cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

భారీ నష్టాలు.. మెగాఫ్యామిలీ టాలీవుడ్‌కు భారమవుతోందా?

భారీ నష్టాలు.. మెగాఫ్యామిలీ టాలీవుడ్‌కు భారమవుతోందా?

రాజకీయాల్లో వారసత్వాలను మెగా ఫ్యామిలీ హీరో పవన్‌ కల్యాణ్‌ ఈ మధ్యనే గట్టిగా ప్రశ్నించాడు. అది కూడా విపక్షనేత జగన్‌ను ఉద్దేశించి పవన్‌ కల్యాణ్‌ అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. వేరే ఎవరైనా జగన్‌ విషయంలో అలా మాట్లాడితే మీనింగు ఉంటుందేమో కానీ.. పవన్‌ కల్యాణ్‌ అలా మాట్లాడటం జస్ట్‌ కామెడీ అయ్యింది.

అన్న వారసత్వంతో సినీ హీరో అయిన పవన్‌ కల్యాణ్‌.. జగన్‌ వారసత్వ రాజకీయాన్ని ప్రశ్నించడం కామెడీ గాక మరేమిటి? అన్న ప్రజారాజ్యం అధినేత అయితే, తను యువరాజ్యం అధినేతగా నిలిచిన పవన్‌ కల్యాణ్‌.. వేరే వాళ్లను వేలెత్తి చూపే పొజిషన్లో ఉంటాడా? తను చేస్తున్న పని విషయంలో మరొకరిని విమర్శిచగలగడం పవన్‌కల్యాణ్‌ ప్రహసనం, అపరిపక్వత అని అనుకోవాలి.

అక్కడకూ జగన్‌ తండ్రి ఉన్న సమయంలోనే ఎంపీగా వచ్చినా.. ఆ తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నాడు. ప్రతిపక్ష నేత స్థాయికి వచ్చాడు. అలాంటి జగన్‌ రాజకీయం గురించి విమర్శించే అర్హత తనకేమాత్రం ఉండిందో పవన్‌ కల్యాణ్‌ తనను తాను ప్రశ్నించుకుని ఉండుంటే.. ఆయనకే సమాధానం దొరికేదేమో.

ఎలాగూ వారసత్వం గురించి మాట్లాడటాన్ని.. తండ్రి సీఎం అయితే కొడుకు సీఎం కావాలని అనుకోవడం తప్పు.. అలా జగన్‌ అనుకోకూడదు, లోకేష్‌ బాబు మాత్రం ప్రజల నుంచి కనీసం ఎమ్మెల్యేగా గెలిచిరాకున్నా.. మంత్రి అయిపోవచ్చు.. అని అందంగా చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. తమ కుటుంబ హీరోల ఘన కార్యాలను కూడా కాస్తగమనిస్తే మంచిదేమో.

ఊళ్లో వాళ్ల గురించి ఎంతసేపు అని మాట్లాడతారు.. సొంతవాళ్ల గురించి కూడా కాస్త ఆలోచించుకోవాలి కదా. వాళ్లకూ కాస్త హితబోధ చేయాలి కదా. ఒకరా ఇద్దరా.. ఒక క్రికెట్‌ టీమ్‌కు సరిపడిన స్థాయిలో మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చేశారు. తమ్ముళ్లు, తనయులు, మేనలుళ్లు, ఇంకా.. కూతుళ్ల భర్తలు కూడ హీరోలయిపోతున్నారు.

అలా కావడంలో తప్పేమీకాదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సినిమా హీరోలు అయ్యే అర్హత ఉంది. ఎవ్వరైనా సినిమా హీరోలు అయిపోవచ్చు. డబ్బు పెట్టే శక్తి ఉంది, మార్కెటింగ్‌ చేసుకునే కెపాసిటీ ఉంది.. వాళ్ల పేర్లతో మార్కెట్‌ అవుతోంది, చెట్టు పేరుతో కాయలు అమ్ముకోవచ్చు. అయితే.. ఈ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు.. అని గతంలో నందమూరి వారిపై ఒక విమర్శ వచ్చేది. ఎన్టీఆర్‌ పేరు చెప్పుకుని.. వరసపెట్టి నందమూరి హీరోలు వచ్చిన సమయంలో.. ఆ విమర్శ గట్టిగా వచ్చింది.  

ఒకవైపు బాలయ్య, మరోవైపు జూనియర్‌ ఎన్టీఆర్‌, ఆపై కల్యాణ్‌రామ్‌, ఇంకా తారకరత్న.. వంటివాళ్లు వచ్చిన సమయంలో, వీళ్లంతా వరసపెట్టి డిజాస్టర్లు ఇస్తున్న సమయంలో.. విమర్శలు తీవ్రంగా వచ్చాయి. ఎంతసేపూ సినిమాల్లో మా నాన్న, మా తాత, మా బాబాయ్‌ అని చెప్పుకొంటూ ఉంటే.. విమర్శలు వచ్చాయి. అలాంటి సినిమాలు కూడా డిజాస్టర్లుగా మిగిలిపోవడంతో.. నందమూరి హీరోలు పూర్తిగా కార్నర్‌ అయ్యారు.

