నాగ్ చైతన్య-మారుతి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే సినిమా శైలజా రెడ్డి అల్లుడు. ఈ సినిమా ఇగోస్ ఆఫర్ట్ మ్యారేజ్ అనే లైన్ పై రూపొందించిన కథతో నడుస్తుంది. ఈ కథలో అత్తపాత్ర కీలకం. ఈ పాత్రకు రమ్యకృష్ణను అనుకుంటున్నారు ఇప్పటి వరకు. అయితే మళ్లీ కొత్త ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ ఇప్పటికే చాలా సినిమాల్లో అత్త పాత్రలు వేసేసింది. అందువల్ల ఇంకెవరన్నా అయితే బాగుంటుందన్న సజెషన్లు దర్శక-నిర్మాతలకు అందుతున్నట్లు వినికిడి.
అలనాటి అందాల నటి శ్రీదేవి అయితే ఎలా వుంటుందన్నది ఈ సజెషన్లలో ఒకటి. నాగ్ చైతన్య అత్తగా శ్రీదేవి అంటే అసలు ఇక ఆ కాంబినేషన్ కు వచ్చే క్రేజ్ వేరుగా వుంటుంది. పైగా నాగార్జున-శ్రీదేవి కాంబినేషన్ సూపర్ హిట్. నాగ్ కొడుకు కు అత్తగా వేయడం అంటే మరింత రంజుగా వుంటుంది. పైగా శ్రీదేవి నటిస్తే ఆ సినిమాకు బాలీవుడ్ టచ్ మాత్రమే కాదు, తమిళంలో కూడా క్రేజ్ వస్తుంది. పైగా దర్శకుడిగా మారుతి లెవెల్ మారుతుంది.
ఇన్ని విధాలా బాగుంటుందని సజెషన్లు అందడంతో దర్శకుడు మారుతి ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇఫ్పటికే రమ్యకృష్ణతో మాటలు జరిగిపోయాయి. అందువల్ల మరి మార్పు వీలవుతుందా? అన్నది చిన్న అనుమానం. పైగా శ్రీదేవిని ఒప్పించాలి. అలా ఒప్పించాలంటే, నాగ్ ఓ మాట సాయం చేయాల్సి వుంటుంది. ఇవన్నీ సాధ్యమవుతాయా? ఏమో.. వెయిట్ అండ్ సీ.