Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఫీలవుతున్న దిల్ రాజు

ఫీలవుతున్న దిల్ రాజు

ఓ చిన్న డిస్ట్రిబ్యూటర్ గా ప్రారంభమై టాలీవుడ్ కింగ్ పిన్స్ లో ఒకరు అన్న రేంజ్ కు ఎదిగారు దిల్ రాజు. టాలీవుడ్ చెన్నయ్ నుంచి హైదరాబాద్ కు మారినపుడు సినిమా మౌలిక సదుపాయాలు అన్నీ గుప్పిట్లో వుంచుకుని, తమ హీరోలను తయారుచేసి, టాలీవుడ్ ను శాసించే ప్రణాళికను కొందరు అమలు చేస్తే, ఎక్కడ ఎలా తయారయినా, సినిమా చివరకు రావాల్సింది థియేటర్ లోకే అన్న పాయింట్ గమనించి అక్కడ పాగా వేసే కొత్త స్కీముకు తెరతీసారు దిల్ రాజు. 

నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా మూడు రంగాల్లో తన పట్టు నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ చాలా మందికి తెలియనిది ఏమిటంటే, నిర్మాతగా సంగతి ఎలా వున్నా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా దిల్ రాజు వెనుక వున్న తలకాయ శిరీష్ రెడ్డి. 

చాలా కఠినంగా, పట్టుదలతో వ్యవహరిస్తారని పేరు. ఆయనే తెరవెనుక చక్రం తిప్పేది. నైజాంలో థియేటర్లు చేతిలో వున్న సునీల్ అలాగే సురేష్ బాబు ప్రతినిధులు కూడా శిరీష్ ఆఫీసు చుట్టూ తిరగాలి తప్ప, ఈయన వాళ్ల దగ్గరకి వెళ్లింది లేదు. 

ఇప్పుడు ఒక్కసారిగా ఇవన్నీ బయటకు వచ్చేసాయి. దీంతో రెండు పరిణామాలు సంభవించాయి. కౌన్సిల్ కు పోటీగా దిల్ రాజు నిర్మించిన గిల్డ్ అనేది శిరీష్ కారణంగానే కట్టుతప్పుతోందన్న టాక్ బయలుదేరింది. ఇకపై శిరీష్ ఆఫీసు చుట్టూ ప్రదక్షణలు ఆపాలని సురేష్ బాబు తన కీలక సిబ్బందిని ఆదేశించారన్న విషయం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. 

అంతే కాదు, తన సిబ్బంది కొందరు శిరీష్ తో మిలాఖత్ అయ్యారని, అందుకే ఇక థియేటర్ల వ్యవహారాలను తాను కూడా పర్యవేక్షించాలని సురేష్ బాబు నిర్ణయించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏరియాల మేనేజర్లకు నిర్ణయాధికారాలు పెంచి, టాప్ లెవెల్ స్టాఫ్ కు తగ్గిస్తున్నారని టాక్.

మరోపక్క నిజానిజాలు ఎలా వున్నా, టాలీవుడ్ ఇంటర్నల్ వ్యవహారాలు బయటకు వచ్చేసాయి. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను పలు లాజికల్ పాయింట్స్ తో, సాక్ష్యాలతో నైజాంలో జరుగుతున్న వ్యవహారాలు బయటపెట్టారు. దిల్ రాజును కిల్ రాజు అంటూ తీవ్రంగా విమర్శించారు. దీంతో దిల్ రాజు తీవ్రంగా బాధపడుతున్నట్లు తెలిసింది. 

దాదాపు రెండు దశాబ్ధాలుగా తాను కష్టపడి తెచ్చుకున్న పేరు ప్రతిష్టలు అన్నీ పాడు చేసారని ఆయన తన సన్నిహితుల దగ్గర బాధపడుతున్నట్లు తెలుస్తోంది. చిన్న విషయానికి పంతాలకు పోవడం వల్ల ఇలా జరిగిందని, చేసిన మంచి పనులు, టాలీవుడ్ నిర్మాతలను ఓ తాటిపైకి తీసుకువచ్చి, ప్లాన్డ్ గా విడుదలలు చేసే ప్రయత్నాలు అన్నీ వృధా అయిపోయాయని ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

'దిల్ రాజు చాలా బాధపడుతున్నారు. తన పేరు అంతా పాడయిందని ఫీలవుతున్నారు. పాపం ఇందులో ఆయన తప్పు కన్నా శిరీష్ పంతం ఎక్కువగా వుంది. కానీ దానికి దిల్ రాజు మాట పడ్డారు' ఓ నిర్మాత అన్నారు.

'వీలయితే మీడియా ఇక దిల్ రాజు మీద ఫోకస్ తగ్గిస్తే బాగుంటుంది. ఇలా మంచికి చెడుకు అన్నింటికి దిల్ రాజు  ఫోకస్ కావడం వల్ల, ఏం జరిగినా ఆయనే టార్గెట్ అవుతున్నారు. కానీ థియేటర్లు అన్నీ మేనేజ్ చేసేది ఆయన కాదు, శిరీష్ అన్న సంగతి ఇండస్ట్రీలోనే చాలా మందికి తెలియదు' అని ఆ నిర్మాత అనడం విశేషం.

మొత్తం వరంగల్ శ్రీను ఉదంతం టాలీవుడ్ లో కొత్త నిర్ణయాలకు, కొత్త సమీకరణలకు, కొత్త ఆలోచనలకు తెరతీసేందుకు దారి తీసినట్లుంది.

క్రాక్ సినిమా బాలీవుడ్ లో ఆ హీరోతో తీస్తా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?