మహానాయకుడు, కథనాయకుడు లాంటి డిజాస్టర్లు తీసిన తరువాత మళ్లీ సినిమా చాన్స్ వస్తుందా అన్నంతగా సైలంట్ అయిపోయారు దర్శకుడు క్రిష్. అలాంటి పరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చాన్స్ రావడంతో ఆయన చాలా ఆనందంలో తేలిపోతున్నట్లు కనిపిస్తోంది. దాంతో తాను తయారుచేసిన కథను చాలా మందికే వినిపించేసినట్లు తెలుస్తోంది.
దీనివల్ల ఏముంది సినిమా విశేషాలు అన్నీ ముందే బయటకు వచ్చేస్తున్నాయి. అప్పటికీ ఆయన తన ఆస్థాన రచయితలకు ఇతరులకు గట్టిగా చెప్పారు. ఒక్క మాట కూడా బయటకు వెళ్లకూడదని. కానీ ఆయనే కథ కొంత మందికి చెప్పేయడంతో విషయాలు ఒకటీ ఒకటీ బయటకు వచ్చేస్తున్నాయి.
రాజమౌళి మాదిరిగా ఓ పీరియాడిక్ సినిమా చేయబోతున్నారని ఇఫ్పటికే వార్తలు బయటకు వచ్చాయి. అలాగే సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ దొంగ పాత్రలో కనిపిస్తారని ఇఫ్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. డిటెక్టివ్ నవలా రచయిత మధుబాబు రచనల్లోని షాడో పాత్ర తరహాలో ఈ పాత్ర వుంటుందని తెలుస్తోంది. షాడో పాత్ర తెలుగు నాట బాగా పరిచయం. ఆ పాత్ర కు పూర్వాశ్రమ నేపథ్యం వుంటుంది. దీని ప్రేరణతోనే పవన్ పాత్రను డిజైన్ చేసినట్లు కథ ను ఆ నోటా ఈ నోటా విన్నవాళ్లు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
మొత్తం మీద పవన్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ, స్టార్ట్ అయ్యేలోగా క్రిష్ సినిమా కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే అన్నీ బయటకు వచ్చేసేలా వున్నాయి. క్రిష్ అత్యుత్సాహంతో సన్నిహితులకు కథ చెప్పడమే కారణం అనుకోవాలి. కానీ ఒకటే సమస్య పవన్ కు ఇదంతా చికాకు తెప్పించి, క్యాన్సిల్ అంటేనే..మొదటికి మోసం వస్తుంది.