బాహుబలి 2 టార్గెట్ 400 కోట్లు

పారేసుకున్న చోటే వెదుక్కోవాలన్నది సామెత. బాహుబలి నిర్మాతలు ఈ దిశగానే వెళ్తున్నారు. బాహుబలి సినిమా తొలి భాగం పాపం, వారికి పేరు తెచ్చింది కానీ పైసలు కాదు. కొనుక్కున్న బయ్యర్లంతా సూపర్ గా లాభాలు…

పారేసుకున్న చోటే వెదుక్కోవాలన్నది సామెత. బాహుబలి నిర్మాతలు ఈ దిశగానే వెళ్తున్నారు. బాహుబలి సినిమా తొలి భాగం పాపం, వారికి పేరు తెచ్చింది కానీ పైసలు కాదు. కొనుక్కున్న బయ్యర్లంతా సూపర్ గా లాభాలు చేసుకున్నారు, పాత బాకీలు తీర్చుకున్నారు, కానీ నిర్మాతలకు మాత్రం ఖర్చులే గిట్టుబాటే అయ్యాయి.  విడుదల టైమ్ లో బాహుబలి పరిస్థితి అలాంటిది. 

సినిమా నిర్మాణంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు బంధుగణమే అందరూ. ఎన్నో సినిమాల అనుభవం వున్న రాఘవేంద్రరావే, తొలి భాగం విడుదలకు ఒకటి రెండు రోజులకు ముందు తన బంధు గణంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారని వినికిడి. ఇన్ని కొట్లు పెట్టి సినిమా తీసి, డెఫిసిట్ లో విడుదల చేయడం ఏమిటంటూ.. సరే అదంతా తొలి భాగం ముచ్చట. బాహుబలి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫేమస్ అయిపోయింది. ఆ సినిమా హక్కుల కోసం పోటా పోటీ పడుతున్నారు. పైగా పెద్ద పెద్ద రికమెండేషన్లు కూడా వస్తున్నాయి. 

తమిళ వెర్షన్ కోసం ఏకంగా చాలా పెద్ద రికమెండేషన్ నే వాడారని వదంతులు వున్నాయి. హిందీ, ఓవర్ సీస్ హక్కుల కోసం గట్టిపోటీనే వుంది. అయితే ఇప్పుడు బాహుబలి నిర్మాతలు, తొలి భాగంలో పొగొట్టుకున్న లాభాలు కూడా రెండో భాగంలో తెచ్చుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం అన్ని హక్కులు కలిపి 350 నుంచి 400 కోట్లు సంపాదించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తొలి భాగం అయిదు వందల కోట్లకు పైగా వసూళ్లు, శాటిలైట్లు అన్నీ కలిపి సాధించిందని వినికిడి. అందుకే కనీసం 350 నుంచి 400 కోట్ల వరకు విక్రయించుకోవచ్చని చూస్తున్నారు. 

ఓవర్ సీస్ మొత్తం వరల్డ్ రైట్స్ తీసుకోవాలని ఓ దుబాయ్ పార్టీ తెగ బేరాలు సాగించినట్లు వినికిడి. కానీ ఆఖరికి అది సెట్ కాక, ఇటీవలే యుఎస్ రైట్స్ మాత్రం ఒకరికి మాట ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అలాగే తమిళనాడు కూడా. ఇక పోతే రాజమౌళి ఫ్యామిలీ మెంబర్ లాంటి సాయి కొర్రపాటికి కర్ణాటక కేటాయించినట్లు వినికిడి. అయితే ఆయన సీడెడ్, కృష్ణా కూడా తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.  

బాహుబలి హీరో హోమ్ ఆర్గనైజేషన్ యువి క్రియేషన్స్ గతంలో తమిళనాడు రైట్స్ తీసుకుంది. కానీ ఈసారి రేటు చూసి వెనకడుగు వేసింది. గుంటూరు, నెల్లూరు, వైజాగ్ తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాహుబలి నిర్మాతలు ఈసారి సన్నిహిత వర్గాలకు ఒకరికి ఒక ఏరియా మాత్రమే ఇవ్వాలని అనుకుంటున్నట్లు వినికిడి. అది సాయి అయినా, యువి అయినా కూడా. అందుకే బాహుబలి నిర్మాతలు ఏ ఒక్కరితో ఇంత వరకు మాటలే తప్పు, అగ్రిమెంట్ ల వరకు రాలేదని వినికిడి. చూద్దాం..అలాగే చేద్దాం అనే స్టేజ్ లోనే వుంది బిజినెస్ అంతా అని తెలుస్తోంది.