Advertisement


Home > Movies - Movie News
అమ్మమ్మగారిల్లుకు రేటింగ్ లు రావా?

హీరోలు బహిరంగ వేదికలపై మాట్లాడేటపుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే పెడ అర్థాలు వస్తాయి. లేటెస్ట్ గా హీరో నాగశౌర్య మాటలు అలాగే వున్నాయి. ఫస్ట్ కాపీ రెడీ అయిపోయి, విడుదలకు రెడీగా వున్న అమ్మమ్మగారి ఇల్లు సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో హీరో నాగశౌర్య మాట్లాడాడు.

ఈ సందర్భంగా ఆయన మీడియాకు ఓ విజ్ఞప్తి చేసాడు. తన ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వవద్దని, ఇది అమ్మమ్మతో అనుబంధం ఆధారంగా తీసామని చెప్పాడు. ‘అమ్మమ్మ గారి ఇల్లు సినిమా రిలీజ్‌ అయ్యాక దయచేసి రేటింగ్‌ పెట్టకండి. ఎందుకంటే అమ్మమ్మ బంధం నేపథ్యంలో రూపొందించారు. ఈ సినిమా ప్రతీ ఒక్కరికీ నచ్చాలని మేం తీయలేదు...’ అన్నాడు నాగశౌర్య.

సినిమా అన్నది అందరికీ నచ్చాలనే తీస్తారు. కాకపోతే కొందరికి నచ్చవచ్చు.. కొందరికి నచ్చకపోవచ్చు. అయితే ముందుగానే అందరికీ నచ్చాలని తీయలేదు అని చెప్పడం ఏమిటి? ముఖ్యంగా ఆ నచ్చని వాళ్ల జాబితాలో సమీక్షలు రాసేవాళ్లు కూడా వుంటారని, రేటింగ్ లు సరిగ్గా పెట్టరని నాగశౌర్య డిసైడ్ అయిపోవడం ఏమిటి? సినిమాకు ప్లస్ చేయబోయి మైనస్ చేసినట్లు వుంది ఇదంతా చూస్తుంటే.

అసలే ఈ సినిమాకు నాగశౌర్య సరిగ్గా కోపరేట్ చేయలేదన్న గుసగుసలు వున్నాయి. అందువల్లే ఈ సినిమా కేవలం రెండే రెండు పాటలతో విడుదలవుతోందని, తొలిసగంలో ఓ పాట, మలి సగంలో ఓ పాట మాత్రమే వుంటుందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. శతమానం భవతి, సీతారామయ్య గారి మనవరాలు చిత్రాల మాదిరిగా ట్రయ్ చేస్తున్న ఈ సినిమాకు డేట్ దొరకాల్సి వుంది.

ఇలాంటి టైమ్ లో ‘సినిమాకు రేటింగ్ ఇవ్వకండి, అనుబందాలు ఫీల్ అవ్వండి’ అని చెప్పడం ఏమిటి? సీతారామయ్య గారి మనవరాలు, శతమానం భవతి సినిమాలకు మంచి రేటింగ్ లే వచ్చాయి కదా? మరి నాగశౌర్య ఈ సినిమాకు రేటింగ్ లు రావని ముందే ఎందుకు అనుకుంటున్నాడు? ఎక్కడో ఏదో డౌట్ కొడుతోంది. సినిమా మీద కాదు. నాగశౌర్య మాటల మీద.