cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కాపుల కల నెరవేరేనా?

కాపుల కల నెరవేరేనా?

చిరకాలంలో తెలుగు రాష్ట్రంలో కమ్మ-రెడ్డి కుల ప్రతినిధులు పదవులు పంచుకుంటూ వస్తున్నారు. కాపులకు ముఖ్యమంత్రి పదవి అన్నది అందని పండుగా వుండిపోయింది. ఈలోగా రాష్ట్రం విడిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో నిజంగా కాపుల్లో, అంటే కేవలం కాపుల్లో మాత్రమే కాదు, కాపు, బలిజ, తెలగ ఇలా పలువురు కలిసి ఏర్పాటు చేసుకున్నకాపునాడు జనాల్లో కనుక పట్టుదల వుంటే సిఎమ్ పోస్ట్ సాధించడం పెద్ద కష్టం కాదు. 

కానీ చిరంజీవి పార్టీ పెట్టినా, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా, వెంటనే జరిగిన పని దాన్ని కాపుల పార్టీగా ముద్ర వేసి మిగిలిన కులాలకు దూరం చేయడం. దీన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ ఓ ప్రయోగం చేద్దాం అనుకున్నారు. కమ్మవారి సాయం తీసుకుని విజయం సాదిద్దాం అనుకున్నారు. కులాలను కలిపే రాజకీయం తనది అని ఆయన స్వయంగా ప్రకటించారు. ఆయన ప్రయత్నం బాగానే వుంది కానీ, చంద్రబాబు ఓటమి అంచున వున్నపుడు కలవడంతో, ఆ ప్రభావం ఈయన మీదా పడిపోయింది.

ఆ రెండు పార్టీలు వేరే

తేదేపా, వైకాపా రెండూ ప్రాంతీయ పార్టీలే. రెండు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవి అని అనిపించుకున్నవే. అయినా వాటిని ఆదరిస్తున్నారు. కాపులకు అంటూ ఓ ప్రాంతీయ పార్టీ వస్తే మాత్రం పక్కన పెడుతున్నారు. ఎందుకిలా? వివిధ వర్గాలుగా వున్న కాపుల్లో ఐక్యత లేకపోవడమే ఇందుకు కారణమా?  లేక రెడ్ల పార్టీకి, కమ్మవారి పార్టీకి మద్దతు ఇస్తున్న ఇతర కులాల వారు కాపుల పార్టీ అనేసరికి దూరంగా వుండిపోతున్నారా?

ఆంధ్ర రాష్ట్రానికి చాలా కులాలవారు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ పుణ్యం. ఇకపై తెలుగునాట రెడ్డి, కమ్మ అభ్యర్ధులు తప్ప మిగిలిన వారు ముఖ్యమంత్రులు కావాలి అంటే అద్భుతం జరగాల్సి వుంది. ఇలాంటి నేపథ్యంలో ఆల్టర్ నేటివ్ ఐడియాతో తొలిసారి ఓ జాతీయ పార్టీ కాపులతో రాజకీయం చేయడానికి రంగంలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది.

మారిన భాజపా వ్యూహం

చిరకాలంగా తెలుగునాట తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ లేదా కమ్మ సామాజిక వర్గానికి ఆల్టర్ నేటివ్ పార్టీలా కనిపించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ ను పార్టీ అధ్యక్షుడిగా చేసిన తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారిపోయినట్లు కనిపించింది. వెంటనే ఆయనను రీప్లేస్ చేసి సోము వీర్రాజును తీసుకువచ్చింది. అటు పవన్ తో పొత్తు, ఇటు కన్నాను రీప్లేస్ చేసి వీర్రాజును తీసుకురావడం ద్వారా భాజపా ఓ క్లియర్ మెసేజ్ ఇచ్చినట్లు అర్థం అవుతోంది.

వీర్రాజు చాకచక్యం

వీర్రాజు పదవి స్వీకరించగానే, గతంలో రెండు ప్రయత్నాలు చేసి విఫలమైన మెగాస్టార్, పవర్ స్టార్ లను కలిసారు. మాజీ అధ్యక్షుడు కన్నాను కలిసారు. అంతే కాదు ముద్రగడను, జెడి లక్ష్మీనారాయణను కూడా కలుస్తా అని ప్రకటించారు. అంతే కాదు అధిష్టానం ఎవరు అంటే వారే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించారు. పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు వున్నారు. వీరిని కాదని పురంధ్రీశ్వరినో, సుజన చౌదరినో సిఎమ్ అభ్యర్థిని చేసే ఆలోచన భాజపాలో వుందని అనుకోవడానికి లేదు. అలా వుండి వుంటే కాపులను ముందు లీడ్ లో పెట్టే ఆలోచన చేయకుండా, కంభంపాటి హరిబాబుకో, పురధ్రీశ్వరికో పదవి ఇచ్చే ఆలోచన చేసి వుండేవారు. 

