Advertisement

Advertisement


Home > Movies - Movie News

టాలీవుడ్‌కు సెల్యూట్

 టాలీవుడ్‌కు సెల్యూట్

ప్ర‌పంచాన్ని ఓ పెద్ద విప‌త్తు క‌మ్మేసిన వేళ‌...త‌న ప‌రిశ్ర‌మ‌లో ఇబ్బంది ప‌డుతున్న కార్మికుల‌ను ఆదుకునేందుకు తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ ముందుకు రావ‌డం అభినంద‌నీయం. క‌రోనా మ‌హమ్మారి చేస్తున్న విధ్వంసంలో అన్ని రంగాలు విల‌విల‌లాడుతున్నాయి. ఈ సంక్షోభం నుంచి సినీ రంగాన్ని బ‌య‌ట‌ప‌డేయ‌డానికి ఆ ప‌రిశ్ర‌మ‌కు చెందిన హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఐక్యంగా ముందుకొచ్చారు.

సినిమా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో వీధిన‌ప‌డ్డ కార్మికుల‌ను ఆదుకునేందుకు సి.సి.సి. మ‌న కోసం (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ చైర్మ‌న్‌గా చిరంజీవి నేతృత్వం వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ వివ‌రాలు వెల్ల‌డించాడు.

ప్ర‌పంచానికే ఓ పెద్ద విప‌త్తు వ‌చ్చింద‌ని, ఈ ఆప‌ద స‌మ‌యంలో సినీ కార్మికుల‌కి మ‌నం ఏం చేయ‌గ‌ల‌మ‌నే గొప్ప ఆలోచ‌న‌తో మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చార‌న్నాడు. ఎలాంటి విప‌త్తులోనైనా సాయం అందించేందుకు సినిమా ప‌రిశ్ర‌మ ఎప్పుడూ ముందుంటుంద‌నే విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశాడు.  

ఈ నేప‌థ్యంతో సొంత ప‌రిశ్ర‌మ‌లోని కార్మికుల‌కు అండ‌గా నిలిచేందుకు చిరంజీవి ఆధ్వ‌ర్యంలో త‌న‌తో పాటు సురేష్‌బాబు, ఎన్‌.శంక‌ర్‌, సి.క‌ల్యాణ్‌, దాము క‌లిసి  ‘సీసీసీ మనకోసం’ అనే చిన్న సంస్థ‌గా ఏర్పాట‌య్యామ‌న్నాడు. ఈ సంస్థ ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షేమం కోసం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించామ‌న్నాడు.

ఇందులో భాగంగా ఈ సంస్థ‌కు మొట్ట‌మొద‌టిగా చిరంజీవి కోటి రూపాయలు, హీరో  నాగార్జున కోటి రూపాయలు, ఎన్టీఆర్‌ 25లక్షలు విరాళాలు ప్రకటించార‌న్నాడు. ఎవరైనా సినిమా పరిశ్రమ కార్మికులను ఆదుకోడానికి ముందుకు రావ‌చ్చ‌ని ఆయ‌న కోరాడు.

దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌ మాట్లాడుతూ ‘సి.సి. సి. మనకోసం’  కమిటీతో పాటు డైరెక్టర్‌ మెహర్‌ రమేష్, గీతా ఆర్ట్స్‌ బాబు, కోటగిరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, కొమరం వెంకటేష్, ఫెడరేషన్‌కు సంబంధించి అన్ని కార్మిక సంఘాల నాయకులు ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నార‌ని వివ‌రించాడు.  

అనుకోని విప‌త్తు సంభ‌వించిన త‌రుణంలో త‌మ ప‌రిశ్ర‌మ‌లో ఉపాధి పొందుతున్న కార్మికులు క‌ష్టాల్లో ఉండ‌గా, వారికి అండ‌గా నిలిచేందుకు ఐక్యంగా ముందుకొచ్చిన టాలీవుడ్ దేశంలోని ఇత‌ర భాషా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచింది. తెలుగు వాళ్లు గ‌ర్వించే ప‌నిచేసిన టాలీవుడ్‌కు సెల్యూట్.

ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమ‌లు చేస్తాం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?