cloudfront

Advertisement


Home > Movies - Movie News

'అరవింద సమేత' పైరసీ.. అరాచకమే.!

'అరవింద సమేత' పైరసీ.. అరాచకమే.!

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో, జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన 'అరవింద సమేత' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిన్న రాత్రి నుంచే ప్రీమియర్స్‌ హడావిడి షురూ అయ్యింది. బెనిఫిట్‌ షోలు అభిమానులతో కిటకిటలాడాయి. ఓ స్టార్‌ హీరో సినిమాకి ఈ మాత్రం హంగామా వుండాలి మరి.!

థియేటర్లలో కోలాహలం, అభిమానుల ఆనందోత్సాహాల సంగతి పక్కన పెడితే, 'అరవింద సమేత' సినిమా తొలిరోజే.. అదీ తొలి ఆటకి ముందే పైరసీ బారినపడింది. అర్థరాత్రి 12.30 నిమిషాల తర్వాత మొట్టమొదటి షో పడుతూనే, 'ఇదిగో నేను సినిమా చూస్తున్నా..' అంటూ టైటిల్‌ దగ్గర్నుంచి, సినిమాలోని ప్రతి ముఖ్యమైన సీన్‌కి సంబంధించి 'స్క్రీన్‌ షాట్స్‌' సోషల్‌ మీడియాలో పెట్టేస్తూ వచ్చారు.

కొందరైతే, తమ అభిమాన హీరోని తెరపై చూసి, ఆ ఆనందంతో కొన్ని సన్నివేశాల్ని వీడియోల రూపంలోనూ వదిలేశారు. హీరో ఎంట్రీ, యాక్షన్‌ ఎపిసోడ్స్‌, డాన్స్‌ మూమెంట్స్‌.. ఇలా దేన్నీ వదల్లేదు. ఇటీవలి కాలంలో పెద్ద సినిమాలకు ఇదో శాపంలా మారింది. 'బాహుబలి ది కంక్లూజన్‌' విషయంలోనూ ఇదే తరహా పైత్యాన్ని చూశాం.

‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను‘ సినిమాలకీ ఇది తప్పలేదు. 'వద్దు ప్లీజ్‌..' అంటూ అభిమానులు మొత్తుకుంటున్నాసరే, వినే పరిస్థితి లేదక్కడ. ఇతర హీరోల అభిమానుల పేర్లతో ఎక్కువగా ఈ వీడియోలు బయటకొస్తుండడం గమనార్హం.

ఇకపై థియేటర్లలోకి మొబైల్‌ ఫోన్లు కూడా తీసుకెళ్ళనివ్వని పరిస్థితులు వస్తే తప్ప.. సినిమా పైరసీని అడ్డుకోవడం కష్టమేనేమో.!