Advertisement

Advertisement


Home > Movies - Movie News

సీతారామశాస్త్రి తర్వాత నెంబర్ వన్ సినీకవి ఎవరు?

సీతారామశాస్త్రి తర్వాత నెంబర్ వన్ సినీకవి ఎవరు?

2010 లో వేటూరి సుందరరామమూర్తి, 2017లో డా సి నారాయణ రెడ్డి, 2021లో సిరివెన్నెల సీతారామశాస్త్రి తమ అవతారాలు చాలించేసారు. కారణజన్ములుగా కవిత్వాన్ని పండించి అనంతలోకాలకు పయనమయ్యారు. 

వారి తర్వాత అంతటి సుదీర్ఘమైన అనుభవం, దశాబ్దాల పాటు జనరంజకమైన మరియు సాహితీవిలువలు గల కవిత్వాన్ని సినీగీతాల్లో పండిస్తున్న కవి ఎవరు అంటే...చంద్రబోస్ కనిపిస్తున్నారు. 

చంద్రబోస్ లో అటు వేటూరిలాగ కొంటెదనం, ఇటు సిరివెన్నెలలాగ తాత్వికత రెండూ కనిపిస్తాయి. అంతే కాకుండా అలతి పదాలతో సందేశాన్ని ఇవ్వగల నేర్పు కూడా ఈ కవిలో కనిపిస్తుంది. 

జాతీయ పురస్కారం ఎందుకు రాలేదో తెలియదు కానీ "మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.."అనే పాట ఎప్పటికీ నిలిచిపోయే ప్రభోదాత్మక గీతం. 

అలాగే "రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మారియా...ప్రతి రోజు విలువైంది చాలా..ప్రయత్నిస్తె గెలుపేదొ రాదా" అనే గీతం కూడా యువతకి మార్గనిర్దేశం చేసేదే. ఇలాంటివి ఈయన కలం నుంచి చాలానే జాలువారాయి. 

వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి స్థాయిలో తత్సమసమాసాలతో పాటలు రాయగల నేర్పు చంద్రబోసులో ఉందో లేదో ఇప్పటివరకు బయటపడలేదు. అయితే సరళభాషలో వారి స్థాయిలో రాయగలరని మాత్రం చాలా సార్లు నిరూపించుకున్నారు.

"కాళిదాసు నేనై కవితరాసుకోనా కాలిగోటి అంచులపైనా హృదయం ఉంచనా..." వంటి గొప్ప కవితాత్మక ప్రయోగాలు చేసిన చంద్రబోసు అప్పుడప్పుడు కొన్ని విమర్శలు కూడా మూట గట్టుకున్నారు. 

ఒక పాటలో.."ఏమెట్టి చేసాడే ఆ బ్రహ్మ...రంభ ఊర్వశి మేని చెమటతోనా.." అని చెమటని సుగంధ ద్రవ్యంగా పేర్కొనడం చాలామందికి నచ్చలేదు. నిజంగా దానిలో ఔచిత్యం కనపడదు. 

సిరివెన్నెలలాగ వంకపెట్టలేని సాహిత్యాన్ని చంద్రబోస్ అందించారని మాత్రం చెప్పలేము. కొన్ని విమర్శలు ఉన్నా ఆయనంటూ తెలుగు సినీ గీత మాగాణిలో పదికాలాల పాటు నిలిచిపోయే సాహిత్యాన్ని మాత్రం పండించారు.

మొన్నటికి మొన్న "వేరుసెనగ కోసం మట్టిని తవ్వితే..." అనే పాటతో "రంగస్థలం" సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసిన కవి చంద్రబోస్. ఆ ఒక్క పాటతో 2018 ని ఒక ఊపు ఊపేసి ఆ సినిమా విజయానికి కీలకపాత్ర పోషించిన వ్యక్తి. ఆ ఒక్క పాటనే కాదు, ఆ చిత్రంలోని అన్ని పాటలూ అజరామరాలే. "రంగ రంగ రంగస్థలాన.."అనే పాటలో ఉన్న తాత్వికత చాలా బాగుంటుంది. అలాగే "రంగమ్మ మంగమ్మా...", " ఆ గట్టునుంటావా.."...ఇలా అన్ని పాటల్లోనూ ఒక లోతైన విశేషం వినిపిస్తుంది. ఎంత దర్శకుడు విషయం చెప్పినా సినిమా నాడిని పట్టుకున్న కవికే ఇది సాధ్యం. 

