ఏ ముహుర్తంలో స్టార్ట్ చేసారో దర్శకుడు కొరటాల శివ తన ఆచార్య సినిమాను. ఎవరిదో శాపం తగిలినట్లు ఏళ్లకు ఏళ్లుగా అలా నడుస్తోంది కానీ ధియేటర్లలోకి రావడం కనిపించడం లేదు. కొరటాల శివ పేరు సినిమా తెరమీద చూసి మూడేళ్లు అయిపోయింది. ఇంకెన్నాళ్లు పడుతుందో తెలియదు.
ఎందుకంటే సుదూరంలో ఆచార్యకు డేట్ కనిపించడం లేదు. అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ వస్తోంది. అది వస్తుందా? రాదా? అన్న అనుమానం వుండనే వుంది. ఆ అనుమానం మీదే ఆచార్య ఆశలు పెట్టుకుంది. ఆర్ఆర్ఆర్ రాకపోతే ఆ డేట్ కు రావాలని మరే డేట్ ను లాక్ చేయకుండా వుండిపోయారు.
కానీ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలు అన్నీ ఆర్ఆర్ఆర్ వాయిదా వేసి, సంక్రాంతికి వస్తే గట్టిగా అడ్డుకోవాలని, గిల్డ్ దగ్గర పంచాయతీ పెట్టాలని, థియేటర్లు ఇవ్వకూడదని ఇలాంటి రకరకాల వ్యూహాలు రచించడం ప్రారంభించాయి. అక్టోబర్ 13 అని ముందు నుంచీ చెబుతూ సంక్రాంతి మీద పడితే ఊరుకునేది లేదని గట్టిగా తీర్మానించుకున్నాయి ఈ సినిమాలు.
దాంతో కొరటాల శివ అర్జెంట్ గా, తెలివిగా జనవరి 12న విడుదల అని ప్రకటించే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అది ఎలా పొక్కిందో బయటకు పొక్కేసింది. దాంతో ఇప్పటికే సంక్రాంతికి విడుదల అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ రీమేక్ విడుదల జనవరి 12న అని ప్రకటించేసారు.
ఇప్పుడు కొరటాల శివ ఆచార్య రిలీజ్ డేట్ లేని అనాధ అయిపోయింది.