Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సమంత సినిమా.. సెంటిమెంట్‌ను జయిస్తుందా?

సమంత సినిమా.. సెంటిమెంట్‌ను జయిస్తుందా?

కన్నడలో సూపర్ హిట్.. కల్ట్ హిట్ అనిపించుకున్న సినిమాలు ఇది వరకూ కూడా తెలుగులో రీమేక్ అయ్యాయి. శాండల్ వుడ్‌లో సంచలనం రేపిన సినిమాలను మనోళ్లు రీమేక్ చేశారు. అది కూడా భారీ హంగామా మధ్యన ఆ సినిమాలు వచ్చాయి. అయితే అవేవీ మ్యాజిక్‌ను రీ క్రియేట్ చేయలేకపోయాయి. కన్నడ సినిమాలో రీమేక్ అయ్యి తెలుగులో హిట్ కొట్టిన చరిత్ర ఉంది కానీ, గత కొన్నేళ్లలో.. కన్నడ సూపర్ హిట్లు రీమేక్ అయ్యి హిట్టు కొట్టింది మాత్రంలేదు. దశాబ్దాల కిందటి తెలుగు క్లాసిక్స్ కొన్ని కన్నడలోనే ముందుగా వచ్చాయి. ‘గుండమ్మ కథ’ సినిమా కూడా ముందుగా కన్నడీగులదే.

ఎన్టీఆర్ కెరీర్లో సూపర్ హిట్ సినిమా ‘అడవి రాముడు’, చిరంజీవి సూపర్ హిట్ ‘ఘరానా మొగుడు’ వంటి సినిమాలకూ మూలాలు కన్నడ సినిమాలే. ఇక కన్నడలో కల్ట్ హిట్ అయిన సినిమాలు అదే ఊపుతో తెలుగులో రీమేక్ అయ్యాకా మాత్రం సక్సెస్ సాధించలేకపోయాయి.

‘జోగి’ ‘ముంగారు మలై’లతో మొదలుపెట్టి ఇటీవలి ‘కిరిక్ పార్టీ’ వరకూ ఇదే కథ. జోగి కన్నడలో సూపర్ హిట్.. దాన్నే మన్నోళ్లు ‘యోగి’ పేరుతో తీస్తే ఫ్లాప్ అయ్యింది. ఇక ముంగారు మలై కన్నడలో రేపిన సంచలనంలో వందోవంతు కూడా తెలుగునాట రేపలేకపోయింది. ‘వాన’గా వచ్చి వెలిసిపోయింది. ఇక ‘కిరిక్ పార్టీ’ కర్ణాటకలో సంచలనం రేపగా.. తెలుగు లో రీమేక్ అయ్యి అంతగా ఆకట్టుకోలేదు.

కొన్నేళ్ల కిందట విష్ణువర్ధన్ ఆఖరి సినిమా ‘ఆప్తరక్షక’ తెలుగులో ‘నాగవల్లి’గా రీమేక్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. అంతకు ముందు ‘చంద్రముఖి’ కన్నడలో హిట్టైన సినిమాకు రీమేకే. ఆ సినిమా తెలుగు వెర్షన్ సూపర్ హిట్. అయితే వీటన్నింటికీ మూలం ఒక మలయాళ సినిమా.

ఈ పరంపరలో ‘యూటర్న్’ సెంటిమెంటును మార్చేస్తుందా? అనేది ఆసక్తిదాయకమైన అంశం. యూటర్న్ కూడా కన్నడనాట కల్ట్ హిట్టే అయ్యింది. అదే బేస్‌తో తెలుగులో రీమేక్ అయ్యింది. గత సినిమాల సెంటిమెంటుకు విరుద్ధంగా ఈ సినిమా సక్సెస్‌ను చవి చూస్తుందేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?