cloudfront

Advertisement


Home > Movies - Movie News

అసమానుడు.. గిరీష్‌ కర్నాడ్‌!

అసమానుడు.. గిరీష్‌ కర్నాడ్‌!

ఒక లెజెండరీ ప్లే రైటర్‌, అరుదైన నటుడు, గొప్ప సినీ రచయిత, దర్శకుడు... ఒక మనిషిలో ఇన్ని ప్రతిభాపాటవాలా! అని ఆశ్చర్యపరిచేంత స్థాయి మనిషి మొన్నటివరకూ మన మధ్యనే ఉండేవారు. భౌతికంగా ఆయన దూరంఅయ్యారు. తెలుగువాడు కాకపోయినా తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని వ్యక్తి గిరీష్‌ కర్నాడ్‌. 81వ యేట తన సంపూర్ణ జీవితాన్ని అనుభవించి ఆయన భౌతికంగా దూరం అయ్యారు.

కర్నాడ్‌ జీవన గమనాన్ని గమనిస్తే ఆయన జీవితాన్ని సంపూర్ణంగా జీవించిన వైనం అర్థం అవుతుంది. ఒక సారస్వత బ్రహ్మణ కుటుంబంలో జన్మించారు. తెలుగు మీడియా ఆయన మరాఠీ అని, కన్నడలో రాశారని పేర్కొంది. అయితే కర్నాడ్‌ మాతృభాష కొంకణి. కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో కొన్ని ప్రాంతాల్లో మాట్లాడుతూ ఉంటారు కొంకణి. అయితే కర్నాడ్‌ రచన వ్యాసంగం ప్రముఖంగా కన్నడలోనే జరిగింది. తన ఇరవై మూడో ఏట తన తొలి నాటకాన్ని  రచించారు కర్నాడ్‌. మహాభరతం నుంచి 'యయాతి' నాటకాన్ని మలిచారు. అయితే కర్నాడ్‌ లండన్‌ డ్రీమ్స్‌ పెట్టుకున్నారు. లండన్లోనే స్థిరపడిపోవాలని అనుకున్నారు. దానికి చదువే మార్గంగా భావించారు. స్కాలర్‌ షిప్‌ పొంది లండన్‌ వెళ్లారు.

'మనం సాధించడానికి ఎప్పుడూ ఏదో ఒకటి మిగిలే ఉంటుంది..' అనేవారు కర్నాడ్‌. బహుశా ఆయన ఇన్ని రంగాల్లో రాణించడానికి ఆ మాటే స్ఫూర్తి మంత్రం అయ్యిందేమో. అలాగే నాటకాల రచన విషయంలో తనకు ఆ స్ఫూర్తినే అన్వయించుకున్నారాయన. తన రచించిన నాటకాలను ఎప్పటికప్పుడు రీ రైట్‌ చేస్తూ వచ్చారాయన. అలాంటి రైటింగే వాటిని మరింత అద్భుతంగా మార్చిందని ఆయనే చెప్పారొకసారి. ప్రచురణ కర్తలు కోరినప్పుడల్లా రచనలను రీ రైట్‌ చేయడానికి ఆయన మొగ్గుచూపారు.

ప్రతి వ్యక్తి జీవితాన్నీ అతడి అనుభవాలే మార్చేసి వేస్తాయనేది కర్నాడ్‌ చెప్పిన మరోమాట. కొంతమంది జీవితాన్ని ఒకే అనుభవమే మార్చి వేస్తుంది, కొందరికి జీవితం మరికొన్ని ఛాన్సులు ఇస్తుందంటారాయన. తన జీవితం వరకూ ఇంగ్లండ్‌లో చదవుకోవడానికి దక్కిన రోడ్స్‌ స్కాలర్‌ షిప్‌ ఒక మేలిమలుపు అని కర్నాడ్‌ చెప్పారు. ఇంగ్లండ్‌లో ఎంఏ ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌ చేశారు.

