ఎన్టీఆర్ బయోపిక్ ఎవరి బ్రెయిన్ చైల్డ్? సహజంగా అందరూ ఎన్టీఆర్ కుమారుడు బాలయ్యదే అనుకుంటారు. కాదు. సిసిఎల్ విష్ణుగా ఇండస్ట్రీ జనాలకు పరిచయం వున్న ఇందూరి విష్ణుది. ఆయనే బయోపిక్ ఆలోచన చేసి, కొందరు రచయితలు, దర్శకుల సహాయంతో టోటల్ స్క్రిప్ట్ తయారుచేసుకున్నారు. ఎప్పటికైనా అది సినిమా చేయాలని అనుకున్నారు. అలా బాలయ్య దగ్గరకు వచ్చింది. ఆపైన సాయి కొర్రపాటి జాయిన్ అయ్యారు. ఇంతలో బాలయ్య కూడా నిర్మాణంలోకి వచ్చారు.
ఇది పూర్వాశ్రమ సంగతి. కానీ ఇప్ఫుడు బయోపిక్ పోస్టర్లు, డిజైన్లలో తప్ప విష్ణు ఇందూరి కనిపించడం లేదు. అసలు బయోపిక్ నిర్మాణం లేదా ఆఫీసు దరిదాపుల్లో విష్ణు కనిపించడం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య నిర్మాణంలో కీలక భాగస్వామిగా మారిన తరువాత, ఆయన సమీప బంధువు ప్రసాద్ నిర్మాణ వ్యవహారాలు చూస్తున్నారు. క్రిష్ కనుసన్నలలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి.
ఇలాంటి టైమ్ లో నిర్మాతలుగా సాయి కొర్రపాటి, విష్ణుల పేర్లు తీసేస్తారని గ్యాసిప్ లు వినిపించాయి. వాటిపై కొంత మల్లగుల్లాలు నడిచాయి. ఆఖరికి మళ్లీ వాళ్ల పేర్లు అలాగే వుంచారు. కానీ, నిర్మాణ వ్యవహారాల్లో మాత్రం వారి ప్రమేయం ఏమీలేదని టాక్.
ముఖ్యంగా ఈ మల్లగుల్లాలు, గ్యాసిప్ లు పైకి రావడంతో వీటన్నింటి వెనుక విష్ణు వున్నారనే అనుమానం వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆయనను పూర్తిగా దూరం పెట్టారో? లేదా ఆయనే దూరంగా వుంటున్నారో? మొత్తానికి బయోపిక్ కు దగ్గరలో ఎక్కడా విష్ణు కనిపించడం లేదట.
ఆయన కోరుకున్న బయోపిక్ తెరకెక్కుతోంది. అదే పదివేలేమో?