Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మీడియా కట్టడికి నిర్మాతల వ్యూహం ఇదేనా?

మీడియా కట్టడికి నిర్మాతల వ్యూహం ఇదేనా?

ప్రింట్ మీడియా, విజువల్ మీడియా కంటే డిజిటల్ మీడియా తలనొప్పిగా మారింది టాలీవుడ్ కు. అయితే డిజిటల్ మీడియాలో యూ ట్యూబ్ మీడియాను కట్టడి చేయడం అన్నది అంత సులువు కాదు, సాధ్యం కాదు. ఎందుకంటే యూ ట్యూబ్ మీడియాకు సినిమా రంగం నుంచి అందే ప్రకటనల మద్దతు ఏమీ వుండదు. అలాగే ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా కూడా. మహా అయితే యూ ట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ లకు రిపోర్ట్ కొట్టడం మినహా చేయగలిగింది లేదు. లేదూ అంటే సైబర్ క్రయిమ్ కింద కేసులు పెట్టాలి. లైవ్ అప్ డేట్స్, పర్సనల్ రివ్యూల మీద కేసులు ఏమని పెడతారు? అందుకే అక్కడ ఇక చేసేదేమీ లేదు.

ఇక మిగిలింది వెబ్ మీడియా. ఈ వెబ్ మీడియాలో కొంత వరకే టాలీవుడ్ నుంచి కాస్త గుర్తింపు, ప్రకటనలు అందుకుంటోంది. అలా అందుకుంటున్న మీడియా కట్టడికి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కొన్ని గైడ్ లైన్స్ తయారుచేసే పనిలో వుంది. గిల్డ్ లో వున్న నిర్మాతలు కీలకంగా భావిస్తున్న పాయింట్లను ముందుగా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటున్నారు. వెబ్ మీడియా ప్రతినిధులను పిలిచి, వీటిని వివరించి, ఇష్టమైతే ప్రకటనలు ఇవ్వడం లేదంటే ఆపేయడం అన్నది క్లారిటీగా తెలుసుకోవాలని గిల్డ్ నిర్మాతలు అనుకుంటున్నారు. లాక్ డౌన్ అయిన తరువాత ఈ విషయంపై ముందుకు వెళ్లే అవకాశంవుంది.

గిల్డ్ నిర్మాతలు వెబ్ మీడియాతో సమస్యలుగా భావిస్తున్నవాటిలో  అత్యంత ప్రధానమైనది, అమెరికా టైమింగ్స్ లో లైవ్ అప్ డేట్స్, ఇంటర్వెల్ రిపోర్ట్, ఫైనల్ రిపోర్టు ఇవ్వకుండా నియంత్రించడం. 

టాలీవుడ్ నుంచి ప్రకటనలు కావాలి అంటే, తెలుగురాష్ట్రాల్లో మార్నింగ్ షో పడి, పూర్తి అయ్యే వరకు వెబ్ మీడియాలో లైవ్ అప్ డేట్లు, ట్వీట్ రివ్యూలు, ఇంటర్వెల్ రిపోర్టులు, అలాగే ఫైనల్ వెర్డిక్ట్ లు ఇవ్వకూడదని షరతు విదించాలని ఫస్ట్ నిబందన డిసైడ్ చేసినట్లు బోగట్టా.

ఇక రెండో నిబంధన సినిమా జనాలు ఎవ్వరి మీదా కూడా పర్సనల్ గ్యాసిప్ లు అస్సలు అందించకూడదు. సినిమా జనాల జీవితాల్లోకి వెబ్ మీడియా అస్సలు తొంగి చూడకూడదు.

ఇక మూడో నిబంధన నిర్మాణంలో వుండే సినిమాల కథలకు సంబంధించి కీలక విషయాలను, ట్విస్ట్ లను వెల్లడించకూడదు. 

అలాగే సినిమా విడుదలకు దగ్గర చేసి సెన్సారు రిపోర్ట్ పేరుతో టాక్ ను ఇవ్వకూడదు అన్నది నాలుగో నిబంధన. 

