నోటా.. నో.. బిజినెస్

ఈ మధ్య కాలంలో సినిమాలకు కలెక్షన్ల సంగతి అలా వుంచితే బిజినెస్ లు కావడం కూడా కష్టంగా మారింది. కొనేవాళ్లు వుంటున్నారు కానీ, రేట్లు రాకపోవడం అన్నది సమస్య కావడంతో, ఓ దశకు చేరుకున్న…

ఈ మధ్య కాలంలో సినిమాలకు కలెక్షన్ల సంగతి అలా వుంచితే బిజినెస్ లు కావడం కూడా కష్టంగా మారింది. కొనేవాళ్లు వుంటున్నారు కానీ, రేట్లు రాకపోవడం అన్నది సమస్య కావడంతో, ఓ దశకు చేరుకున్న తరువాత ఓన్ రిలీజ్ అన్న ఆప్షన్ నే నమ్ముకోవాల్సి వస్తోంది. తమకు వున్న పరిచయాలు, నమ్మకాలు ఉపయోగించి, ఏదో ఒక విధమైన టెర్మ్ తో సినిమాను ఎవరో ఒకరి చేతుల్లో పెట్టాల్సి వస్తోంది. ఎలాంటి సినిమాకైనా ఇది తప్పడం లేదు.

గీత గోవిందం అద్భుతమైన హిట్ అయింది. కానీ ఆ తరువాత వస్తున్న విజయ్ దేవరకొండ నోటా అమ్మకాలు లేవు. చెబుతున్న భారీ రేట్లే కారణం అని వినిపిస్తోంది. ఒక్క నైజాంకు 16 కోట్లు చెప్పారని, తరువాత 13 అన్నారని, ప్రస్తుతం డైరక్ట్ రిలీజ్ అని వినిపిస్తోంది. ఆంధ్రలో చాలా ఏరియాలు, సీడెడ్ ఇదే పరిస్థితి. రెండు మూడు జిల్లాలు మాత్రం గీతా పంపిణీకి మాత్రమే తీసుకుంది.

నిజానికి నోటా నిర్మాత జ్ఞాన్ వేల్ కు యువి వంశీ, గీతా అరవింద్, దిల్ రాజు లాంటి వాళ్ల స్నేహం వుంది. కానీ ఎంత స్నేహం అయినా రేటు గిట్టుబాటు చూసుకోవడం మామూలే. అక్కడే గీత గోవిందం హిట్ రేట్లు అడగడంతో,  వ్యవహారం తేడా కొడుతోంది. గీత గోవిందం అమ్మకాల రేట్లు మీద పది ఇరవై పర్సంట్ ఎక్కువ అంటే వేరు, కోట్లు, లక్షలు ఎక్కువ అంటే వేరు.

మైత్రీ సినిమాలు
ఇక రంగస్థలం, అంతకు ముందు మరో రెండు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన మైత్రీమూవీస్ నిర్మించిన అమర్ అక్బర్ ఆంథోని పరిస్థితి ఇంతే అని వినిపిస్తోంది. శ్రీనువైట్ల వరుసగా డిజాస్టర్లు ఇచ్చిన డైరక్టర్, రవితేజ ఇప్పటికే హ్యాట్రిక్ ప్లాపులు ఇవ్వడంతో ఆ సినిమా కు బిజినెస్ కావడంలేదని తెలుస్తోంది.

నాగచైతన్య ట్రాక్ రికార్డు కారణంగా సవ్యసాచి పరిస్థితి ఇలాగే వున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగ్-నానిల దేవదాస్ ను కూడా చాలా ఏరియాలు నిర్మాతే వుంచుకుని, అడ్వాన్స్ ల మీద ఇచ్చారని వినిపిస్తోంది. అయితే మైత్రీ, వైజయంతీ లాంటి పెద్ద సంస్థలు సినిమాలు అమ్మలేకపోయినా సమస్యకాదు. ఎందకుంటే వాళ్లు కోరినంత అడ్వాన్స్ లు డిస్ట్రిబ్యూటర్లు పంపేస్తారు. తరువాత లెక్కలు చూసుకుంటారు. కానీ సినిమా ఫలితం తేడా వస్తే మాత్రమే సమస్య అవుతుంది.

సినిమా ఫలితం తేడా వస్తే బయ్యర్లు తమ కమిషన్ తీసుకుని, వచ్చిన అణాకానీ చేతిలో పెడతారు. లేదూ అంటే, ఇచ్చిన అడ్వాన్స్ ల కోసం వెంటపడతారు. దే అవుట్ రేట్ గా అమ్మేస్తే వ్యవహారం వేరు.

దిల్ రాజుకు కూడా
దిల్ రాజు అంటే పెద్ద డిస్ట్రిబ్యూటర్. నిర్మాత. ఆయన సినిమాను సులువుగా మార్కెట్ చేసుకోగలరు. అలాంటిది ఆయన లేటెస్ట్ సినిమా హలోగురూ ప్రేమకోసమే కూడా బిజినెస్ విషయంలో బయ్యర్లు వెనకడుగు వేస్తున్నారని వినిపిస్తోంది. రామ్ నటించిన ఆ సినిమా మీద పెద్దగా బజ్ రాలేదు ఇంకా. అందువల్ల ఆయన కూడా అడ్వాన్స్ ల మీద సినిమా ఇవ్వడం తప్ప అవుట్ రేట్ గా ఇచ్చే అవకాశం వున్నట్లు లేదు.

ఒకటి రెండు సినిమాలు పైప్ లైన్ లో వుంచితే తప్ప, పెద్ద బ్యానర్లకు కూడా అడిగిన రేంజ్ లో అడ్వాన్స్ లు రావడంలేదు. వెనుక వస్తున్న సినిమాలు, ప్రాజెక్టులు లెక్కలు కట్టుకుని బయ్యర్లు డబ్బులు ఇచ్చే పరిస్థితి వుంది. అదే నోటా లాంటి సోలో ప్రాజెక్టులకు అయితే కష్టమే.