తాజాగా "పుష్ప" పాటలు ఒకదానిని మించి ఒకటి అన్నట్టున్నాయి. "దాక్కో దాక్కో మేక..."అనే పాట మూలం తెలుగే. చంద్రబోస్ రాసిందే. దానినే అన్ని భాషల్లోకి మక్కికి మక్కి తర్జుమా చేసుకున్నారు. ఎంత గొప్ప సాహిత్యమంటే ...అందులో కూడా విశ్వజనీనమైన తాత్వికత, జీవన సత్యం కనిపిస్తాయి. మాస్ స్టైల్లో ఇంతటి క్లాస్ ఆలోచనల్ని రాయడానికి ఒక వ్యక్తిత్వం ఉండాలి. అది బోసులో ఉంది. "సామి సామి"లో కూడా సున్నితమైన భావాలు సొగసైన పల్లెభాషలో అందంగా ప్రవచించారు చంద్రబోస్. 

అంతే కాకుండా ట్రిపులార్ సినిమాలో "నాటు నాటు..." పాట కూడా చంద్రబోసే రాయడం విశేషం.

పెద్ద సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారుతూ చంద్రబోసు తన సీనియారిటీని నిలబెట్టుకుంటూ, మిగిలిన కవులకంటే భిన్నమైన సాహిత్యాన్ని పండిస్తూ ముందుకు సాగుతున్నారు. 

మిగిలన కవులు ఎందరున్నా వారిలో "వీరు తప్ప ఈ పాట ఇంకెవ్వరూ రాయలేరు" అనే స్థాయిలో ఎవరూ కనపడట్లేదు. ఎందుకంటే ఏ అగ్ర కవి పాట వింటున్నా మరే ఇతర అగ్ర కవైనా దానికి ఇంచుమించు అటు ఇటుగా రాయగలవారే అనిపిస్తోంది. 

ఒక్క చంద్రబోస్ పాటలు వింటుంటే మాత్రం, "ఇంతకన్నా గొప్పగా ఇంకేం రాయాలి..ఇంకెవరు రాస్తారు.."అనే అభిప్రాయం ఎక్కువసార్లు కలుగుతోంది. 

ఆయన ఈ స్థానాన్ని ఇలాగే నిలుపుకుంటూ ముందుకు సాగితే సిరివెన్నెల తర్వాత ఆ స్థానం బోసుదే అనిపించుకోవచ్చు. 

ఇక్కడ ఇతర కవుల్ని తక్కువ చేసే ఉద్దేశ్యం లేదు. కానీ దశాబ్దాల తరబడి జనరంజకమైన పాటలు రాస్తూ అత్యున్నత స్థాయిలో నిలబడి ఇంకా పెద్ద సినిమాలకి తానే మొదటి చాయిస్ అవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. 

మిగిలిన కవులు కొన్నాళ్లు టాప్ లో ఉన్నా కొన్నేళ్లు వెనకబడుతున్నారు. కానీ చంద్రబోస్ మాత్రం నిరాఘాతంగా ముందుకు సాగుతూ ప్రస్తుతానికి సిరివెన్నెల తర్వాత ఆ స్థానంలో కొనసాగుతున్నారు.  

చంద్రబోస్ వారి స్థానం నిలుపుకోవాలని, తక్కిన కవులు కూడా ఈ పరిస్థితిని ఒక ఆరోగ్యకరమైన పోటీగా తీసుకోవాలని మాత్రమే రాస్తున్న వ్యాసం ఇది. ఆ పోటీ తెలుగు సినీగీతాల స్థాయిని పరిపుష్టం చేసేదిగా ఉండాలని కోరుకుంటున్నాను. 

శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?