ఇక ఫైనల్ గా సినిమా బిజినెస్ ను ప్రభావితం చేసే వార్తలు కూడదన్నది అయిదో పాయింట్.

అయితే ఇవన్నీ ఇంకా డిస్కషన్ స్థాయిలోనే వున్నాయి. ఇవన్నీ డ్రాఫ్టింగ్ లు గా మారాలి. వెబ్ సైట్ మేనేజ్ మెంట్లు, ఎడిటర్లతో డిస్కషన్లు జరగాలి. వాళ్ల అభిప్రాయాలు తెలియాలి. అప్పుడు అసలు సంగతి.

ఇదిలా వుంటే టాలీవుడ్ ప్రకటనలు అందుకోని వెబ్ సైట్లు, అలాగే ఫేస్ బుక్,  ట్విట్టర్ లోని ఇండివిడ్యువల్ పాపులర్ హ్యాండిల్స్, యూ ట్యూబ్ లో శుక్రవారం ఉదయాన్నే అమెరికా నుంచి లోడ్ అయ్యే సమీక్షలు మాత్రం అలాగే నడిచే అవకాశం వుంది. ఎందుకంటే వీటికి టాలీవుడ్ తో ఎటువంటి ప్రకటనల లావాదేవీలు లేవు. 

అలాగే గిల్డ్ ప్రకటనల జాబితాలో లేని కొన్ని విజువల్ చానెళ్లకు నిర్మాతలు నేరుగా ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. మరి భవిష్యత్ లో వెబ్ మీడియాకు కూడా అదే విధమైన వైఖరి అవలంబిస్తారా? అన్నది చూడాల్సి వుంది. అప్పుడు గిల్ట్ ఎలా వ్యవహరిస్తుంది అన్నది వేరే పాయింట్.

మరోపక్క తమ సినిమాల కంటెండ్ అయిన ఫొటోలు, విడియోలు వెబ్ మీడియా వాడకూడదని కట్టడిచేస్తే ఎలా వుంటుందని మరో ఆలోచనగా డిస్కషన్లు కూడా సాగుతున్నాయి. కానీ కేవలం ప్రింట్ మీడియాను, విజవల్ మీడియాను నమ్ముకుంటే పాన్ ఇండియా, ఓవర్ సీస్ లెవెల్ లో సినిమాలకు ప్రచారం ఎలా అన్నది కూడా కౌంటర్ క్వశ్చనుగా వుంది. ట్విట్టర్ ను, ఇన్ స్టా ను నిమిషం నిమిషం లేదా నిత్యం ఫాలో అయ్యే వారి సంఖ్య ఎంత అన్నది కూడా డిస్కషన్లలో వినిపిస్తోంది. 

ఇదిలా వుంటే గతంలో ఓ లీడింగ్ ప్రింట్ మీడియాకు ప్రకటనలు ఇవ్వలేదని, దాదాపు నెల రోజుల పాటు టాలీవుడ్ ను నిత్యం ఫ్రంట్ పేజీలో ఏకి పారేసారు. దాంతో ఆ ప్రింట్ మీడియాను గిల్డ్ ప్రకటనల జాబితాలో చేర్చడం విశేషం. వెబ్ మీడియాను కట్టడి చేయెచ్చేమో కానీ సోషల్ మీడియాను, ప్రీ ప్రెస్ ను, యూ ట్యూబ్ మీడియాను గిల్డ్ ఎలా కట్టడి చేస్తుందో? చూడాలి. చాలా మంది నిర్మాతలు మాత్రం వెబ్ మీడియా కట్టడి కన్నా, కలిసి మెలిసి పని చేసుకోవడం అన్న పాయింట్ వైపే మొగ్గు చూపుతున్నారు. 

తెలంగాణా ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తాం

జన్మనిచ్చిన గడ్డపైనే కక్ష

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?