కానీ భాజపా రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలకు అందకుండా కాపు  ఓటు బ్యాంక్ ను హైజాక్ చేసి, తనకు అంటూ కొంత శాతం ఓట్లను తెచ్చుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే క్లారిటీగా అటు సోము వీర్రాజుకు, ఇటు పవన్ కు మెసేజ్ వెళ్లిపోయిందనే అనిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. ఎందుకంటే సోము వీర్రాజు,  పవన్ కళ్యాణ్, పని చేయించుకుని, ఆఖరి నిమిషంలో వేరే వారి పేరు ప్రకటించేంత ధైర్యం భాజపా చేయకపోవచ్చు.

ఇదో సువర్ణావకాశం

అందువల్ల ఓ విధంగా ఇది కాపులకు సువర్ణావకాశం. ఇలాంటి అవకాశం. ప్రాంతీయ పార్టీలుగా కాపులు సాధించలేనిది ఓ జాతీయ పార్టీ అండతో సాధించుకునే అవకాశం వచ్చింది. బ్రాహ్మణానాం అనేకత్వం అనే నానుడి వుంది కానీ, కాపుల్లో అనేకత్వం అన్నది సుస్పష్టం. అందువల్లే వారు ఇప్పటి వరకు సిఎమ్ పదవిని సాధించలేకపోయారు. తెలుగు ప్రజలు ఇప్పటి వరకు కాపు, క్షత్రియ ముఖ్యమంత్రులను చూడలేదు. క్షత్రియుల సంఖ్యాబలం తక్కువ. కానీ కాపులకు అలా కాదు. కేవలం అనైక్యత వల్లే వారు ఇది సాధించలేకపోయారన్నది పరిశీలకుల మాట. 

ఇప్పుడు ఓ జాతీయ పార్టీగా భాజపా కాపులను ఏకం చేసే బాధ్యత భుజాన వేసుకుంది. ఓ విధంగా ఆ పార్టీపై ఇన్నాళ్లు వున్న కమ్మ ఆధిపత్యాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తోంది. ఇది భవిష్యత్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. 

తెలుగుదేశానికి మైనస్

భవిష్యత్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందో అన్న సంగతి పక్కన పెడితే, తెలుగుదేశం పార్టీకి మాత్రం కాస్త గట్టి మైనస్ అయ్యే ప్రమాదం వుంది. చిరకాలంగా ఆపార్టీ కాపులను దూరం చేసుకుంది. మొన్నటి ఎన్నికల్లో దగ్గరకు తీసుకునే ప్రయత్నం జరిగినా సాధ్యం కాలేదు. కానీ ఇటీవల ఈ విషయంలో విపరీతంగా ఫ్రయత్నిస్తోంది. బిసి లు తమ దగ్గరకు రారనే ఆలోచనో? మరోటో కానీ మొత్తం మీద కాపులను, ఎస్ సి లను తెలుగుదేశం వైపు తిప్పేలా దాని అనుకూల మీడియాలో వార్తా కథనాలు తరచు కనిపిస్తున్నాయి. 

కానీ ఇప్పుడు భాజపా చేస్తున్న ప్రయత్నం తేదేపా ప్రయత్నాలను గండి కొట్టేలా వుంది. అటు బిసిలను దగ్గర చేసుకుందాం అంటే, తేదేపా అనుకూల మీడియా బిసిలను టార్గెట్ చేస్తూ రాస్తున్న రాతలు, వారికి మంటెక్కించి మరింత దూరం చేస్తున్నాయి. అసలే వైకాపా ఒక్కో వర్గాన్ని శాశ్వతంగా తమకు అనుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే, తేదేపా కేవలం నెగిటివ్ ప్రచారం మీద, నెగిటివ్ ఓటింగ్ మీద దృష్టి పెట్టి, వార్తలు వండిస్తూ ముందుకు వెళ్తోంది. 

కానీ ఎప్పుడయితే భాజపా కూడా కాపుల అండతో కాస్త బలమైన శక్తిగా కనుక బరిలోకి దిగితే ఈ నెగిటివ్ ఓటింగ్ చీలిపోయే ప్రమాదం వుంది. ఇది వైకాపాకు అనుకూలం అవుతుందా? కాదా? అన్నది పక్కన పెడితే తేదేపా ఆశలకు మాత్రం భాజపా వ్యూహాలు గండి కొడుతున్నాయన్నది మాత్రం అర్థం అయపోతోంది.

రైతులు త్యాగం చేశారా.. డీల్ చేసుకున్నారా ?