cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

భూతద్దంలో 'షర్మిల' పార్టీ

భూతద్దంలో 'షర్మిల' పార్టీ

నిజానికి జర్నలిస్ట్ ల బాధ పగవాడికి కూడా రాకూడదు. ఎప్పుడు పనసకాయ దొరుకుతుందా? తద్దినం పెడదామా? అన్నట్లు ఎదురు చూస్తే బతికే బతుకులు. ఏదో ఒకటి జరగాలి. ఏదో ఒక పాయింట్ దొరకాలి. దాన్ని బట్టుకుని తమ తమ ఎఫిలియేషన్లకు అనుగుణంగా కథనాలు వండి వార్చాలి. ఆపై నచ్చనివారితో తిట్టించుకోవాలి. అందరు జర్నలిస్ట్ ల బతుకులు ఇలా వుండవు. ఏదో ఓ పార్టీతో అంటకాగేవారికే ఈ సమస్య ఎక్కువ.

ప్రతివారం కొత్త పలుకు పలకాలంటే ఎలా? ఎక్కడి నుంచి ముడిసరుకు వస్తుంది. పోనీ మటన్ కు మసాలో జోడిస్తే ఘనంగా వుంటుందేమో కానీ అవసరం లేని వాటికి కూడా అడ్డమైన మసాలాలు జోడిస్తే ఘాటు వస్తుందేమో కానీ రుచి రాదు. ఈవారం ఆర్కే కొత్త పలుకు లో న్యూస్ ప్లస్ వ్యాసం రెండూ వున్నాయి. 

వైఎస్ షర్మిల తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించబోతున్నారన్నది అందులో వున్న న్యూస్. దీంతో ఇక జగన్ పనైపోయింది. చెల్లి, తల్లి, బావ అందరూ దూరం అయిపోయినట్లే. ఆయన అధికారం గంగలో కలిసిపోవడానికి ఎంతో దూరం లేదు అనేంత రేంజ్ లో వ్యాసం వండి వార్చేసారు. మనం ఏమీ చేయలేని పగవాడి మీద కాకి ఈక పడితే చాలు, 'ఇంక అయిపోయిది ఈడి పని' అని సంబరపడేంత వెర్రితనం కనిపిస్తోంది ఈ వ్యాసంలో.

సమస్య నిజం

ఏ ఇంటిలోనూ రెండు కొప్పులు ఇమడలేవన్నది అనుభవజ్ఞులు చెప్పే నిజం. పెళ్లయ్యేంత వరకు అన్న కానీ, పెళ్లయ్యాక కాదు అంటారు పెద్దలు. చిరకాలంగా షర్మిలకు జగన్ భార్య భారతికి మధ్య పెద్దగా సయోధ్యలేదని వార్తలు వినవస్తూనే వున్నాయి. సాక్షి నుంచి షర్మిల మనుషులు తప్పుకోవడం, సాక్షిలో షర్మిల వార్తలకు ప్రాధాన్యత తగ్గడం వంటివి అప్పట్లో సాక్ష్యాలుగా వినిపించాయి. 

ఇలాంటి నేపథ్యంలో షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. కానీ జగన్ కు ఎందుకో అది అంతగా ఇష్టం లేకపోయింది. దాంతో తన పార్టీ తాను తెలంగాణలో పెట్టుకోవాలని షర్మిల డిసైడ్ అయిపోయారు. ఈ మేరకు వారం పది రోజుల నుంచి గ్యాసిప్ లు అందుతూనే వున్నాయి. 

పూచికపుల్ల దొరికింది

ఈ పార్టీ గ్యాసిప్ లు ఆర్కే  కొత్త పలుకు కు మాంచి పాయింట్ దొరికింది. ఇక చెలరేగిపోయారు. ఈ చెలరేగిపోవడంలో తన వ్యాసానికి తల తోక వుందో లేదో, లాజిక్ లు వున్నాయోలో లేదో, వాస్తవానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో వుందో అన్నది పట్టించుకోలేదు. 

కీలకమైన లాజిక్ ఏమిటంటే జగన్ మీద కోపం వస్తే షర్మిల పార్టీ ఎక్కడ  పెట్టాలి? ఆంధ్రలోనా? తెలంగాణలోనా? నందమూరి కుటుంబం తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ఎక్కడ పార్టీలు పెట్టారు ఆంధ్రలోనా? తమిళనాడులోనా? అన్న తెలుగుదేశం, లక్ష్మీపార్వతి తెలుగుదేశం సంగతేమిటి? ఇవన్నీ చంద్రబాబు మీద కోపంతో ఆ ఇంట్లోనే ఆంధ్రలోనే పుట్టాయి. 

ఇప్పుడు వైఎస్ ఇంట్లో కూడా అన్న-చెల్లి సయోధ్యలోనో, డిమాండ్లలోనో ఏదో తేడా వచ్చింది. కొత్త పార్టీ పుడుతోంది. కానీ ఎక్కడ తెలంగాణలో. ఇక్కడే వుంది అసలు లాజిక్. అన్న పార్టీ పెట్టాడు. అధికారం అందుకున్నాడు. 

