cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Interviews

యూట్యూబ్ చూస్తుంటే అసహ్యం.. చూడాలంటే భయం

యూట్యూబ్ చూస్తుంటే అసహ్యం.. చూడాలంటే భయం

పక్కింటి కుర్రాడి లుక్స్. హుషారుగా సినిమాలు, వైవిధ్యమైన కథలు. ఎవడే సుబ్రహ్మణ్యం అని డౌట్ పడితే, జెంటిల్ మన్ అనిపిస్తాడు. సరే అనుకుంటే కాదు పక్కా లోకల్ అంటాడు. అవునేమోలే అనుకుంటే మిడిల్ క్లాస్ అబ్బాయిని అంటాడు. ఇలా ఒకదానికీ మరోదానికీ పొంతన లేని వ్యవహారం. ప్రతి నాలుగు నెలలకు ఓ సినిమా చేసి వదలడం.

అందరూ బ్యానర్లను, డైరక్టర్లను ఎంచుకుని పంచుకుంటూ వుంటే, మంచి కథ తెచ్చిన వాడే డైరక్టర్, ఆ డైరక్టర్ డేట్లు ఎవరి దగ్గర వుంటే వాళ్లే నిర్మాతలు అనే రకం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరినైతే నేల క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ వరకు అభిమానిస్తున్నారో? అతగాడే నాని. హీరో నాని. కృష్ణార్జున యుద్దం అని టైటిల్ పెట్టి, కృష్ణుడు, అర్జునుడి కలిసి చేసే యుద్దం అంటున్నాడు లేటెస్ట్ గా. రాక్ అర్జునిగా, మాస్ కృష్ణుడిగా నాని డబుల్ రోల్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటర్వూ.

ప్రతి సినిమా విడుదల ముందు కాన్ఫిడెంట్ గానే వుంటారు. ఈ సినిమా మీద ఏ మేరకు?

పక్కా కమర్షియల్ సినిమా. నా నుంచి కోరుకునే ఎంటర్ టైన్ మెంట్ సినిమా. ఇక దర్శకుడు గాంధీ స్టయిల్ అందరికీ తెలిసిందే.

మీకు ఫన్ ఎంటర్ టైన్ మెంట్లు ఇచ్చిన విజయాలను యాక్షన్ ఎంటర్ టైనర్లు ఇవ్వలేదు. మళ్లీ చాన్నాళ్ల తరువాత యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ వుంటుంది కానీ చాలా తక్కువే. నా రెగ్యులర్ సినిమాల మాదిరిగా మాస్ ఎంటర్ టైన్ మెంటే ఇదీనూ.

ఈ సినిమా విషయంలో మీరు కాస్త ఎక్కువే ఇన్ వాల్వ్ అయ్యారని, ఎడిటింగ్ అంతా మీరే చూసుకున్నారని.

ఇలాంటి వార్తలు అన్నీ ఎలా పుడతాయో? నిజానికి మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా విషయంలో ఇన్ వాల్వ్ అయింది చాలా తక్కువ. అయితే దర్శకుడు గాంధీకి ఓ అలవాటు వుంది. ప్రతి విషయంలోనూ ఇద్దరు ముగ్గురి అభిప్రాయాలు తీసుకుంటాడు. అలా అడిగితే చెప్పడం తప్ప, ఇన్ వాల్వ్ మెంట్ లేదు.

నిడివి కట్ చేయడం లాంటివి ఏమైనా చేసారా?

సినిమా ఫైనల్ ఎడిట్ అయిన తరువాత నా దగ్గరకు వచ్చి చెప్పారు. ఇంత వచ్చింది లెంగ్త్ అంటూ. గాంధీ అన్నాడు. అన్నా నేను మాగ్జిమమ్ చేసాను. ఇక నువ్వేమైనా చెబితే చేస్తాను అని. సరే అని చూసాను. థియేటర్ బయటకు వచ్చి ఒకటే చెప్పా. ఇందులో తీయడానికి, కట్ చేయడానికి ఏమీ లేదు అని.

సినిమా తొలిసగం గంటా ఇరవై నిమషాల వరకు వుంటుంది. ఎందుకంటే ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు, పరిచయం, సాంగ్స్, ఫన్ అంతా కలిసి. మలి సగం చకచకా గంటలో ఫినిష్ అయిపోతుంది.

వుమెన్ ట్రాఫికింగ్ మీద సినిమా అంటున్నారు. మీకు ఫ్యామిలీ ఆడియన్స్ వున్నారు కదా? సమస్య రాదా?

