cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డిజిటల్ మీడియా వైపు జర్నలిస్ట్ ల చూపు

డిజిటల్ మీడియా వైపు జర్నలిస్ట్ ల చూపు

నిన్న మొన్నటి వరకు డిజిటల్ వెబ్ మీడియా వ్యవహారం ఓ రకంగా వుండేది. ఇప్పుడు మరో రకంగా వుంది. జాతీయ స్థాయిలో కాస్త సరుకు వున్నవారు కూడా డిజిటల్ మీడియా వైపు ఎప్పుడో మళ్లారు. కానీ రీజనల్ మీడియాలో మాత్రం అలా కాదు. అతి కొద్ది మంది మాత్రమే ముందుగా దీని ప్రాముఖ్యతను, భవిష్యత్ ను దర్శించి అటు మళ్లారు. మిగిలిన చాలా మంది మెయిన్ స్ట్రీమ్ మీడియానే అంటి పెట్టుకుని వున్నారు. పైగా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు వెబ్ మీడియా అంటే కాస్త చులకనభావమే వుండేది. ఇది పచ్చి వాస్తవం.

అలాంటిది ఇప్పుడు ఓడలు బండ్లు అయ్యాయి. బండ్లు ఓడలు అయ్యాయి. కరోనా దెబ్బకి మెయిన్ స్ట్రీమ్ మీడియా కల్లోలంలో చిక్కుకుంది. దీంతో అనేకానేక మంది జర్నలిస్ట్ లు ఉద్యోగాలు కొల్పోయారు. చాలా మందికి జీతాలు తగ్గాయి. మరి కొంత మందికి భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. 

దీంతో ఇప్పుడు వెబ్ మీడియా అనేది ఆపద్భాంధవుడి మాదిరిగా కనిపిస్తోంది. వెబ్ మీడియాలోకి ఎలాగైనా ఎంటర్ కావాలనే ప్రయత్నాలు ముమ్మురమయ్యాయి. 

ముంబాయిలో వుంటూ తెలుగు సినిమా వార్తలు రాసే జర్నలిస్ట్ ఒకరు వున్నారు. ఈయనకు ఓ పెద్ద హీరోతో అనుబంధం. ఆ హీరోకి మద్దతుగానూ వుంటుంది, వెబ్ మీడియాలోకి వస్తే కెరీర్ బాగుంటుంది అని తెగ ప్రయత్నాలు ప్రారంభించేసారు. విసుపు విరామం లేకుండా, ప్రతిస్పందనతో సంబంధం లేకుండా తన ప్రయత్నం తాను చేస్తూనే వున్నారు.

ఇక మరో హైదరాబాద్ బేస్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా భవిష్యత్ అంధకారంలో పడింది. దాంతో అందులో పనిచేసే వారు వెబ్ మీడియాలోకి రావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇక మరో మెయిన్ స్ట్రీమ్ మీడియా జనాలను తగ్గించుకుంటోంది. దాంతో దాంట్లోంచి బయటకు వచ్చిన వాళ్లు కూడా వెబ్ మీడియా దారి పట్టారు. మొత్తం మీద వెబ్ మీడియాకు కావాల్సినంత మంది జర్నలిస్ట్ లు ఇప్పుడు అందుబాటులోకి రాబోతున్నారు. 

ఎటొచ్చీ ప్రింట్ మీడియాలో రిపోర్టర్ మీద సబ్ ఎడిటర్, ఇంకా ఆ పైన చాలా మంది వుంటారు. వీళ్లంతా రిపోర్టర్ కాపీని ఫైన్ ట్యూన్, సూపర్ ఫైన్ ట్యూన్ చేస్తుంటారు. అందువల్ల ఎవరి టాలెంట్ అన్నది అంత వీజీగా తెలియదు. కానీ వెబ్ మీడియాకు వచ్చేసరికి, కాపీని కరెక్ట్ చేసే సిస్టమ్ వుండదు. అందువల్ల బాగా కాపీ రాయగలిగిన వారు మాత్రమే ఇక్కడ షైన్ కావడానికి అవకాశం ఎక్కువ వుంటుంది.