తొలిసారి డైరక్టర్ హరీష్ శంకర్ నోట ఆయన గురించి ఆయన చెప్పడం సంభవించింది. ఇప్పడిప్పుడే వినయంగా, విధేయంగా వుండడం నేర్చుకుంటున్నా అని ఆయన వెల్లడించారు. వాల్మీకి ప్రీరిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ, ఇప్పుడిప్పుడే వినయంగా, విధేయంగా వుండడం నేర్చుకుంటున్న మీ హరీష్ శంకర్ అని అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తరువాత నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, మా హరీష్ వినయం, విధేయం నేర్చుకోవడం చాలా మంచి విషయం అన్నారు.
హరీష్ శంకర్ మంచి కమర్షియల్ డైరక్టర్ నే. గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డిజె సినిమాలతో తనకు కమర్షియల్ పల్స్ తెలుసు అని ప్రూవ్ చేసుకున్నారు. ఓ పాత తమిళ సినిమాను తీసుకుని, దానికి మేకోవర్ చేసి, అలాగే హీరోకి మేకవర్ చేసి, సాప్ట్ పాటల ఇచ్చే మ్యూజిక్ డైరక్టర్ కు మేకోవర్ చేసి, వాల్మీకి సినిమాకు ఈ రేంజ్ బజ్ తెచ్చారు.
సినిమా ఫలితం అనేది విడుదల నాటి సంగతి. కానీ విడుదల వేళకు ఆ సినిమా గురించి, దాని విశేషాల గురించి కాస్తయినా మాట్లాడుకునేలా చేయడం అంటే చాలావరకు ఆ దర్శకుడు సక్సెస్ అయినట్లే. (కానీ డైరక్టర్ ఆర్జీవీ వ్యవహారాలు ఇక్కడ మినహాయింపు). వాల్మీకి సినిమా టైటిల్ కానీ, వరుణ్ మేకోవర్ కానీ, మిక్కీ సాంగ్స్ కానీ ఇవన్నీ హరీష్ శంకర్ ఖాతాలోకే వస్తాయి.
కానీ గతంలో అనేకసార్లు హరీష్ వార్తల్లోకి ఎక్కడం కానీ, వాల్మీకి నిర్మాణంలో వివాదాలు కానీ అతని క్రెడిట్ బ్యాలెన్స్ ను తగ్గించేస్తున్నాయి. బహుశా ఇది ఆయన తెలుసుకుని వుండొచ్చు. అందుకే వినయం, విధేయం నేర్చుకుంటున్నా అని అని వుండొచ్చు. మంచి నిర్ణయం.. కీప్ ఇట్ అప్ హరీష్.