అసలు సినిమాలో ఏమన్నా అభ్యంతరకరంగా వుంటే కదా? యుఎస్ నుంచి మా సిస్టర్ ఫోన్ చేసింది. ఇదే విషయం అడిగింది. మా మేనగోడల్ని సినిమాకు తీసుకువెళ్లవచ్చా? అని. హ్యాపీగా తీసుకెళ్లొచ్చు అని చెప్పా. సినిమాలో వన్ పర్సంట్ కూడా ఆ లైన్ వుండదు. ఇది ఆ కోణంలో ఇటు చూపే సినిమా కాదు. ఈ కోణంలో అటు చూపించే సినిమా.

ఎంసిఎ, నేను లోకల్, ఈ సినిమాలో కృష్ణ, ఇలా అన్ని పాత్రలు దాదాపు ఒకే విధంగా వున్నట్లు అనిపించడం లేదా? అలా అయితే నాని బోర్ కొట్టే ప్రమాదం వుంటుందేమో?

ఇక్కడ సమస్య ఏమిటంటే నేను ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్నాను. మూడు సినిమాలకు ప్రమోషన్లలలో కనిపిస్తున్నాను. ఇన్ని సార్లు, ఇన్ని సినిమాల్లో, బయట తరుచు కనిపించడం వల్ల నానిని చూడడం అలవాటైపోయి, కొత్తగా అనిపించడం లేదేమో కానీ, నేను చేస్తున్న అన్ని క్యారెక్టర్లు దేనికి అవే. వేటికీ పోలిక లేదు.

భలే భలే తరువాత మళ్లీ యువికి సినిమా చేయలేదు. గీతాలో సినిమా రాలేదు. ప్రత్యేకమైన కారణాలేమైనా వున్నాయా?

నాకున్న మంచి ఫ్రెండ్స్ లో యువి వంశీ, ప్రమోద్ ముందు వుంటారు. గీతా అరవింద్ గారు నాకున్న వెల్ విషర్లలో ఒకరు. ప్రతి సినిమాకు ఆయన చూసి, ఎక్కడున్నా ఫోన్ అన్నా చేస్తారు. మెసేజ్ అన్నా పెడతారు. ఇక సినిమా చేయడం అంటారా? నాది సింపుల్ ప్రిన్స్ పుల్. కథ మంచిది ఎవరు తెస్తే వారితోనే సినిమా. అది చిన్న బ్యానర్ నా, పెద్ద బ్యానర్ నా? చిన్న డైరక్టర్ నా, పెద్ద డైరక్టర్ నా అన్నది చూడను.

మీకు ఓ విషయం చెబుతాను. నేను ఫస్ట్ సినిమా చేసాక అందుకున్న తొలి అడ్వాన్స్ కెఎస్ రామారావు గారిది. ఆయనకు సినిమా చేయడం కుదరలేదు ఇంతవరకు. కారణం సరైన కథ సెట్ కాకపోవడమే.

మీ దగ్గరకు నేరుగా వచ్చిన ప్రాజెక్ట్ ఇచ్చి వుంటే అయిపోయేదేమో?

ఎక్కడ వస్తున్నాయి. ప్రతి కొత్త డైరక్టర్ ఏదో ఒక బ్యానర్ ద్వారానే నా దగ్గరకు వస్తున్నారు. దాంతో నచ్చితే ఆ బ్యానర్ కే చేయాలి. ఈ ఏడాది చివరిలో యువి బ్యానర్ లో సినిమా వుంటుందేమో?

తొమ్మిది కోట్ల హీరో అయ్యారన్న ప్రచారం నిజమేనా?

ఈ అంకెలకు ఏముంది? నేను నా రెమ్యూనిరేషన్ విషయంలో రేషనల్ గా థింక్ చేస్తాను. కథ ఏమిటి? ప్రాజెక్టు కాస్ట్ ఎంత? రిటర్న్ ఎంత వుండొచ్చు? అప్పుడు దానిని బట్టి ఎంత తీసుకోవాలో డిసైడ్ చేసుకుంటాను. నిర్మాతకు మిగులుతుంది అనుకుంటే అడుగుతాను , మిగలదన్నపుడు తగ్గించుకుంటాను.

త్రివిక్రమ్, సుకుమార్ లతో మీ పేరు వినిపిస్తోంది.

