విజయవాడ వైకాపా అభ్యర్థి పొట్లూరి వీర ప్రసాద్ తో వ్యవహారం అంత వీజీ కాదు. ఆయన లీగల్ ఫైట్స్ లో సిద్దహస్తుడు. జగన్ తో పాటు కేసులు పడిన వారిలో అస్సలు ఏమాత్రం మచ్చ పడకుండా బయటకు రావడం ఆయనకే సాధ్యం అయింది. ఈడీ కానీ సిబిఐ కానీ ఎంత స్క్రూ చేసినా, ఆయన చెక్కుచెదరలేదు. ప్రతీదీ లీగల్ గా అస్సలు ఎక్కడా దొరకుండా, పెర్ ఫెక్ట్ గా చేసుకోవడం ఆయనకు అలవాటు.
మహేష్ బాబు లాంటి వాడే ఆయన నుంచి తప్పించుకోలేకపోయాడు. సినిమా చేయకుండా తప్పించుకుందామని చూసి, ఆఖరికి తలవొగ్గాల్సి వచ్చింది. అంత పకడ్బందీగా అగ్రిమెంట్ లు చేసుకుంటాడు ఆయన. అలాంటి పివిపి ఇప్పుడు తెలుగుదేశం నేతలపై వంద కోట్లకు దావా వేస్తానని, ఎంత ఖర్చయినా ఫరవాలేదు, జీవితకాలం పట్టినా సరే, లీగల్ ఫైట్ చేస్తానని అంటున్నారు. దీనికి కారణం పివిపి మీద ఎన్నికల సందర్భంగా చంద్రబాబుతో సహా పలువురు దేశం నేతలు ఆయనపై రకరకాల ఆరోపణలు చేయడమే.
''…నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లకి గుణపాఠం చెప్పబోతున్నాను… నా విషయంలో ఒక ఎంపీ, రెండు మీడియా సంస్ధలు లా బ్రేక్ చేశాయి.. సోమవారం ఒక్కొక్కరిపై 100 కోట్లు పరువునష్టం దావా వేయబోతున్నాను.. కోల్గెట్ స్కామ్ లో ఉన్నానని చంద్రబాబు అన్నారు.. నన్ను స్కామ్ స్టార్ అన్నారు బ్లాక్ మెయిలర్ అన్నారు, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అన్నారు.. ఇకనుండి చట్టపరంగా వెళ్లతాను.. వాళ్ల కొవ్వు కరిగేంతవరుకు కోర్టులు చుట్టు తిప్పుతాను.'' అని పివిపి ఓ ప్రకటనలో తెలిపారు.
సాధారణంగా పివిపి వట్టి కబుర్లు చెప్పరు. మొండితనం ఎక్కువ. ఫైటింగ్ అంటే ఫైటింగే. అందువల్ల కచ్చితంగా 100 కోట్లకు అయినా కాకపోయినా, ఎంతో కొంతకు పరువునష్టం దావా వేయడం, కోర్టుకు వెళ్లడం ఖాయమనే అనుకోవాలి.