అలియా భట్ రెడీ.. రాజమౌళిదే ఆలస్యం

కరోనా నుంచి కోలుకున్న అలియా భట్, ఆ తర్వాత లాక్ డౌన్ వల్ల పూర్తిగా ఇంటికే పరిమితమైంది. అలా కావాల్సినంత విశ్రాంతి తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు షూటింగ్స్ కు రెడీ అవుతోంది. ముందుగా…

కరోనా నుంచి కోలుకున్న అలియా భట్, ఆ తర్వాత లాక్ డౌన్ వల్ల పూర్తిగా ఇంటికే పరిమితమైంది. అలా కావాల్సినంత విశ్రాంతి తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు షూటింగ్స్ కు రెడీ అవుతోంది. ముందుగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను పూర్తిచేయాలని నిర్ణయించుకుంది.

భన్సాలీ దర్శకత్వంలో గంగూబాయ్ కథియావాడీ అనే సినిమా చేస్తోంది అలియాభట్. ఈ సినిమాకు సంబంధించి కేవలం ఒక రోజు షూట్ బ్యాలెన్స్ ఉంది. అది కూడా సాంగ్ షూటింగ్. 

జూన్ 15 తర్వాత ఓ మంచి రోజు చూసి షూట్ స్టార్ట్ చేసి, సింగిల్ డే లో దీన్ని పూర్తిచేయాలని చూస్తున్నాడు భన్సాలీ. అవసరమైతే కాల్షీట్ సమయాన్ని కాస్త పెంచి ఓవర్ నైట్ లో పని పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు.

భన్సాలీ సినిమాల్లో భారీతనం గురించి అందరికీ తెలిసిందే. ఈ పెండింగ్ సాంగ్ కోసం కూడా భారీగా డాన్సర్లను తీసుకోవాలని భావించాడు భన్సాలీ. కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా వ్యాక్సిన్ వేయించుకున్న 30 మంది డాన్సర్లతోనే ఆ పాటను పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ షూట్ పూర్తయిన తర్వాత మరోసారి ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి రాబోతోంది అలియాభట్. ఈ మేరకు తను షూటింగ్స్ కు రెడీగా ఉన్నట్టు రాజమౌళికి సమాచారం అందించింది. జక్కన్న కూడా రెడీగా ఉన్నాడు. 

తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే అలియా భట్ తో ఆర్ఆర్ఆర్ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. సినిమాలో సీత పాత్రలో కనిపించబోతోంది అలియా. ఆమెకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా ఇదివరకే రిలీజైంది.