మీడియాలో 'కాగితం పులులు' అనే పదప్రయోగం ఉంది. క్రికెట్ కు సంబంధించి ఇది ఎక్కువగా వాడుతుంటారు. పేపర్ పై చూస్తే టీం బలంగా కనిపిస్తుంది. గ్రౌండ్ లో మాత్రం చతికిలపడుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే 'సోషల్ మీడియా పులులు' అనే పదాన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో సినిమాలు ఇప్పుడు విడుదలకు ముందు సోషల్ మీడియాలో భయంకరమైన బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తీరా థియేటర్లలోకి వచ్చిన తర్వాత, వసూళ్ల పరంగా, ప్రశంసల పరంగా ఆ స్థాయిలో అంచనాల్ని నిలబెట్టుకోలేకపోతున్నాయి.
కేరాఫ్ కంచరపాలెం సినిమానే తీసుకుంటే, విడుదలకు ముందు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సురేష్ బాబు అండ్ టీం ఈ సినిమాను అలా తయారుచేసింది. ప్రతి వీకెండ్ కొంతమంది సెలబ్రిటీలకు సినిమా చూపించి, వాళ్లతో సోషల్ మీడియాలో తెగ హంగామా చేయించారు సురేష్ బాబు. తీరా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఓ మంచి సినిమాగా మాత్రమే మిగిలిపోయింది కేరాఫ్ కంచరపాలెం.
నిజానికి ఈ సినిమా బడ్జెట్, థియేటర్లలో వచ్చిన వసూళ్లతో కంపేర్ చేస్తే ప్రాఫిట్ వెంచరే. అటు మేకర్స్ హ్యాపీ. ఇటు సురేష్ బాబు కూడా హ్యాపీ. కానీ ఇక్కడ సమస్య అది కాదు. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా పెళ్లిచూపులు, ఆర్ఎక్స్100, అర్జున్ రెడ్డి టైపులో సెన్సేషన్ అయిపోతుందని జనాలు ఊహించారు. ప్రచారం ఆ రకంగా సాగింది. కానీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది కంచరపాలెం.
మను సినిమాది కూడా అదే పరిస్థితి. రిలీజ్ కు ముందు ఇదేదో సంచలనం సృష్టించే సినిమాలా ఉందంటూ సోషల్ మీడియాలో ఓ రకమైన ప్రచారం జరిగింది. తీరా థియేటర్లలోకి వచ్చిన తర్వాత అట్టర్ ఫ్లాప్ అయింది. కంటెంట్ ను గాలికొదిలేసి, కేవలం టెక్నికల్ అంశాలపై దృష్టిపెడితే రిజల్ట్ ఎలా ఉంటుందో మను చూపించింది. విడుదలకు ముందు వరకు ఈ సినిమాపై ఉన్న కొండంత ఆసక్తి, విడుదలైన మొదటి రోజే పూర్తిగా పోయింది.
ఇదే జాబితాలోకి వస్తుంది చిలసౌ సినిమా. రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి సుశాంత్ ను హీరోగా పెట్టి తీసిన లవ్ ఎంటర్ టైనర్ ఇది. ఈ సినిమాపై కూడా సోషల్ మీడియాలో భారీ డిస్కషన్ నడిచింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సినిమా విడుదలైన కూడా అదే సోషల్ మీడియాలో పాజిటివ్ డిస్కషన్ సాగింది. సినిమా బాగుందని అంతా మెచ్చుకున్నారు. కానీ కలెక్షన్లు నిల్. సుశాంత్ కెరీర్ లో దీన్నొక మంచి సినిమాగా చెప్పుకోవచ్చు. హిట్ సినిమాగా మాత్రం కాదు.
ఇవి మాత్రమే కావు. కమల్ నటించిన విశ్వరూపం-2, మంచులక్ష్మి చేసిన వైఫ్ ఆఫ్ రామ్, పెళ్లిచూపులు డైరక్టర్ తరుణ్ భాస్కర్ తీసిన ఈ నగరానికి ఏమైంది సినిమాలది కూడా ఇదే పరిస్థితి. సంచలనాలు సృష్టిస్తాయంటూ విడుదలకు ముందు సోషల్ మీడియాలో వీటిపై భారీ ప్రచారం జరిగింది. థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ఫ్లాపులుగా మిగిలాయి.