Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మీటూ.. ప్రైవేట్‌ సెటిల్‌ మెంట్లు జరుగుతున్నాయా?

మీటూ.. ప్రైవేట్‌ సెటిల్‌ మెంట్లు జరుగుతున్నాయా?

దేశంలో సంచలనంగా నిలిచింది మీటూ ఉద్యమం. ఇండియాలో ఇలాంటి విషయాలకు బయటకు రావు.. అంటూ తను ఎదుర్కొన్న అనుభవాన్ని వివరించింది తనూశ్రీ దత్తా. అక్కడ నుంచి ఈ వ్యవహారం ఆసక్తిదాయకంగా మారింది. రసవత్తర చర్చగా మారింది. తనుశ్రీ ఇచ్చిన స్ఫూర్తితో అనేకమంది తాము ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. ప్రత్యేకించి సినీ, జర్నలిజం రంగాల్లో పనిచేస్తున్న మగువలు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సినిమా రంగంలోకి హీరోయిన్లు ఈ అంశం గురించి చెప్పడం మీడియాకు కూడా పసందుగా మారింది.

సాధారణంగా ఈ తరహా అంశాలను మీడియా మాసాలా వార్తలుగా ప్రజెంట్‌ చేస్తూ ఉంటుంది. ఫలానా హీరోయిన్‌ కోసం ఫలానా హీరో ట్రై చేశాడు. వాళ్ల వ్యవహారం అలా సాగింది.. అనే అంశాలను చెప్పడం మీడియాకు సరదా అంశం. ఇక ఈ తరహా వార్తలకు ప్రేక్షకులు కూడా గట్టిగానే ఉంటారు. వీటి గురించి తెలుసుకోవడం జనాలకూ ఒక సరదా. ఇలాంటి సరదానే ఒక సీరియస్‌ అంశంగా నిలిచింది. మీటూ ఉద్యమంగా సంచలనం రేపింది. ఇంకేముంది.. అందరూ ఈ అంశంపట్ల ఆసక్తి చూపారు.

దీనికి తగ్గట్టుగా పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. అయితే ఇక్కడ కూడా కొన్ని గమనించాల్సిన విషయాలున్నాయి. లీడింగ్‌లో ఉన్న నటీమణుల్లో ఎవరూ ఈ అంశం గురించి బయటపడలేదు. కొందరు నటీమణులు అయితే.. అబ్బే తమకు అలాంటి అనుభవాలే ఎదురుకాలేదని చెప్పుకొచ్చారు. వాళ్లను అడక్కపోయినా.. తమను ఎవరూ ఇబ్బంది పెట్టలేదని కొందరు లీడింగ్‌ నటీమణులు వివరించారు. కొన్ని విషయాలను ఓపెన్‌గా చెప్పుకుంటే.. మీటూలో కొన్ని కేటగిరిల్లోని నటీమణులే బయటపడ్డారు.

పెద్దగా అవకాశాలు లేనివాళ్లు, తెరమరుగు అయిన వాళ్లు, ఇక అవకాశాలు వచ్చేదేమీ ఉండదేమో అనే స్థితిలోని వాళ్లు మాత్రమే తాము ఫలానా నటుడి చేతిలో వేధింపులకు గురయ్యాము, ఫలానా ఫిల్మ్‌మేకర్‌ తమను వేధించాడు.. అనే అంశాలను బయటకు చెప్పగలిగారు. అలాగని వాళ్లను తప్పు పట్టడానికి ఏమీలేదు. కనీసం ఇప్పటికైనా చెప్పుకోగలిగారని అనుకోవాలి. అయితే ఇండస్ట్రీలో కొనసాగే లౌక్యం తెలిసిన వారు మాత్రం ఈ అంశం తమకు సంబంధం లేనిది అన్నట్టుగా వ్యవహరించారు.

