కరోనాను అధిగమించి, భయాల్ని పక్కనపెట్టి హీరోలంతా ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే సెట్స్ పైకి వస్తున్నారు. అక్కినేని తండ్రికొడుకులు నాగార్జున-నాగచైతన్య ఇద్దరూ సెట్స్ పైకి వచ్చారు. వీళ్లతో పాటు మరింతమంది తమ సినిమాల్ని ఈ నెలలో స్టార్ట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య' సినిమాపై యూనిట్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ నుంచి ఆచార్య సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఇక్కడే చిన్న మార్పు జరిగింది. సినిమా షూటింగ్ మొదలైనా, చిరంజీవి మాత్రం సెట్స్ పైకి రారు. ఈ మేరకు షెడ్యూల్స్ లో భారీ మార్పులు చేస్తున్నారు. సిబ్బందిని 30శాతానికి తగ్గించే కసరత్తు మొదలైంది.
తాజా సమాచారం ప్రకారం.. ఆచార్య సెట్స్ పైకి వచ్చిన వెంటనే రామ్ చరణ్ అందులో జాయిన్ అవుతాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం చరణ్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. సో.. ముందుగా చరణ్ పై పూర్తిచేయాల్సిన సన్నివేశాల్ని షూట్ చేస్తారు. ఆ తర్వాత చిరంజీవి సెట్స్ పైకి వస్తారు. చిరు వచ్చేటప్పటికి కరోనా పరిస్థితులు చక్కబడతాయని భావిస్తున్నారు.
అయితే ఇక్కడ కూడా ఓ సమస్య ఉంది. సినిమాలో చరణ్ కు ఇంకా హీరోయిన్ ను లాక్ చేయలేదు. ఈ నెలలో హీరోయిన్ ను ఫిక్స్ చేసి వచ్చేనెల నుంచి సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే ఇదంతా కొరటాల-చరణ్ ప్లానింగ్ మాత్రమే.
ఈ ప్లాన్ కు చిరంజీవి ఓకే చెబితేనే సినిమా మొదలౌతుంది. లేదంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఎందుకంటే, లైట్ బాయ్ నుంచి హీరో వరకు ఏ ఒక్కర్ని రిస్క్ లో పెట్టడం తనకు ఇష్టంలేదని చిరంజీవి ఇదివరకే విస్పష్టంగా ప్రకటించారు.