చైతూ ‘యాక్షన్ హిట్’ కోరిక తీరేనా?

ఆర్ ఆర్ మూవీస్, కామాక్షి ఫిలింస్, వారాహి ఇలాంటి పెద్ద సంస్థల్లో యాక్షన్ సినిమాలు చేసి, ఆ సంస్థలను నష్టాల్లోకి నెట్టిన ఘనత హీరో నాగచైతన్యది. లవ్, ఫన్, ఎంటర్ టైన్మెంట్ సినిమాలు చేయి…

ఆర్ ఆర్ మూవీస్, కామాక్షి ఫిలింస్, వారాహి ఇలాంటి పెద్ద సంస్థల్లో యాక్షన్ సినిమాలు చేసి, ఆ సంస్థలను నష్టాల్లోకి నెట్టిన ఘనత హీరో నాగచైతన్యది. లవ్, ఫన్, ఎంటర్ టైన్మెంట్ సినిమాలు చేయి బాబూ చూస్తాం అని జనాలు అంటే, యాక్షన్ సినిమాలు, ఫైట్లు అంటూ నాగచైతన్య దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య లాంటి సినిమాలు చేసి, పరమ డిజాస్టర్లు ఇచ్చాడు.

దడ, ఆటోనగర్ సూర్య, బెజవాడ, యుద్థం శరణం ఇవన్నీ చైతూ కెరీర్ లో యాక్షన్ ఆణిముత్యాలే. సరే, బెజవాడ సినిమా ఆర్జీవీ హ్యాండ్ వుంది కాబట్టి పక్కన పెట్టేస్తే, మిగిలిన మూడు సినిమాలు మూడు బ్యానర్లను అతలాకుతలం చేసేసాయి. వాటిల్లో రెండు బ్యానర్లు అయితే దాదాపు గాయబ్ అయిపోయాయి. మూడు సినిమాల డైరక్టర్లు మళ్లీ సినిమా చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది.

కామాక్షి ఫిలింస్, ఆర్ ఆర్ మూవీస్ రెండూ ఇప్పుడు సినిమాలు చేయడంలేదు. దడ డైరక్టర్ అజయ్ భూయాన్ మళ్లీ సినిమా చేసిన దాఖలా లేదు. పాపం మంచి డైరక్టర్ అయిన దేవాకట్టా ఆటోనగర్ సూర్యతో కనుమరుగైపోయారు. ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా అయింది యుద్ధం శరణం సినిమా డైరక్టర్ కు.

అయినా మళ్లీ సవ్యసాచి లాంటి యాక్షన్ మూవీ చేసేసాడు చైతూ. అయితే చందు మొండేటి మీద కాస్త నమ్మకం వుంది జనాలకు. కార్తికేయ హిట్. ప్రేమమ్ లాంటి రీమేక్ ఫీట్ సక్సెస్ ఫుల్ గా చేసాడు.

అలాగే మైత్రీకి ఇంతవరకు అపజయం లేదు. అందువల్ల చందు, మైత్రీ మూవీస్ కలిసి చైతూ యాక్షన్ హిట్ కోరిక తీరుస్తాయేమో? చూడాలి.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి