మరో 2 రోజుల్లో సెట్స్ పైకి రాబోతోంది ఆచార్య మూవీ. ఈ గ్యాప్ లో సినిమాకు సంబంధించి మేజర్ డీల్ ఒకటి పూర్తిచేశారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ ను తాజాగా క్లోజ్ చేశారు. జెమినీ ఛానెల్ ఈ సినిమా ప్రసార హక్కుల్ని దక్కించుకుంది.
నిజానికి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ముందు నుంచి జెమినీ ఛానెల్ కే అనుకున్నారు. దీని వెనక ఓ కారణం ఉంది. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా చేసిన సైరా నరసింహారెడ్డి శాటిలైట్ వ్యవహారాల్లో చిన్నపాటి గందరగోళం తలెత్తింది. అప్పట్లో మేకర్స్ చెప్పిన భారీ రేటు చూసి ఛానెళ్లన్నీ వెనక్కితగ్గాయి.
ఓవైపు రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నప్పటికీ, చిరంజీవి సినిమాకు ఇంకా శాటిలైట్ పూర్తవ్వకపోవడం ఏంటనే నెగెటివ్ కామెంట్స్ జోరుగా వినిపించడంతో ఆఖరి నిమిషంలో జెమినీ ఛానెల్ ను రంగంలోకి దించి డీల్ క్లోజ్ చేశారు.
అప్పటి లెక్కల్లో సర్దుబాట్లు చేసే క్రమంలో, ఆచార్య మూవీని కూడా జెమినీ ఛానెల్ కే అప్పగించాల్సి వచ్చింది. అప్పుడు సైరా, ఇప్పుడు ఆచార్య.. ఈ రెండు శాటిలైట్ డీల్స్ రామ్ చరణ్ కనుసన్నల్లోనే జరిగాయి.
సోమవారం నుంచి ఆచార్య మూవీ సెట్స్ పైకి రాబోతోంది. నెల రోజుల పాటు ఏకథాటిగా జరగనున్న ఈ షెడ్యూల్ లో కొత్త పెళ్లి కూతురు కాజల్ కూడా జాయిన్ అవుతుంది.
కొరటాల శివ డైరక్ట్ చేస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మణిశర్మ సంగీత దర్శకుడు.