే... హిట్టయిపోతుందా?

చేయి వేస్తే అని కాదు... కానీ.. హిట్ అవ్వాలనే కోరిక. 

అసలు ఏమిటీ రాజా చేయి వేస్తే..?

కొత్త కథ అని చెప్పను.. కానీ స్క్రీన్ ప్లే పరంగా చాలా కొత్తగా వుంటుంది. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి కి మంచి భవిష్యత్ కు బాట వేస్తుంది అని చెప్పగలను.. మంచి సినిమా చూసాం.. అన్న ఫీల్ అయితే జనాలకు ఇస్తుంది అని అనుకుంటున్నాను. 

బంధుత్వం వున్న ఇద్దరు నాయకులు.. ప్రతి నాయకులుగా నటించడం.?

అది అలా సెట్ అయింది అంతే. నిజానికి సాయిగారు నా కన్నా ముందే ఈ సినిమా తారకరత్నను బుక్ చేసుకున్నారు. ఆ తరువాతే హీరోగా నేను ఎంటర్ అయ్యాను. తారక రత్నది చాలా పవర్ ఫుల్ రోల్. బాగుంటుంది.

బాణం నుంచి.. అసుర వరకు ఒకటి.. అక్కడి నుంచి తుంటరి.. సావిత్రి.. ఇప్పుడు ఇది.. ఎలా వుందనిపిస్తోంది మీ ట్రాక్?

మీరన్న పాయింట్ అర్థం అయింది. నాకు కూడా వైవిధ్యమైన సినిమాలు చేయాలన్నదే కోరిక. అయితే... ఎక్కడో చిన్నది వుంటుంది కదా..మనం కూడా ఓ మాస్ సినిమా చేద్దాం. లేదా ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లోకి వళ్దాం అని. అలా చేసిన ప్రయత్నాలే తుంటరి.. సావిత్రి. 

మాన్ కరాటే సినిమా చూసి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ వుంటుంది.. బాగుంటుందేమో అని చేసాను. సరైన ఫలితం రాలేదు. సావిత్రి మీద మాత్రం మంచి అంచనాలు పెట్టుకున్నాను. సోలో మాదిరిగా మళ్లీ మరో ఫ్యామిలీ సినిమా అవుతుంది అనుకున్నాను. కానీ ఎక్కడో చిన్న తేడా వచ్చింది. 

సో.. ఇప్పుడు ఇక మాస్ సినిమా కోరిక పక్కన పెట్టేసారా?

మాస్ సినిమా అని కాదు.. వైవిధ్యమైన పాయింట్ వుంటేనే చేయాలని అనుకుంటున్నాను. అలా వచ్చిన సినిమా మాస్ ఎలిమెంట్స్ వుంటే అది వేరు.

మీ సినిమాల మీద వచ్చిన కామెంట్లు..మీ మీద వచ్చిన గ్యాసిప్ లు చూస్తుంటారా?

ఆ.. అప్పుడప్పుడు..

ఏమనిపిస్తుంది..?

లైట్ తీస్కోవడమే అండీ.. కొన్ని కొన్ని వున్న విషయాలే అయితే, సరే, మనం దీన్ని మార్చుకోవాలి అనుకుంటాను. కానీ ఒక్కోసారి లేనివి కూడా రాస్తుంటారండీ..అప్పుడే కొంచెం బాధనిపిస్తుంది. మళ్లీ సర్లే, మన పని మనం చేసుకుందాం అనుకుంటూ వుంటా.

మీ ఫిజిక్ మీద ఎక్కువగా కామెంట్లు వస్తున్నట్లున్నాయి.?

అవి నిజమే కదండీ.. తగ్గాలని నాకూ వుంది. కానీ సమయం చిక్కడం లేదు. ప్రయత్నం ఆపడం లేదు. ఇక ఒక్కటే మార్గం. ఓ ఆరునెలలు సినిమాలు ఆపేసి, సిన్సియర్ గా వర్కవుట్లు చేయాలి..అప్పుడు కానీ రిజల్ట్ రావడం కష్టం. 

ఎందువల్ల మీకు అనుకోకుండా ఈ ఫిజిక్ వచ్చేసింది.?

నాకూ తెలియదండీ.. నేను గ్రహించేలోగానే వచ్చింది. ఇప్పుడు కంట్రోలు చేసాను. పెరగడం ఆగింది. ఇక తగ్గడం మిగిలింది.

మీ పెదనాన్న సిఎమ్ కావడం వల్ల మీ కేరీర్ కు ఏమన్నా అడ్వాంటేజ్ వుందా?

అలాంటిదేం లేదండీ. నా నిర్మాతలందరూ మీకు తెలిసిన వాళ్లే. వాళ్లకు ఏ పొలిటికల్ నేపథ్యం లేదు.. జస్ట్ సినిమాలు తీయాలని అనుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన వారే. నేను కూడా నా పని నాదే అనుకోవడం తప్ప, మిగిలినవి పట్టించుకోను. ఇక ఫ్యామిలీ అంటారా? మరి చిన్నప్పటి నుంచీ అందరం కలిసే పెరిగాం. అది ఎలాగూ వుంటుంది.. వదులేసుకోరు కదా ఎవరైనా? 

రాబోయే సినిమాలు.?

చాలా వున్నాయి. నా ఓన్ ప్రొడక్షన్ అప్పట్లో ఒకడుండేవాడు.. అలాగే 'కథలో రాజకుమారి'.. ఇక సాయి గారితో మళ్లీ ' జో అచ్యుతానంద' అన్నీ మంచి సినిమాలే అవుతాయి. ఇంకా మరికొన్ని డిస్కషన్లో వున్నాయి.

ఇప్పుడు మీకు ప్రొడక్షన్ అవసరమా? నిర్మాతలకు లోటు లేదు కదా?

అలా అని కాదండీ.. నిజం చెప్పనా, నాకు ఏక్టింగ్ కన్నా సినిమా మేకింగ్ ఇష్టం. అసలు ముందుగా నిర్మాత అవుదామనే అనుకున్నా. ఇప్పటికీ సినిమా నిర్మించడం అంటే నాకు ఇష్టం. 

మీరు కూడా ప్రతినాయకుడి షేడ్ వున్న పాత్రలు వైపు చూస్తారా.?

వైనాట్..మంచి పాత్ర అయితే చాలు..అది హీరో అనా? దానికే షేడ్స్ వున్నాయి అని కాదు. కథలో మన పాత్ర కీలకం కావాలి.

సో.. ఇకపై రెగ్యులర్ గా అభిమానులను అలరించబోతున్నారు.?

అదే ప్రయత్నం..

బెస్టాఫ్ లక్

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి