మహర్షి.. టేబుల్ లాస్?

ఈ సమ్మర్ కు టాలీవుడ్ నుంచి రాబోతున్న పెద్ద సినిమా ఒకే ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి. కానీ ఒకటే అనుమానం. స్పైడర్, బ్రహ్మోత్సవం నిర్మాతలకు లాస్. భరత్ అనే…

ఈ సమ్మర్ కు టాలీవుడ్ నుంచి రాబోతున్న పెద్ద సినిమా ఒకే ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి. కానీ ఒకటే అనుమానం. స్పైడర్, బ్రహ్మోత్సవం నిర్మాతలకు లాస్. భరత్ అనే నేను చాలామంది బయ్యర్లకు లాస్. మరి ఇప్పుడు మహర్షి పరిస్థితి ఏమిటి? విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం మహర్షి టేబుల్ లాస్ తో విడుదల కాబోతోంది.

పెద్ద హీరోల సినిమాలు టేబుల్ ప్రాఫిట్ తో విడుదలవుతాయి. విడుదలయిన తరువాత అసలు సంగతి తేలుతుంది. కానీ మహర్షి సినిమా టేబుల్ లాస్ తో విడుదల కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. దీనికి కారణం సినిమాకు నిర్మాణ వ్యయం భారీగా అయిపోవడమే. దాదాపు 150 రోజులు షూటింగ్ జరపడం, కెమేరాలు, క్రూ ఎక్కువ వాడడం వంటి, ఇలా చాలా కారణాల వల్ల నిర్మాణ వ్యయం అమాంతం పెరిగిపోయినట్లు బోగట్టా.

పైగా నిర్మాతల్లో ఒకరైన అశ్వనీదత్ ఈ సినిమా కోసం ఎప్పుడో జమానాకాలం నాడు మహేష్ కు ఇచ్చిన అయిదు కోట్లకు వడ్డీలు కూడా నిర్మాణ వ్యయంలో భాగమే. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వం అంటే కాస్త ఖర్చు ఎక్కువే వుంటుందని టాక్ వుంది. ఊపిరి సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అని అందరికీ తెలిసిందే. మహర్షి సినిమాకు దగ్గర దగ్గర 135 నుంచి 140 కోట్ల ఖర్చు అయిందని నిర్మాత దిల్ రాజు చెబుతున్నట్లు తెలుస్తోంది.

కానీ మార్కెట్ చూస్తే అంతలేదు. ఇప్పటికి నలభై కోట్లకు పైగా నాన్ థియేటర్ రైట్స్ నుంచి వచ్చింది. ఆంధ్ర ఏరియాను 38 కోట్ల రేషియోలో ఇవ్వడానికి సూత్రప్రాయంగా ఓకే అయినట్లు తెలుస్తోంది. కానీ పైకి ఇంకా చెప్పడంలేదు. దిల్ రాజు రెగ్యులర్ బయ్యర్లే కాబట్ట విషయం బయటకు రావడంలేదు. భరత్ ఆంధ్ర ఏరియా కలెక్షన్లు 37 కోట్లకు కాస్త లోపే ఆగిపోయాయి.

సీడెడ్ ను 15 కోట్లు చెబుతున్నారు. కానీ భరత్ అనే నేను సినిమా 13 కోట్లకు పైగా మొత్తానికి సీడెడ్ కు అమ్మితే పదికోట్ల రావడం కష్టమయింది. అందువల్ల బయ్యర్లు ముందువెనుక ఆడుతున్నట్లు బోగట్టా. ఇక నైజాం ను దిల్ రాజే తీసుకుంటారు. అది 17 నుంచి 18 కోట్ల రేషియోలో వుంటుందని తెలుస్తోంది. ఓవర్ సీస్ ను 12 కోట్లు చెబుతున్నారు. కానీ ఇంకా ఎవ్వరూ ఆసక్తిగా ముందుకు రావడంలేదు. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా వుంటాయి. కర్ణాటక నుంచి పదికోట్ల వరకు ఆశిస్తున్నారు. రెస్టాఫ్ ఇండియా ఓ అయిదు కోట్లు అంచనా.

ఈ విధంగా చూసుకుంటే, అనుకున్న రేట్లు రావడం కష్టమే. 90 కోట్ల వరకు థియేటర్ రైట్స్, 40 కోట్లకు పైగా నాన్ థియేటర్ రైట్స్ మీద వచ్చే అవకాశం వుంది. ఆ విధంగా 130 నుంచి 135 కోట్లు రాబట్టవచ్చు. ఈ లెక్కన చూసుకుంటే నిర్మాణ వ్యయానికి బరాబర్ రావడమో, లేదా టేబుల్ లాస్ నో అన్నది తప్ప, లాభం అయితే వుండదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.

మహేష్ తన రెమ్యూనిరేషన్ తగ్గించుకోవడం, భవిష్యత్ లో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం మీద దృష్టిపెట్టడం చేయకపోతే, ఇక ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు తగ్గిపోతారని కామెంట్లు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. మరోపక్క మహర్షి సినిమా లెంగ్త్ నాలుగు గంటలకు పైగా వచ్చిందని, ఇప్పుడు దర్శకుడు వంశీ పైడిపల్లి కిందామీదా పడి దాన్ని మూడుగంటలు చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

మూడుగంటల సినిమా అంటే అద్భుతంగా వుంటే తప్ప జనాలు చూడలేరు. ఆ విషయంలో కూడా యూనిట్ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ కొత్తగా రాలేదు.. నాగబాబు హీరో కాదు