ఆ దశలోనే తారకరత్న హీరోగా చేయడం మానుకోవాల్సి వచ్చింది. ఆయనే మానుకున్నాడో, నిర్మాతలే మాన్పించారో కానీ.. ఆయన కనిపించడం లేదు హీరోగా. ఇక కొన్ని హిట్స్‌ ఎన్టీఆర్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. నటుడిగా సత్తా ఉన్నవాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక బాలయ్య సినిమాలేవో బాలయ్య చేసుకొంటూ ఉన్నాడు. మార్కెట్‌ విషయంలో బాలయ్య తన పరిధి ఎరిగి నడుచుకొంటూ ఉన్నాడు. ఇక కల్యాణ్‌రామ్‌ తాత, తండ్రి, బాబాయ్‌ స్మరణలు కాస్త పక్కనపెట్టి.. ప్రయోగాలు చేసుకొంటూ.. పడుతూ లేస్తూ సాగుతున్నాడు.

అలా నందమూరి తాకిడి కాస్త తగ్గిన తరుణంలో మెగా తాకిడి ఎక్కువ అయ్యింది. ఇప్పుడు అది పతాకస్థాయికి చేరిపోయింది. ఆఖరికి చిరంజీవి కూతురు భర్త కూడా... హీరోగా వస్తున్నాడు. రాకూడదా? అంటే.. రావొచ్చు. అయితే.. ఇలా చెట్టు పేరు చెప్పుకోవడం ఎక్కువైతే చిరాకు వస్తుంది. ఎంతమంది వచ్చినా వీరాభిమానులకు సమ్మగానే ఉండొచ్చు కానీ.. చూసే వాళ్లకే ఎబ్బెట్టుగా ఉంటుంది.

చూడమని బలవంతం పెట్టట్లేదు కదా? అని కూడా ఎదురు ప్రశ్నించవచ్చు కానీ.. ఇలా మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది సుమా.. అని గతంలో నందమూరి కుటుంబం ఎదుర్కొన్న విమర్శలను గుర్తుంచుకోవాలని హితబోధ చేయాల్సి వస్తోంది. అందులోనూ.. మెగా హీరోలే రాజకీయ వారసత్వాలను ప్రశ్నిస్తూ.. తర్వాత తమే రాజకీయ, సినీ వారసత్వాలను నడిపించడం.. ఏం నైతికత అని ప్రశ్నించాల్సి వస్తుంది.

మెగా హీరోల మంద ఎక్కువైపోవడం ఒకఎత్తు అయితే.. వీళ్ల సినిమాలు వరసపెట్టి బోల్తాకొడుతున్నాయి సుమా.. అని గుర్తుచేయాల్సి రావడం మరోఎత్తు. టాలీవుడ్‌కు మెగా హీరోలు మిగిల్చిన నష్టం వందలకోట్ల రూపాయల స్థాయికి వెళ్లిపోయిందిప్పుడు. ముందుగా చిరంజీవి తమ్ముడు పవన్‌కల్యాణ్‌ సినిమాల పరంపరను గుర్తుచేయాలి. 'సర్ధార్‌ గబ్బర్‌సింగ్‌', 'కాటమరాయుడు', 'అజ్ఞాతవాసి'.. ఇవీ పవన్‌ కల్యాణ్‌ గత రెండేళ్ల సమయంలో ఇచ్చిన డిజాస్టర్లు.

వీటి నష్టాలు ఏ స్థాయిలో ఉంటాయో గణించడం అల్లాటప్పా వ్యక్తులకు సాధ్యమయ్యే పనికాదు. తక్కువలో తక్కువ.. వందకోట్ల రూపాయల పై మొత్తమే పవన్‌ కల్యాణ్‌ వల్ల పరిశ్రమలోని వ్యక్తులకు వాటిల్లిన నష్టం. ఈ మూడు సినిమాలకూ పవన్‌ కల్యాణ్‌కు భారీ పారితోషకమే ముట్టింది. నిర్మాతల సంగతేమో తెలీదు కానీ.. ప్రస్తుత మార్కెట్‌ తీరు తెన్నుల్లో డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా లాస్‌ అయ్యారు.

పవన్‌ సినిమాను చూసి కోట్లు పోగొట్టుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఆ మధ్య రోడ్డుఎక్కారు. టెంట్లు వేసుకుని నిరసన తెలిపారు. అదీ పరిస్థితి. తన సినిమాలను భారీ ధరపెట్టి కొని.. నష్టపోయిన వారికి పవన్‌ సొమ్ములేవీ తిరిగి చెల్లించిన దాఖలాలు కనిపించడం లేదు. చెల్లించాల్సిన బాధ్యత అయనకు లేదు అనేయవచ్చు. కానీ.. ఊరందరినీ ప్రశ్నించడానికి వెళ్లేముందు.. మనం మన నైతికతను ప్రశ్నించుకోవాలి కదా, అది లేనప్పుడు.. నీ ప్రశ్నలకు విలువేముంది? నీకు అర్హత ఏముంది?

