cloudfront

Advertisement


Home > Movies - Movie News

జాతీయ అవార్డుల డొల్లతనం చాటిన బాహుబలి-2

జాతీయ అవార్డుల డొల్లతనం చాటిన బాహుబలి-2

నేషనల్ అవార్డ్స్ స్టాండర్డ్స్ మీద విమర్శలు కొత్తవేమీ కావు. ఇప్పడు అవి మరోసారి కమ్ముకునే సమయం వచ్చింది. ఈ ఏడాది జాతీయ అవార్డుల ప్రకటన ఇంతకు ముందు ప్రకటనల డొల్ల తనాన్ని చాటుతోంది. తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో అస్సామీ సినిమా ‘విలేజ్ రాక్‌స్టార్స్’ను జాతీయ ఉత్తమ చిత్రంగా ప్రకటించారు. అస్సామీ సినిమాలకు ఇది మంచి గౌరవమే అనుకుందాం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బాహుబలి-2ని జాతీయ ఉత్తమచిత్రంగా ప్రకటించలేదు! అలా ప్రకటించకపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు, కానీ బాహుబలి పార్ట్ వన్ ను జాతీయ ఉత్తమ చిత్రంగా ప్రకటించారు రెండేళ్ల కిందట. అసలు ఏ బేస్ మీద ఆ సినిమాను అప్పుడు జాతీయ ఉత్తమచిత్రంగా ప్రకటించారో ఎవరికీ తెలీదు.

జాతీయ ఉత్తమ చిత్రాన్ని ఫీచర్ ఫిల్మ్ కేటగిరి నుంచినే తీసుకుంటారు. చిల్డ్రన్, నాన్ ఫిక్షన్, డాక్యుమెంటరీ.. కేటగిరి సినిమాలు ఉత్తమ చిత్రం కేటగిరిలోకి రావు. ఫీచర్ ఫిల్మ్ ను మాత్రమే ఉత్తమ చిత్రంగా ప్రకటిస్తారు. ఫీచర్ ఫిల్మ్ కు ఉన్న డెఫినేషన్లో మొదటి పదం ఏమిటంటే, దానికి క్లైమాక్స్ ఉండాలనేది. క్లైమాక్స్ ఉంటేనే అది ఫీచర్ ఫిల్మ్ అవుతుంది.

అయితే బాహుబలికి పార్ట్ వన్లో ఎలాంటి క్లైమాక్స్ లేదు. అయినా దాన్ని జాతీయ ఉత్తమ చిత్రంగా ప్రకటించారప్పట్లో. అనేక మంది సినిమా క్రిటిక్స్ తీవ్రంగా విమర్శించారు. కావాలంటే బాహుబలి పార్ట్ టూ వచ్చాకా మొత్తంగా దీన్ని ఉత్తమ చిత్రంగా ప్రకటించుకోవాలి కానీ, క్లైమాక్స్ లేని సినిమాకు ఎలా ఉత్తమ చిత్రం అవార్డును ఇస్తారు? అంటూ అనేక మంది ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు లేవు. జాతీయ అవార్డుల ఎంపిక కమిటీ డొల్లతనం అది.

ఇప్పుడు కామెడీ ఏమిటంటే.. బాహుబలి-2కు మూడు కేటగిరిల్లో అవార్డులు ఇచ్చారు. పార్ట్ వన్ జాతీయ ఉత్తమ చిత్రం అయ్యింది కానీ, పార్ట్ టూ జాతీయ ఉత్తమ చిత్రం కాలేదు. పార్ట్ వన్ ను ఏ బేస్ మీద జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశారో ఎవరికైనా క్లారిటీ ఉంటే బాహుబలి పార్ట్ టూ ఎందుకు జాతీయ ఉత్తమ చిత్రం కాలేదో చెప్పవచ్చు.

బాహుబలి పార్ట్ వన్ తో పోలిస్తే, పార్ట్ టూకు మంచి వసూళ్లు వచ్చాయి, బాగా ఆడింది, ప్రేక్షకులకూ ఒక సినిమాపై పార్ట్ టూతోనే ఒక క్లారిటీ వచ్చింది. అదేం విచిత్రమో అవార్డుల కమిటీ బాహుబలి 2ని జాతీయ ఉత్తమచిత్రంగా ప్రకటించలేదు! ఇక వినోదాత్మక చిత్రంగా ఈ సినిమాకు అవార్డును ఇచ్చారు.

అలాగే ‘యాక్షన్ డైరెక్షన్’అంటూ అర్థం కాని ఒక కేటగిరిలో రాజమౌళికి కూడా అవార్డును ప్రకటించారు. యాక్షన్ డైరెక్షన్ కేటగిరిలో అవార్డు ఇచ్చారంటే, ఇతర జోనర్ డైరెక్షన్లకు కూడా అవార్డులు ఉంటాయనునుకునేరు. అలాంటివేమీ లేవు. మేధావులే ఈ అవార్డులకు అర్హులను ఎంపిక చేశారు కానీ, అసలు కథ మాత్రం సామాన్యులకు అర్థం కాదు.