ఇండస్ట్రీలో నెపొటిజం/బంధుప్రీతి ఒక్కటే సమస్య కాదంటున్నాడు నటుడు సత్యదేవ్. నెపొటిజంను మించిన సమస్యలు చాలా ఉన్నాయంటున్నాడు. కొత్తగా పరిశ్రమలోకి వచ్చే తనలాంటి వాళ్లకు అలాంటి చాలా సమస్యలు ఎదురవుతాయని అంటున్నాడు.
“ఏ రంగంలోనైనా సమస్యలు ఎదురవ్వడం కామన్. అంతా స్మూత్ గా అయిపోతే కెరీర్ ఎందుకు? సినిమాలా హ్యాపీ ఎండింగ్ మాత్రం ఉండదు. చిన్న చిన్న సమస్యలున్నాయి. కానీ అవి చెప్పుకునేంత పెద్దవి కావు. వాటిని మనం పట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. సమస్యలు వస్తాయి, వాటిని ఫేస్ చేసుకొని ముందుకెళ్లిపోవడమే. నెపొటిజం అనే కాదు, అంతకుమించి బోలెడన్ని ఉంటాయి.”
నెపొటిజం గురించి ఆలోచిస్తూ ఎవ్వరూ కెరీర్ స్టార్ట్ చేయరంటున్నాడు సత్యదేవ్. నిజానికి నెపొటిజాన్ని నమ్మని వాడే పరిశ్రమలోకి వస్తాడని చెబుతున్నాడు. సక్సెస్ కావాలంటే కొన్ని సమస్యల్ని ఫేస్ చేయాల్సిందేనని, పట్టుకొని వేలాడుతూ కూర్చుంటే ఏం చేయలేమంటున్నాడు.
“నెపొటిజం మీద నేను ఎక్కువగా దృష్టి పెట్టను. అయినా నెపొటిజం ఒకటి ఉందంటూ మనం ముందుకెళ్లలేం కదా. మన లక్ష్యం వేరు, మన విజన్ వేరు. దాని గురించి ఆలోచిస్తే అన్నీ చేయలేం. నెపొటిజం నమ్మని వాళ్లే ఇండస్ట్రీలోకి వెళ్తున్నారు. నెపొటిజం ఉంది, మనకు కష్టం అనుకునేవాడు ముందే డ్రాప్ అయిపోతాడు. అన్నీ తెలుసుకొని నేను ముందుకెళ్తున్నాను.”
రీసెంట్ గా సత్యదేవ్ నటించిన 47 డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలు ఓటీటీ వేదికలపై రిలీజ్ అయ్యాయి. మంచి నటుడిగా సత్యదేవ్ కు గుర్తింపు తెచ్చిపెట్టాయి.