Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్.. నందమూరికి మరింత దూరం?

ఎన్టీఆర్.. నందమూరికి మరింత దూరం?

ఇప్పటికే బాలయ్య ఫ్యాన్స్ వేరు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు.. అనే విభజన వచ్చి చాలా కాలం అయ్యింది. కోస్తా జిల్లాల్లో అయితే.. ఈ విభజనతో కొట్టుకోవడం కూడా జరిగిపోయింది. కొన్నేళ్ల కిందట వరకూ నందమూరి ఫ్యాన్స్.. అంటూ గుంపుగా పరిగణించే సంప్రదాయం ఉండేది. అయితే తారక్ అభిమానులు వేరు.. బాలయ్య ఫ్యాన్స్ వేరే అనే విభజన వచ్చింది.

కొందరు ఇంకా నందమూరి ఫ్యాన్స్ గానే ఉండొచ్చు కానీ.. నందమూరి హీరోల మధ్య సన్నిహిత సంబంధాలు అయితే లేవని స్పష్టం అయ్యింది. బాలయ్య సంక్రాంతి సినిమాకు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చినప్పుడైతే ఈ రచ్చ పతాక స్థాయికి చేరింది. ఎన్టీఆర్ సినిమాకు థియేటర్లు దక్కనీయలేదు.. అనేది కూడా బహిరంగ రహస్యం.

రెండు థియేటర్లు ఉన్న చిన్న చిన్న టౌన్లలో రెండింటిలోనూ బాలయ్య సినిమానే ప్రదర్శింపజేసి.. తారక్ సినిమాకు ఛాన్స్ ఇవ్వలేదు అప్పట్లో. ఆ విషయంలో లోకేష్ జోక్యం కూడా ఉందంటారు. తారక్ ను రాజకీయ అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు బాగానే ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత అతడిని దూరం పెట్టారు అనేది కూడా బహిరంగ రహస్యమే.

అలాగే తారక్ కు బాగా దగ్గరైన వాళ్లు వైసీపీలో యాక్టివ్ గా ఉండటం నందమూరి ఫ్యాన్స్ లోని ప్రధాన కులస్తులకు బాగా కోపం తెప్పించే అంశం. ఈ వ్యవహారంతో వారు జూనియర్ ఎన్టీఆర్ అంటే పడనట్టుగా తయారైపోయారు. అయితే.. ఇలాంటి అవరోధాలను ఎదుర్కొంటూ.. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోవడంలో ఎన్టీఆర్ విజయవంతం అయ్యాడు.

వచ్చింది వారసత్వంతోనే అయినా.. ఇప్పుడు నటుడుగా ఫ్యాన్సేతర సినీ ప్రేక్షకుల ఆమోదం పొందాడు ఎన్టీఆర్. ఆ ధైర్యంతోనే ఇప్పుడు మరో భారీ సినిమాకు రెడీ అయ్యాడు. ఎప్పుడో.. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కలిసి నటించారు.. కృష్ణా, శోభన్ బాబులు కలిసి నటించారు, కృష్ణా, ఎన్టీఆర్ లు కలిసి నటించారు.. లీడ్ లో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం ఆ తరం వారి తర్వాత మళ్లీ జరగలేదు.

మహేశ్, వెంకటేష్ లు కలిసి నటించినా, నాగార్జున వివిధ మల్టీస్టారర్లు చేసినా.. అవన్నీ వేరే. ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాల మధ్య పోటీ ఉండేది.. వాళ్లిద్దరూ కలిసి నటించారు. ఎన్టీఆర్ ను అన్ని రకాలుగానూ ఢీ కొట్టి ఆయనతో కలిసి నటించాడు.. అలాంటి పోటీ వాతావరణం ఉన్న చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్నారిప్పుడు. ఈ ప్రభావాన్ని తేలికగా అంచనా వేస్తే.. అది బుకాయింపు మాత్రమే అవుతుంది.

రాజకీయంగా మెగా కుటుంబీకులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసినా.. కూడా తెలుగుదేశం వీరాభిమానులు, ఒక సామాజికవర్గం వారు.. సినిమాల పరంగా మెగా ఫ్యామిలీపై తీవ్రంగానే విరుచుకుపడుతూ ఉంటారు. కులంతో సినీ అభిమానాన్ని ఏర్పరుచుకున్న వాళ్లు.. ఎలాంటి పరిస్థితుల్లోనూ మెగా ఫ్యామిలీని సినిమా పరంగా సపోర్ట్ చేయరు. ఇది బహిరంగ రహస్యం.

అయితే.. ఇలాంటి నేపథ్యంలో.. రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తుండటం.. సినీకులాభిమానులను తీవ్ర ఆక్కసుకు గురి చేస్తోంది. ప్రత్యేకించి ఎన్టీఆర్ పై నందమూరి వీరాభిమానులు కొందరు మండిపడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే.. ఆ వీరాభిమానులకు ఎన్టీఆర్ మరింత దూరం అవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని తారక్ ఊహించి ఉండడు అనుకోవడానికి ఏమీలేదు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?