ఒకప్పుడు విశాల్ సినిమాలంటే మన బి సి సెంటర్లలో భలేగా ఆడేసేవి. ఆ ఫైట్లు, మాస్ సీన్లు భలేగా వుండేవి. కానీ రాను రాను విశాల్ సినిమాలు ఆయనే నిర్మించుకోవడం, ఇక్కడ సరైన పార్టీలకు ఇవ్వకపోవడం, పబ్లిసిటీ పట్టించుకోకపోవడం, దానికి తోడు సినిమాలు కూడా అంతంతమాత్రంగా వుండడంతో మొత్తం మార్కెట్ కొలాప్స్ అయిపోయింది.
మొన్నటికి మొన్న అభిమన్యుడు సినిమాను రెండో కోట్ల లోపు రేటుకే తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు ఇచ్చేసారు. ఆ సినిమా బాగా ఆడి కొనుక్కున్న నెల్లూరు హరికి లాభాల పంట పడించింది. దాంతో పందెంకోడి-2కు మాంచి రేటు పలికింది. పైగా టైటిల్, సీక్వెల్ అన్నీకలిసి వచ్చి, ఆరున్నర కోట్లకు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు అమ్ముడుపోయాయి.
విడుదలై కాస్త డివైడ్ టాక్ వచ్చినా, ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో ఏడు కోట్ల వరకు వసూళ్లు సాధించింది. మరో యాభై లక్షలు వస్తే, కొనుకున్న బయ్యర్లు సేఫ్ అయిపోతారు. ఈ లెక్కన మళ్లీ విశాల్ కు ఏడున్నర కోట్ల మార్కెట్ తెలుగునాట వచ్చినట్లే. అది కూడా డివైడ్ టాక్ సినిమాకు. అదే సరైన సినిమా పడితే కచ్చితంగా పదికోట్ల మార్కెట్ వుండే అవకాశం వుంది.
బహుశా ఆ దృష్టితోటే కావచ్చు, విశాల్ తో భోగవిల్లి ప్రసాద్ ఓ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఎకె బ్యానర్ అనిల్ సుంకర కూడా అదే ప్రయత్నంలో వున్నారు. బోగవిల్లి ప్రసాద్ చేసే సినిమా బహుశా డిటెక్టివ్ సీక్వెల్, డిటెక్టివ్ 2 అయ్యే అవకాశం వుంది. ఈ సినిమా అంతా అమెరికా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది.
గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి