జంటనగరాల సినిమా అభిమానులకు పండగే పండగ. సినిమా ఫంక్షన్లు అంటే రెక్కలు కట్టుకుని వాలిపోయే వారికి వరుసగా సంబరాలే. ఈనెల 1,2,3 తేదీల్లో వరుసగా సినిమా ఫంక్షన్లు ప్లానింగ్ లో వున్నాయి. అక్టోబర్ 1న విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా నోటా ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కాస్త డిఫరెంట్ గా వుండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి నోటా పబ్లిక్ మీట్ అని పేరుపెట్టారు. వరుసగా విజయవాడ, హైదరాబాద్ ల్లో వీటిని ప్లాన్ చేస్తున్నారు.
విజయవాడలో 30న, హైదరాబాద్ లో 1న ఇవి జరుగుతాయి. ఇక అక్టోబర్ 2న అరవింద సమేత వీరరాఘవ ఫంక్షన్ వుండే అవకాశం వుంది. ప్రస్తుతానికి ఈ డేట్ అని అనుకుంటున్నారు. హెచ్ ఐసిసిలో ఈ ఫంక్షన్ ను చాలా భారీగా జరపాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక అక్టోబర్ 3న ఈ ఏడాది బ్లాక్ బస్టర్లలో ఒకటైనా గీత గోవిందం సినిమా 50రోజుల వేడుక జరపాలని డిసైడ్ అయ్యారు. ఓ విధంగా ఇది నోటాకు ప్రీరిలీజ్ ఫంక్షన్ మాదిరిగా కూడా పనిచేసి, ఉభయతారకం అవుతుంది.
మెగా సెలబ్రిటీలు అంతా ఈ ఫంక్షన్ కు హాజరవుతారు. మొత్తంమీద మూడురోజులు సినిమా ఫంక్షన్ల పండగలన్నమాట.