కార్తికేయ 2 అనే సినిమా ఎప్పటి నుంచో వార్తల్లో నానుతోంది. ఇదిగో..అదిగో..అల్లదిగో అని వినిపిస్తూనే వుంది. వాస్తవానికి ఈ సినిమాను ఆసియన్ సునీల్ నిర్మించాల్సి వుంది. కానీ నిఖిల్ మీద 15 నుంచి 20 కోట్ల బడ్జెట్ వర్కవుట్ కాదని ఆయన వెనకడుగు వేసారు. అలా చేతులు మారి మారి, ఆఖరికి పీపుల్స్ మీడియా దగ్గరకు వచ్చింది. ఆ సంస్థ కూడా 13 కోట్లలో దీన్ని ఫినిష్ చేస్తే, సరిపోతుంది అనే ఆలోచనలో వుంది.
నిఖిల్-చందు మొండేటికి కలిపి ప్యాకేజ్ మాదిరిగా సినిమాను అప్పగించాలని ముందు అనుకున్నారు. కానీ తరువాత మళ్లీ ఎందుకో వెనకడుగు వేసారు. 2018 నవంబర్ లో సవ్వసాచి విడుదలయిన దగ్గర నుంచి చందు మొండేటి ఖాళీగానే వున్నారు. దాదాపు ఏణ్ణర్థం అయింది. ఇలాంటి నేపథ్యంలో కార్తికేయ 2 ను ఏదో ఒకటి చేసి పట్టాలు ఎక్కించాల్సి వుంది.
కానీ నిర్మాతలు వీలయినంత బడ్జెట్ లో చేయాలని అనుకుంటే, టెక్నీషియన్లు, స్టార్ కాస్ట్ ల విషయంలో హీరో నిఖిల్ చేస్తున్న సూచనలు దానికి బ్రేక్ వేస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిఖిల్ సూచిస్తున్న మేరకు జనాలను తీసుకుని, సినిమా చేస్తే బడ్జెట్ పెరిగిపోతుందని, నిఖిల్ మీద పది కోట్ల లోపే వర్కవుట్ అవుతుందని, అందువల్ల 13 కోట్లకు మించి ఎక్కువ పెట్టడం కష్టం అవుతుందని పీపుల్స్ మీడియా భావిస్తున్నట్లు ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపిస్తోంది.