కొందరు నటీమణులు ఎదురుదాడి చేశారు. మీటూ ఆరోపణలు చేస్తున్న నటీమణులనే వీళ్లు తప్పుపట్టారు. వీళ్లు మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ.. కొందరు అలా రియాక్ట్‌ అయిపోయారు. ఇలా మీటూ వ్యవహారం దాదాపు రెండుమూడు నెలల నుంచి చర్చలోనే నిలిచింది. ఇక బయటపడే వాళ్లు అంతా అయిపోయారని అనుకోవాల్సి వస్తోంది. మరి ముందు ముందు ఇంకా ఎవరైనా బయటపడతారేమో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే సంచలన విషయాలను వెళ్లడించే వాళ్ల హడావుడి తగ్గింది.

ఇక ఇండియాలో కూడా అంతకుమించి చెప్పుకోవడానికి ఏమీ కనిపించడం లేదు. ఇక్కడా మీటూ అంటూ ఫిమేల్‌ సెలబ్రిటీలు సంచలన ఆరోపణలు చేయడం.. జరిగింది. ప్రముఖ నటులు, మూవీమేకర్ల మీద వాళ్లు ఆరోపణలు చేశారు. అందుకు ప్రతిగా సదరు మేల్‌ సెలబ్రిటీలు కూడా ఎదురుదాడి చేశారు.

తాము అమాయకులం అని అన్నారు. తమపై అనుచితమైన ఆరోపణలు చేసిన మహిళలపై పరువు నష్టం దావాలు వేస్తున్నట్టుగా వాళ్లు ప్రకటించారు. కొందరు పోలీస్‌ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేశారు. మరికొందరు పరువు నష్టం నోటీసులను సదరు మహిళలకు పంపించారు.

మరి అర్జున్‌ అయినా పోలీస్‌ స్టేషన్‌ వరకూ వెళ్లి విచారణను ఎదుర్కొన్నాడు కానీ.. ఈ వ్యవహారంలో బాలీవుడ్‌ లెవల్లో ఆరోపణలను ఎదుర్కొన్న వాళ్లకు మాత్రం అలాంటి ఇబ్బంది ఏమీ రాకపోవడం గమనించాల్సిన అంశం. వాళ్లెవ్వరూ విచారణకు వెళ్లలేదు. పోలీసుల విచారణలను ఎదుర్కొనలేదు. వాస్తవాలేమిటి, అవాస్తవాలు ఏమిటి అనే అంశాలు తేలలేదు. ఇంత సంచలన ఆరోపణలు వచ్చినప్పుడు.. ఎవరో ఒకరిది నిజం, మరొకరిది అబద్ధం అయి ఉండాలి కదా.. అలాంటి నిజానిజాలు బాలీవుడ్‌ మీటూ కేసుల్లో తేలలేదు. ఇప్పుడప్పుడే తేలేలా కూడా లేవు.

ఇక బాలీవుడ్‌లో వచ్చిన మీటూ ఆరోపణలు తెరమరుగు కావడం వెనుక కూడా ప్రైవేట్‌ సెటిల్‌మెంట్లు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లేకపోతే సంచలనం రేపిన ఈ వ్యవహారం అంత చప్పున చల్లారిపోదని విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యవహారం ఇంకా ముందు ముందుకుపోతే.. పోయేది ఇండస్ట్రీ పరువే కాబట్టి అక్కడి సినీపెద్దలు కూడా ఈ వ్యవహారాన్ని సెటిల్‌చేసి ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

చిత్రరంగానికి సంబంధించి ఇలాంటి కుళ్లూకుతంత్రాల గురించి మొదటి నుంచి ఏవో సంచలన ఆరోపణలు రావడం, ఆ తర్వాత అవి తెరమరుగు కావడం.. ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లు కూడా తర్వాతి కాలంలో శుద్దపూసలుగా చలామణి కావడం కొత్త ఏమీకాదు. దశాబ్దాల కాలంలో ఇలాంటి పరిణామాలను ఎన్నోచూస్తున్నారు ప్రేక్షకగణం. అలాంటి వాటిల్లో మీటూ కూడా ఒక దూదిపింజలా తేలిపోతోందంతే!

మీటూ... సంచలనంగా మొదలైందో.. అంతే చప్పున చల్లారిందా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?