అదంతా ఆంధ్రలో. తను కూడా పార్టీ పెట్టాలి అనుకుంటోంది. అధికారం అందుకోవాలి అనుకుంటోంది. ఎక్కడ తెలంగాణలో. మరి దీంతో ఆంధ్రలో వైకాపాకు సమస్య ఏమిటి? అప్పుడే క్రిస్టియన్లు అంతా జగన్ కు దూరమైపోయారు అంటూ కలలు కనే రేంజ్ లోకి వెళ్లిపోయారు ఆర్కే.

ఎంపీ కావాలనుకుని

వాస్తవానికి షర్మిల ఎంపీ కావాలనుకున్నారు. అన్నను రాజ్యసభ లేదా ఎంపీ టికెట్ అడిగారు. జగన్ కు అది ఇష్టం లేదు. అదే స్మూత్ గా చెప్పారు. అప్పటి నుంచి షర్మిల అన్నపై అలిగారు. ఇదీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. దాంతో తన మానాన తాను తెలంగాణలో పార్టీ పెట్టుకుని చిన్నగానో, పెద్దగానో అధికారికంగా ఎదగాలన్నది షర్మిల ప్లాన్. అందుకే ఆమె రాష్ట్రస్థాయి పార్టీ పెట్టినా, అన్ని స్థానాల్లో పోటీ చేయాలనుకోవడం లేదని తెలుస్తోంది. 

కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే పోటీ చేయాలన్నది షర్మిల ఆలోచనగా తెలుస్తోంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ తదితర ప్రాంతాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు వైఎస్ తో వున్నవారు, జగన్ తో వున్నవారు ఇప్పుడు షర్మిల పార్టీలో కీలకంగా వ్యవహరించబోతున్నారు. 

ఇలాంటి నేపథ్యంలో షర్మిల వల్ల జగన్ కు ఇబ్బంది వుంటుందని, అన్నకు పోటీగా చెల్లి పార్టీ పెడుతోందని, దీనివల్ల ఇక వైకాపా పని ఆంధ్రలో ఖతం అయిపోయిందని కొత్త పలుకులో చిందులు వేస్తే జనం ఎలా నమ్ముతారు అనుకున్నారు?  జనం ఇదంతా ఓ ప్లానింగ్ అనుకుంటారు. అనుకుంటున్నారు కూడా. 

కొత్తపలుకు, దానిపై కామెంట్లు సోషల్ మీడియాలో గమనిస్తే ఈ వ్యవహారం స్పష్టం అవుతుంది. పైగా ఇవ్వాళ మీడియా కన్నా సోషల్ మీడియా పవర్ ఫుల్. అక్కడ సెన్సారు లేదు. దాపరికాలు లేవు. అన్నీ చకచకా చలామణీ అయిపోతుంటాయి. అందువల్ల షర్మిల పార్టీ నిజంగా వేరు పార్టీ అయినా, జగన్ ప్లానింగ్ లో భాగమే అనే టాక్ వుంటుంది తప్ప వేరే వుండదు.

షర్మిలకు ఇబ్బందే

నిజానికి అన్నతో తనకు తేడా లేదు అనేది చెప్పడానికే షర్మిల ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. తన పార్టీ తెలంగాణకే పరిమితం అని, ఆంధ్రలోకి ఎంటర్ కానని షర్మిల తన పార్టీ ప్రారంభించే రోజే ప్రకటించబోతున్నారని బోగట్టా. అదే విధంగా జగన్ పై ఎటువంటి విమర్శలు చేయరు. ఇలాంటి వ్యవహారం షర్మిలకు ప్లస్ మైనస్ రెండూ కూడా. 

ఎందుకంటే జగన్ అభిమానులు, రెడ్డి సామాజిక వర్గం అంతా షర్మిలతో వుండే అవకాశం వుంటుంది. కానీ ఇదంతా జగన్-కేసిఆర్ కలిసి చేస్తున్న ప్లాన్ అనేది ప్రచారంలోకి వస్తే మాత్రం షర్మిలకు ఓటర్లు దూరంగా వుంటారు. ఇలాంటి ప్రచారమే ఆంధ్రలో జనసేన కొంపముంచింది. పవన్ వున్నట్లుండి చంద్రబాబుకు, భాజపాకు దూరంగా జరిగినా జనం నమ్మలేదు. ఇందంతా డ్రామా అనుకున్నారు. జనసేనను చిత్తు చిత్తుగా ఓడించారు. ఇలా సమస్య షర్మిలకు కూడా వచ్చే ప్రమాదం వుంది.

ఇవన్నీ వదిలేసి

ఇలా లాజిక్ లు అన్నీ వదిలేసి, ఎనుబోతు ఈనింది అంటే దూడల సావిట్లో కట్టేయమన్న చందంగా అదిగో షర్మిల పార్టీ ఇదిగో జగన్ పతనం అనే టైపులో తనకు వచ్చిన నృత్య విన్యాసాలు అన్నీ చేసిసి, పదవిన్యాసాలు చూపించేసి కొత్త పలుకు వండి వార్చేసారు ఆర్కే. అది చదివి రాను రాను అనుభవం పండడానికి బదులు కుళ్లిపోతోందేమో అని అనుమానపడాల్సి వస్తోంది.

పాపం..ఆర్కే..మరీ బద్ద వ్యతిరేకత కళ్లకే కాదు, ఆలోచనకు కూడా గంతలు కట్టేస్తుందేమో? దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో? 

ఆర్వీ

 


×