నాగ్ నమో ఎక్కడ ఫెయిల్ అయినట్లు?

నాగార్జున-రాఘవేంద్రరావు అన్నమయ్య బ్లాక్ బస్టర్. రామదాసు హిట్. షిర్డీసాయి..ఫరవాలేదన్నట్లు ఆడింది. కానీ ఓం నమో వేంకటేశాయ మాత్రం బాక్సాఫీసు దగ్గర పూర్తిగా విఫలమయింది. ఓం నమో వేంకటేశాయ సినిమా విషయంలో నాగ్ అండ్ కో…

నాగార్జున-రాఘవేంద్రరావు అన్నమయ్య బ్లాక్ బస్టర్. రామదాసు హిట్. షిర్డీసాయి..ఫరవాలేదన్నట్లు ఆడింది. కానీ ఓం నమో వేంకటేశాయ మాత్రం బాక్సాఫీసు దగ్గర పూర్తిగా విఫలమయింది. ఓం నమో వేంకటేశాయ సినిమా విషయంలో నాగ్ అండ్ కో పైకి ఎన్ని మాటలు చెప్పినా లోపల కాస్త టెన్షన్ పడారన్నది వాస్తవం. అయితే మరీ ఇంత మిజరబుల్ గా విఫలం అవుతుందని వారు కూడా అనుకోలేదు. కానీ సినిమాకు అయిన ఖర్చు, అమ్మిన రేట్లు, తీసుకున్న అడ్వాన్స్ లు ఇవన్నీ కలిసి కాస్త టెన్షన్ పెంచాయి. అందుకే యథాశక్తి పబ్లిసిటీ మాత్రం చేసారు. అయితే ఓపెనింగ్స్ దగ్గర నుంచే సినిమా చతికిల పడిపోయింది. ఇదే ఇప్పుడు ఎందుకన్నది అంతుపట్టడం లేదు ఇండస్ట్రీ జనాలకు.

సినిమా సబ్జెక్ట్, టైటిల్ దగ్గరే మైనస్ అయిందని కొందరు ఇండస్ట్రీ జనాల అభిప్రాయం. అన్నమయ్య, రామదాసు అనగానే వాళ్ల సినిమాలు అన్న అడియా వుంది. దీనికి కూడా హాధీరాం బాబా అని పెరు పెట్టి వుంటే, ఆయనెవరో? ఆయన కథేమిటో? అన్న ఆసక్తి వుండేది. కేవలం ఓం నమో వెంకటేశాయ అనగానే అదో రెగ్యులర్ భక్తి సినిమా అన్న భావన వెళ్లింది. కానీ నాగ్ అండ్ కో అనుకున్నది హాథీరామ్ బాబా అంటే అన్నమయ్య, రామదాసు ల మాదరిగా ప్రాచుర్యం వున్న పేరు కాదు కదా అని. ఈ డైలమానే కొంత దెబ్బతీసింది. పైగా హాథీరామ్ బాబా కథ కు సినిమా లెంగ్త్ కు సరిపడా విస్తరణ లేదు. అందుకోసం రాఘవేంద్రరావు అండ్ కో చేసిన పనేమిటంటే, తిరుపతిలో జరిగే కార్యక్రమాలను డాక్యుమెంటరీగా చేసి, వాటికి వున్న నేపథ్యాలను విజువలైజ్ చేసారు.

అయితే అన్నమయ్య, రామదాసు కాలం నాటికి ఇప్పటికీ పరిస్థితి మారింది. ఇప్పుడు తెల్లవారితే టీవీలో గంటల కొద్దీ భక్తి కార్యక్రమాలే. పూజలు అభిషేకాలే. పైగా 24గంటలు భక్తి కార్యక్రమాలు ప్రసారం చేసే చానెళ్లు. అందువల్ల ఈ తరహా భక్తి కార్యక్రమాల కోసం ప్రత్యేకించి సినిమాలకు వెళ్లే మూడ్ లో జనం వున్నారా అన్నది అనుమానం. ఇక ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అంటే చాలా ఎగ్జామ్స్ కు ప్రిపరేషన్ టైమ్. ఇంటర్, టెన్త్ తదితర వాటికి క్రూషియల్ టైమ్. ఇలాంటి టైమ్ లో ఫ్యామిలీల దృష్టి అంతా పిల్లల చదువులపైనే.

ఇది చాలదన్నట్లు రాఘవేంద్రరావు కుర్రకారును ఆకట్టుకోవడానికా అన్నట్లు, ప్రగ్య ను తీసుకువచ్చి, మళ్లీ తన స్టయిల్ లో బొడ్డు మీద నానా పోతలు పోసి, తన గెడ్డం నెరిసింది కానీ, తలపులు మాత్రం మహా రొమాంటిక్ అని చాటుకోవాలని చూసారు. భక్తి సినిమాలు చూసే పెద్దవాళ్లకు ఇది పొసిగే వ్యవహారం కాదు. ప్రగ్య పాట వైనం బాగానే వాళ్ల దృష్టికి వెళ్లింది. దాంతో వాళ్లు దూరం వున్నారు. 

ఇలా అన్ని విధాలా ప్రతికూల పరిస్థితుల్లో విఫలమైంది అనుకోవాలి నాగ్ నమో. ఈ సినిమా కోసం 26 కోట్ల వరకు ఖర్చు చేసారు. అయితే శాటిలైట్, నైజాం, ఓవర్ సీస్ లాంటి వాటితోటే డబ్బులు వచ్చేసాయి. మిగిలిన సేల్ తో లాభాలు వచ్చాయి. మరి బయ్యర్ల పరిస్థితి ఏమిటి అన్నది చూడాలి. రిటర్న్ గ్యారంటీ వుంటే ఓకె. లేదంటే కష్టమే. ముఖ్యంగా ఓవర్ సీస్ బయ్యర్లకు అయితే మరీ కష్టమే.