'సోల్‌ మేట్‌' లేని జీవితం అర్థరహితం అని కర్నాడ్‌ అన్నారు. తన జీవితంలో డాక్టర్‌ సరస్వతి ఆ లోటును భర్తీ చేసిందని చెప్పారు. న్యూయార్క్‌ యూనివర్సిటీలో ఆమె పరిచయం అయ్యారని, తాము పెళ్లికి ముందు పదిహేను సంవత్సరాల పాటు ఎంగేజ్డ్‌ అయ్యామని చెప్పారు. మన కలలన్ని వెంటాడుతూ వెళ్లినప్పుడే సక్సెస్‌ సొంతం అవుతుందని కర్నాడ్‌ ఉద్భోధిస్తారు. ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌లో మంచి ఉద్యోగంలో ఉన్న తనకు బెంగళూరు నుంచి బీవీ కారంత్‌ నుంచి పిలుపు వచ్చిందని, నాటక రంగంలోకి రమ్మని ఆయన పిలిచారని, థియేటరే తనకు పర్మినెంట్‌ అయ్యిందన్నారు.

మీకు ఏ పనిచేయడం ఇష్టమే దాన్నే చేయండి, అన్నీ అందుకు అనుగుణంగా సర్ధుకుంటాయని మరో జీవిత పాఠాన్ని చెప్పారు కర్నాడ్‌. నాటక రంగంలోకి వచ్చిన తర్వాత తనకు నటన, దర్శకత్వం అనేవి సహజంగా అలవాటు అయిపోయాయని కర్నాడ్‌ పేర్కొన్నారు. సంస్కారా, మంథన్‌, స్వామి వంటి సినిమాల్లో తన పాత్రలు ఎంతో విలువైనవని అని ఆయన అభిప్రాయపడ్డారు. దర్శకత్వం విషయానికి వస్తే కన్నడ సినిమా 'కన్నూరు హెగ్గడితి'కి తను చాలా కష్టపడ్డట్టుగా కర్నాడ్‌ ఒకసారి తెలిపారు.

ఆయన చదువు, సాహిత్యం, నాటకాలు, పారలల్‌ సినిమాలు.. ఇవన్నీ ఒక ఎత్తు. వాటికే పరిమితం అయి ఉంటే కర్నాడ్‌ పండితులకు మాత్రమే పరిమితం అయిపోయేవారేమో! పామరులకు ఆయన ఎవరో తెలిసే అవకాశమే ఉండేది కాదేమో. కర్నాడ్‌లోని మరో కోణం కమర్షియల్‌ సినిమాల్లో ఆవిష్కృతం అయ్యింది. స్టార్‌ హీరోలు, రంగురంగుల సినిమాలు, భారీతనం ఉట్టిపడే సినిమాల్ల.. మెరిశారు కర్నాడ్‌. సినిమాకు భారీతనం తీసుకురావడానికి భారీ బడ్జెట్‌ పెట్టడం, హంగులూ ఆర్భాటాలు తీసుకురావడం ఎంత ముఖ్యమో.. కర్నాడ్‌ వంటి నటుడు ఉండటం కూడా అంతే ముఖ్యమనే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది!

సౌత్‌లో స్టార్‌ డైరెక్టర్లు తమ సినిమాల్లో కర్నాడ్‌ చేత ఏదైనా ఒకపాత్ర చేయించుకోవడానికి బాగా ఇష్టంచూపారు. ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఇచ్చారు. కొన్నిసార్లు తమ సినిమాకు నిండుదనం రావడానికి, పేరున్న నటులు ఉన్నారనిపించుకోవడానికి కూడా కర్నాడ్‌ను ఆయా సినిమాల్లో నటింజేసుకుంటూ వచ్చారు. ఇలా కమర్షియల్‌ సినిమాల ద్వారా కర్నాడ్‌ సామాన్యులకు కూడా పరిచయం అయ్యారు. 'సంస్కారా', 'వంశవృక్ష' వంటి సినిమాలతో మొదలైన కర్నాడ్‌ సినీ ప్రస్థానం బోలెడన్ని కమర్షియల్‌ సినిమాల బాట పట్టి.. 'ఏక్‌ థా టైగర్‌', 'టైగర్‌ జిందాహై' వంటి పచ్చి మాస్‌ మాసాలా సినిమాల వరకూ వచ్చింది.

