సీఎం గారూ అంటూనే…హీరోయిన్ ఘాటు వ్యాఖ్య‌లు

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి, ప్ర‌ముఖ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ మ‌ధ్య మాట‌ల యుద్ధం ఇప్ప‌ట్లో ఆగిపోయేలా లేదు. సుశాంత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై కంగ‌నా ర‌నౌత్ మొట్ట మొద‌ట గ‌ళ‌మెత్తారు. ఆ త‌ర్వాత విమ‌ర్శ‌లు,…

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి, ప్ర‌ముఖ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ మ‌ధ్య మాట‌ల యుద్ధం ఇప్ప‌ట్లో ఆగిపోయేలా లేదు. సుశాంత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై కంగ‌నా ర‌నౌత్ మొట్ట మొద‌ట గ‌ళ‌మెత్తారు. ఆ త‌ర్వాత విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ ల‌తో బాలీవుడ్ సెల‌బ్రిటీల మ‌ధ్య ట్వీట్ల ఫైట్ జ‌రిగింది. అనంత‌ర కాలంలో కంగ‌నా విమ‌ర్శ‌లు పొలిటిక‌ల్ ట‌ర్న్ తీసుకున్నాయి.

తాజాగా మ‌రోసారి మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రేపై కంగ‌నా ర‌నౌత్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు. కంగ‌నా ట్వీట్ ఏంటో చూద్దాం.

“ఉద్ధవ్ నన్ను నమ్మక ద్రోహి అన్నారు. ముంబై నాకు షెల్టర్ ఇవ్వకపోతే నా రాష్ట్రంలో నాకు తిండి కూడా దొరకదని కూడా అన్నారు. నాకు మీ (ఉద్ద‌వ్ ఠాక్రే) కొడుకు వయసుంటుంది.  సొంత కెపాసిటీతో అంచెలంచెలుగా ఎదిగిన ఒంటరి మహిళ గురించి హేళ‌న‌గా మాట్లాడిన మిమ్మల్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది. 

ముఖ్యమంత్రి గారూ.. మీరు ఓ చెత్త నెపోటిజమ్ ప్రొడక్ట్. సీఎంగారూ.. మీలా తండ్రి అధికారం, డబ్బు అడ్డుపెట్టుకునే తాగుబోతును కాదు. నేను వారసత్వాన్ని నమ్ముకుని ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండేదాన్ని. నేను కూడా ఓ ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబం నుంచే వచ్చాను. 

కానీ, నేను ఆ వారసత్వం మీద, సంపద మీద ఆధారప‌డాల‌నుకోలేదు. కొంతమందికి ఆత్మగౌరవం, స్వీయ విలువ ఉంటాయి” అని ఉద్ద‌వ్‌ను దెప్పి పొడిచారు. సీఎంను గారూ అని గౌర‌వంగా సంబోధిస్తూనే ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.

కంగ‌నా తాజా ట్వీట్‌కు కార‌ణం లేక‌పోలేదు.  శివసేన దసరా ర్యాలీలో కంగనాపై ముఖ్య‌మంత్రి ఉద్ధవ్ పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. బతుకు దెరువు కోసం ఇక్కడకి  వచ్చిన కొందరు ముంబై నగరాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకె)తో పోల్చారని, వారు నమ్మకద్రోహలుగా మిగిలిపోతారని ఉద్ధవ్ ఘాటు విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ మాట‌ల‌కు కౌంట‌ర్‌గా కంగ‌నా ట్వీట్ చేశారు. నువ్వొక‌టి అంటే నేను ప‌ది అంటా అన్న‌ట్టు ఉద్ద‌వ్‌పై కంగ‌నా విరుచుకుప‌డ్డారు. చూద్దాం ఈ వ్య‌వ‌హారానికి ఎక్క‌డ ముగింపు ప‌లుకుతుందో!

పవన్ కళ్యాణ్ వచ్చినా, ఏ కళ్యాణ్ వచ్చినా భయపడేది లేదు