cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఆ సినిమాకు ప్రతి హీరో బ్రాండ్ అంబాసిడరే

ఆ సినిమాకు ప్రతి హీరో బ్రాండ్ అంబాసిడరే

కేరాఫ్ కంచరపాలెం.. ఈ సినిమాకు ఇప్పుడు ప్రతి ఒక్క హీరోను బ్రాండ్ అంబాసిడర్ గా మార్చేస్తున్నాడు రానా. వీకెండ్ వస్తే చాలు, ఓ ముగ్గురు హీరోల్ని రామానాయుడు కలర్ ల్యాబ్ కు పిలవడం, కేరాఫ్ కంచరపాలెం చూపించడం, వాళ్లతో ట్వీట్లు చేయించడం. ఇలా ఓ పద్ధతి ప్రకారం ఈ సినిమాను జనాల్లోకి ఎక్కించే బాధ్యతను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు రానా.

మొన్నటికి మొన్న రాజ్ తరుణ్, నానితో పాటు మరికొందరు హీరోలకు ఈ సినిమాను చూపించాడు. రాజ్ తరుణ్ అయితే ఈ సినిమాను ఓ మాస్టర్ పీస్ గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశాడు. మరోవైపు నాని అయితే, కేరాఫ్ కంచరపాలెం సినిమాకు రానా కంటే తనే ఎక్కువగా ప్రచారం చేస్తానని, అంతలా నచ్చిందని చెప్పుకొచ్చారు. 

వీళ్లకంటే ముందు రాజమౌళి, సుకుమార్ లాంటి పలువురు దర్శకులు ఈ సినిమా చూశారు. ఈ వీకెండ్ కూడా మరికొంతమంది హీరోలకు, ఇంకొంతమంది దర్శకులకు సినిమా చూపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీళ్లందరితో ట్వీట్లు చేయించడంతో పాటు, వాళ్ల వీడియో బైట్స్ కూడా తీసుకొని సినిమాకు పకడ్బందీగా ప్రమోషన్ చేస్తున్నారు.

అటుఇటుగా 50 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను కోటి కంటే తక్కువ మొత్తానికి రానా తీసుకున్నాడట. ప్రచారానికి మాత్రం మరో పాతిక లక్షలు ఖర్చుపెడుతున్నాడు. ఇండస్ట్రీ ప్రముఖుల ద్వారా బాగా బజ్ తీసుకొచ్చి, కోటిన్నరకు శాటిలైట్ రేట్ ఫిక్స్ చేశాడు. ఇది రానా ప్లానింగ్. థియేటర్లలోకి సినిమా రాకముందే శాటిలైట్ రైట్స్ రూపంలో రికవరీ అయిపోతోందన్నమాట.

ఎలాగూ సినిమాకు అంతోఇంతో బజ్ వచ్చేసింది కాబట్టి థియేట్రికల్ రన్ కూడా బాగానే ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అలా చూసుకున్నా రానాకు లాభాలే. ఓవరాల్ గా కంచరపాలెం సినిమాను రిలీజ్ కు ముందే తనకు ప్రాఫిట్ వెంచర్ గా మార్చుకున్నాడు రానా. సెప్టెంబర్ 7న థియేటర్లలోకి వస్తోంది కేరాఫ్ కంచరపాలెం.