ప్రస్తుతానికి ఏ ప్రాజెక్టు అయితే లేదు. అది వాస్తవం. కానీ ఆ ఇద్దరికీ వుంది. నాకూ వుంది చేయాలని. కలిసినపుడల్లా అనుకుంటాం. నాకు సరిపోయే మంచి సబ్జెక్ట్ దొరికితే వారే చెబుతారు అని అనుకుంటూ వుంటాను.

మీరంటే రాజమౌళి గారికి చాలా అభిమానం. మరి ఆయనెపుడు చేస్తారో? చరణ్-ఎన్టీఆర్ సినిమాలో మీరూ వుంటారా?

చరణ్ - ఎన్టీఆర్ సినిమా చరణ్-ఎన్టీఆర్ సినిమానే. అది ఫిక్స్. ఇక నాతో సినిమా అంటారా? ఏమో? ఎప్పుడో?

నేను లోకల్, ఎంసిఎ సినిమాలు నాని కాబట్టి లాక్కు వెళ్లాడు అన్న టాక్ వచ్చింది. ఇలా ఎన్నాళ్లు లాక్కు వెళతారు మీ సినిమాలను?

కేవలం నేను లాక్కు వెళితే హిట్ అయితే, ఆ డైరక్టర్లకు మరో సినిమా రాకూడదు. కానీ నా సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం అయిన వారు, లేదా నా సినిమాలు చేసిన డైరక్టర్లు అందరూ ఫుల్ బిజీగా వున్నారు. అంటే వాళ్ల దగ్గర విషయం వున్నట్లేగా? సో నేను లాక్కు వెళ్తేనే హిట్ అన్నది కరెక్ట్ కాదనే అనుకుంటాను.

సమకాలీన రాజకీయ, మీడియా వ్యవహారాలు గమనిస్తుంటారా?

అన్నీ చూస్తాను. బాధపడుతుంటాను కూడా. ఎందుకంటే, డబ్బులిచ్చి చూసే సినిమాకు సెన్సారు వుంది. కానీ ఇంటిలో అందరూ వుండగా ఫ్రీగా వచ్చే టీవీ డిస్కషన్లో మాట్లాడే ఆ భాష, ఆ విషయాలు తలుచుకుంటేనే రోతగా వుంది. ఇళ్లలో చిన్నపిల్లలు వుంటారు. ఆడవాళ్లు వుంటారు. పెద్ద వాళ్లు వుంటారు. వాళ్లంతా టీవీ చూస్తుంటారు అన్న స్పృహ లేకుండా మాట్లాడేస్తున్నారు.

ఇక యూట్యూబ్ అన్నది చూడడానికే అసహ్యం వేస్తోంది. కేవలం కొన్ని క్లిక్ ల కోసం, కొన్ని హిట్ ల కోసం ఇష్టం వచ్చినట్లు హెడ్డింగ్ లు పెడుతున్నారు. శ్రీదేవి లాంటి మాంచి నటి, మన అందరికీ ఇష్టమైన నటి చనిపోతే, 'మా నాన్నను చంపేయాలనుంది అన్న కూతురు' అంటూ ఓ వీడియో. ఇలా కొన్ని వందలు, వేలు. జుగుప్సగా వుంది.

ఛానెళ్లు అనే విజువల్ మీడియా కొంత వరకు స్వీయ నియంత్రణ పాటించుకోవచ్చు. ఎందుకంటే అది రిజిస్టర్డ్ మీడియా కాబట్టి, కాస్త నియమ నిబంధనలు వున్నాయి కాబట్టి. కానీ ఈ యూట్యూబ్ లో ఎవరో? ఏమిటో? దీనిపై త్వరలో కాస్త మార్పు వస్తుందని అంటున్నారు. చూడాలి.

నాగార్జునతో సినిమా. ఎలా అనిపించింది షూట్ స్టార్ట్ అయ్యాక.

చాలా ఎగ్జయిటింగ్ గా. ఆయన ఇప్పటికీ యంగ్ అండ్ ఎనర్జిటిక్. ఆయన పక్కన చేయడం అంటే సినిమా చూసాక మీకే తెలుస్తుంది మా కాంబినేషన్ ఎలా వుండబోతోందో. అంతకన్నా ముందు ఈ కృష్ణార్జున యుద్ధం చూసి ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుందనే నమ్మకంతో చెబుతున్నా. చూడండి.

లోకేష్ సవాల్ చూస్తే.. బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు

దేవి సిక్స్ కొడితే...నేను రెండు సిక్సులు కొడ‌తా

 


×