ఇక అందరూ ప్రశాంతంగా వుండొచ్చు. నందులపై అసంతృప్తి స్వరాలు ఇక వినిపించవు. ఆ మేరకు తెరవెనుక ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయని వినికిడి. అసంతృప్తి వాదులకు వార్నింగ్ ల్లాంటి సలహాలు చేరిపోయాయని తెలుస్తోంది. నందులపై ఇక ఎవరూ ఎటువంటి వ్యాఖ్యానాలు చేయవద్దని, ఈ విషయమై లేచే గొంతులు కొన్నింటికి వేరు వేరు జనాలతో సలహాల్లాంటి ఆదేశాలు అందినట్లు బోగట్టా.
ముఖ్యంగా మెగా క్యాంప్ కు చెందిన బన్నీ వాస్ ఈ విషయంలో ముందుగా స్పందించారు కాబట్టి, ఇక ఆయనను సైలంట్ అయిపోమని చెప్పాలని, బన్నీ వాస్ బాస్ అయిన అల్లు అరవింద్ కు సూచనలు అందినట్లు తెలుస్తోంది. ఆంధ్రకు చెందిన ఓ సన్నిహిత మంత్రి ద్వారా ఈ సూచనలు అందాయని వినికిడి.
నందుల వ్యవహారం ఆంధ్రప్రభుత్వం పై కాస్త గట్టి ప్రభావం చూపింది. బ్యాడ్ నేమ్ అన్నది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి కీలకమైన కమ్మ-కాపు వర్గాల మధ్య చిచ్చు రాజేసింది. దీంతో సోషల్ మీడియాలో విపరీతంగా రకరకాల పోస్టులు చెలరేగిపోతున్నాయి.
దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే, పార్టీ పై ప్రభావం చూపే ప్రమాదం వుందని గ్రహించిన తెలుగుదేశం అధిష్టానం ఈ విధమైన దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. అసలు అవార్డుల వ్యవహారంపై ఎవరు స్పందించమన్నారు అని అవార్డులను సమర్దిస్తున్న కొంత మందిని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద రెండువైపులా అదుపులు, ఆదేశాలు షురూ చేసారని వినికిడి.