ప్రభుత్వం కొత్త జీవో ఇచ్చింది అయినా ఉత్తరాంధ్రలోని అనేక థియేటర్లలో వంద రూపాయలు అమ్మడానికి అవకాశం లేదు. అయినా చాలా చోట్ల అలాగే అమ్ముతున్నారు. గత రెండు నెలులుగా ఇలాగే సాగిపోతోంది.
ఎమ్మార్వోలకు, ఆర్టీవోలకు సినిమాకు ఇంత వంతున మామూళ్లు అందుతున్నాయని వార్తలు వచ్చాయి కూడా. ఆఖరికి జీవో 35 అమలు చేయమని కోర్టుకు ఎక్కాడు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాత నట్టికుమార్. ఆ మేరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
అయినా కూడా ఇంకా ఉత్తరాంధ్రలోని పలు థియేటర్లలో పాత రేట్లే అమ్మేస్తున్నారు ధైర్యంగా. గమ్మత్తేమిటంటే ఈ లెక్కలు ఏవీ డిస్ట్రిబ్యూటర్లకు చేరడం లేదు. నిర్మాతలకు చేరడం లేదు. మధ్యలోనే మాయం అవుతున్నాయి. ఆ మధ్య విడుదలైన ఓ పెద్ద సినిమాను ఉత్తరాంధ్రకు డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చారు. ఆ ఫిగర్లు వాస్తవానికి ఒకలా, నిర్మాత దగ్గరకు ఒకలా వెళ్లాయని డిస్ట్రిబ్యూటర్ల సర్కిళ్లలోనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు కోర్టు ఆదేశించినా పాత రేట్లే అమ్మేయడం పై నిర్మాత నట్టి కుమార్ మళ్లీ కొర్టుకు వెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో టికెట్లు సంపాదించి, వాటి ఆధారంగా ఈవారం కంటెంప్ట్ కేసు దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అసలే కోర్టుల చేతిలో మొట్టికాయలు తప్పడం లేదు. ఇప్పుడు రేట్ల విషయం ప్రూవ్ అయితే మరో మొట్టికాయ తప్పదేమో? అమలు చేయాల్సిన అధికారులు సైలంట్ అయితే పరిస్థితి ఇలాగే వుంటుంది.