ఇక మెగా ఫ్యామిలీలో.. చిరంజీవి, చరణ్‌లు మాత్రం కొంత సేఫ్‌. రీఎంట్రీ సినిమాతో చిరు సత్తాచాటితే, చరణ్‌ 'ధ్రువ'తో లాభాలు సాధించాడు. మరో పెద్ద పరీక్షను ఎదుర్కొంటున్నాడు. ఇక నాగబాబు తనయుడు కూడా సేఫ్‌జోన్లేనే ఉన్నట్టు. ఫిదాతో భారీ లాభాలు చూపించాడు, ఇక తొలిప్రేమ కూడా లాభాలతో సాగేలా ఉంది. వీళ్లు మాత్రమే కాదు కదా.. ఇంకా ఉన్నారు.

వీరిలో సాయిధరమ్‌ తేజ్‌... ఇతడిని యంగ్‌ చిరంజీవి అంటున్నారు కానీ, ఇలా ఐదు డిజాస్టర్లు ఎదురయి ఉంటే.. చిరంజీవి కథ అప్పుడే అయిపోయేది. తిక్క, విన్నర్‌, నక్షత్రం, జవాన్‌, ఇంటెలిజెంట్‌.. ఇలా ఐదు డిజాస్టర్లు పొందాడు ఈ హీరో. ఒక్కహిట్టు కొట్టి పారితోషకాన్ని ఐదుకోట్ల రేంజ్‌కు తీసుకెళ్లిన ఈ హీరో.. ఇప్పుడు యాభైకోట్ల రూపాయల వరకూ.. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాసులను మిగిల్చాడు. చినమామయ్యవి వందకోట్లు, ఈ మేనల్లుడివి యాభై.. ఓవరాల్‌గా 150. 

ఇక అల్లుశిరీష్‌ కూడా వరస దండయాత్ర అనంతరం.. ఒక హిట్టుకొట్టినా, తదుపరి సినిమా ఆడకపోవడంతో కొంత నష్టాన్నే మిగిల్చాడు. ఇక అల్లుఅర్జున్‌ 'డీజే' భారీస్థాయి ప్రీరిలీజ్‌ మార్కెట్‌ను చేసింది కానీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ దాంతో మ్యాచ్‌ కాలేదు.

వరసపెట్టి మెగా హీరోలు ఎదుర్కొంటున్న ఫెయిల్యూర్స్‌ ఒకఎత్తు అయితే.. ఇంకా మంది పెరిగిపోతూ ఉండటం, మజ్జిగ పల్చన అయ్యే అవకాశాలే ఉండటం గమనించాల్సిన విషయం. మెగా కుటుంబానికి దూరపు చుట్టాలు కూడా.. సినిమాల్లోకి వచ్చి టీమ్‌ మెంబర్ల సంఖ్యను పెంచేలా ఉన్నారు.

ఇదేదో మెగా ఫ్యామిలీని నిందించడం కాదు. టాలీవుడ్‌లో పెరుగుతున్న ఈ కుటుంబ హీరోయిజం తీరు సగటు ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తోంది. మహేశ్‌బాబు కూడా ఈ విషయంలో విసిగిస్తూ ఉన్నాడు. బావలను కూడా హీరోలుగా ప్రమోట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మహేశ్‌కు. బావే కాకుండా... ఇప్పుడు సోదరిని డైరెక్టర్‌గా ప్రమోట్‌ చేసే యత్నంలో నిలిచాడు మహేశ్‌. ఇలా ఎంతమందిని ప్రమోట్‌ చేయడం? సరే.. అలా ప్రమోట్‌ చేసిన సినిమాలేమైనా కళాఖండాలా? అంటే.. అవన్నీ డిజాస్టర్లే.

ఇక నాగార్జున మాత్రం మేనలుళ్ల బాధ్యత నుంచి తప్పుకున్నట్టుగా ఉన్నాడు. సుమంత్‌, సుశాంత్‌లను ప్రమోట్‌ చేయడం ఆపినట్టుగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు కొడుకులను ప్రమోట్‌ చేసుకోవడమే సరిపోతోంది ఆయనకు. పెద్ద తనయుడు కాస్త గాడిన పడినట్టుగా కనిపిస్తున్నా.. చిన్నకొడుకు వరస డిజాస్టర్లు మాత్రం నాగ్‌ను ఆందోళన పెడుతున్నాయి.

వారసత్వంగా వ్యాపారం చేసుకోవచ్చు కానీ.. ప్రేక్షకులపై హీరోలను రుద్ధితే.. కొంతవరకూ అది ముచ్చటగానే ఉన్నా, ఆఖరికి అందరినీ భరించడం ఆ కుటంబాల ఫ్యాన్స్‌కు కూడా సాధ్యంకాదు. అందుకు నిదర్శనమే.. ఈ కుటుంబాల హీరోలు ఇస్తున్న వరస డిజాస్టర్లు. వీటి నుంచి పాఠాలు నేర్చుకుని.. ఈ మంద కొంచెం కంట్రోల్‌ అయితే మంచిదేమో!