బయోపిక్ నిర్మాణం విషయంలో, స్క్రిప్ట్ విషయంలో మహానటి స్కీమ్ ను యథాతథంగా ఫాలో అయిపోతున్నారు ఎన్టీఆర్ బయోపిక్ రూపకర్తలు అని ఇప్పటికే అర్థం అయిపోతోంది. మహానటికి ముందు, మహానటికి తరువాత అన్నట్లు వుంది ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ వ్యవహారం. ఇప్పుడు మార్కెటింగ్ విషయంలో బాహుబలి ఫుట్ స్టెప్స్ ను ఫాలో అయిపోతున్నట్లు కనిపిస్తోంది.
బాహుబలి మార్కెటింగ్ ను దర్శకుడు రాజమౌళి సన్నిహితుడు సాయి కొర్రపాటి ముందుగా బోణీ కొట్టేవారు. లేదా కొట్టినట్లు లీక్ ఇచ్చేవారు. సాధారణంగా ఆ రేట్ మిగిలిన వారు జంకేలా వుండేది. ఆ తరువాత మెల్లగా ఆ రేటు ప్రాతిపదికగానే మిగిలిన ఏరియాలు అమ్మేవారు. సాయి కొర్రపాటి ఎంతకు కొన్నారన్నది ఆయనకు మాత్రమే తెలిసిన రహస్యంగా మిగిలిపోయేది. అయితే బాహుబలి రెండు భాగాలు కూడా సాయి కొర్రపాటికి లాభాలే పండించడం అదృష్టమనే చెప్పాలి.
ఇప్పుడు బయోపిక్ కు కూడా అదే స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సాయి కొర్రపాటి ఎన్టీఆర్ బయోపిక్ ను ఉత్తరాంధ్ర మూడుజిల్లాలు, కృష్ణాజిల్లా కలిపి 11.40 కోట్లకు కొన్నట్లు సినిమా యూనిట్ నుంచే లీకులు బయటకు వచ్చాయి. అంటే కృష్ణా, ఉత్తరాంధ్ర ఈ లెక్కన అమ్మారు అంటే, ఆంధ్ర అంతాకలిపి 30కోట్ల రేషియోలో అమ్మినట్లు. ఈ లెక్కన సీడెడ్ 12 కోట్లు, నైజాం 18 కోట్లు రేట్లు పెట్టాలి. ట్రేడ్ లెక్కలు, పర్సంటేజ్ లు అయితే ఇవే.
కానీ ఎన్టీఆర్ బయోపిక్ కు ఆంధ్ర ముఫైకోట్లు పలుకుతుందా? అన్న ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది ట్రేడ్ సర్కిళ్లలో. ముఫైకోట్లు అంటే దాదాపు పెద్ద హీరోల సినిమాల రేంజ్. రంగస్థలం సినిమానే ముందుగా ముఫై నుంచి ముఫై మూడుకోట్ల రేంజ్ లో ఆంధ్రలో అమ్మడం కష్టమైంది. అదే విధంగా నైజాంలో 18కోట్లు అంటే దాదాపు టాప్ హీరోల కమర్షియల్ సినిమాల లెక్క. సీడెడ్ 12కోట్లు అంటే బాలయ్య ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వుంటారు కాబట్టి ఓకె యేమో అనుకోవచ్చు.
ఏమైనా అయితే సాయి కొర్రపాటి బాహుబలి టైమ్ లో మాదిరిగా సాహసే.. లక్ష్మీ అని ముందుకు అడుగు అన్నా వేసి వుండాలి. లేదా, మిగిలిన ఏరియాల అమ్మకాల కోసం ఈ ఫీలర్ వదిలి అన్నా వుండాలి.