డబ్బు కోసమే కర్నాడ్‌ కమర్షియల్‌ సినిమాల్లో నటించి ఉండవచ్చు. అలాంటి సినిమాల్లో కూడా తన ప్రత్యేకత చాటుకుని, ఆ సినిమాల పాలిట కూడా ఒక గొప్ప క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అనిపించుకున్నారు. ద్విభాష సినిమా 'ఆనందభైరవి' తర్వాత తెలుగులో కర్నాడ్‌ చేసింది తక్కువ సినిమాలే. తమిళ కమర్షియల్‌ మూవీమేకర్లు మాత్రం ఆయనను రెగ్యులర్‌గా నటింపజేస్తూ వచ్చారు. ఆ సినిమాలు ఎలాగూ తెలుగులోకి అనువాదం అవుతూ వచ్చాయి. అలా ఎక్కడా గ్యాప్‌ రాలేదు.

తనకు వ్యక్తిగతంగా పేరొచ్చే రచనలతోనూ, సమాజానికి దగ్గరయ్యే, డబ్బులు వచ్చే సినిమాలతోనూ కర్నాడ్‌ ఆగిపోలేదు. సామాజిక అంశాల గురించి కూడా ఘాటుగా స్పందిస్తూ వచ్చారు. ఎప్పుడో డెబ్బైలలోనే తనకు దక్కిన 'పద్మశ్రీ' ఆ తర్వాత  దక్కిన 'పద్మభూషణ్‌', 'జ్ఞానపీఠ్‌' అవార్డులు తన  ప్రతిభకు తార్కాణాలు అని గంభీరంగా చెప్పుకున్నారు కర్నాడ్‌. అయితే అలాగని ఆయన ప్రభుత్వాల ప్రాపకం కోసం యాచించలేదు. పాలకులకు నచ్చని మాటలను మాట్లాడేందుకు ఆయన వెనుకాడలేదు. 'బాబ్రీమసీదు' కూల్చివేత అంశం దగ్గర నుంచినే స్పందిస్తూ వచ్చారు. దేశ చరిత్రకు అది మచ్చగా ఆయన అభిప్రాయపడ్డారు.

'గోద్రా'హత్యాకాండను నిరసించారు. ఇటీవలే 'అసహనం' కూడదన్నారు. తనను అర్బన్‌ నక్సలైట్‌ అని పాలకులు అంటే.. ఆ ముద్రను వేయించుకోవడానికి ఆయన వెనుకాడలేదు! పాలకుల ప్రాపకాన్ని కోరే రచయితలు, మేధావులు ఏం జరిగినా సమర్థిస్తూ ఉంటారు. కర్నాడ్‌ మాత్రం ఆ తరహా వ్యక్తి అనిపించుకోలేదు. సీరియల్స్‌లో కూడా కర్నాడ్‌ తన ముద్రవేశారు. 'మాల్గుడి డేస్‌'ను రసరమ్యంగా చిత్రీకరించినప్పుడు అందులో 'స్వామి' తండ్రి పాత్రలో కొన్నిసార్లు మెరిశారు కర్నాడ్‌. స్వామి తండ్రి పాత్రను కొన్ని ఎపిసోడ్స్‌లో అనంతనాగ్‌ చేయగా, మరి కొన్నిసార్లు కర్నాడ్‌ చేశారు. ఇలా తను ప్రేక్షకులకు చేరువకాని మాధ్యమం అంటూ లేదని కర్నాడ్‌ నిరూపించుకున్నారు.

అటు దర్శకుడిగానూ జాతీయ అవార్డులు పొందారు. నటుడిగానూ ఆ స్థాయి అవార్డులను అందుకున్నారు. స్క్రిప్ట్‌ రైటర్‌గా జాతీయ అవార్డును అందుకున్నారు. ఫీచర్‌ ఫిల్మ్‌, నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌.. ఇలా రెండు కేటగిరిల్లోనూ జాతీయ అవార్డులను అందుకున్న ఘనుడు కర్నాడ్‌. ఇలాచూస్తే కర్నాడ్‌ అసమానుడు. ఇన్ని రకాలుగా ప్రతిభను చూపి కర్నాడ్‌కు పోటీ రాగలిగే వారు భారతదేశంలో అరుదుగా ఉంటారు.

ఇవన్నీ ఓకే కానీ కొన్నిసార్లు మాత్రం తన మాటలతో వివాదాలు రేపారాయన. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ను ఒక సెకెండ్‌ గ్రేడ్‌ ప్లే రైటర్‌ అనడం, టిప్పు సుల్తాన్‌ను అతిగా కీర్తించడం, బాంబే లిటరరీ ఫెస్టివల్‌లో వీఎస్‌ నైపాల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. ఇవన్నీ కర్నాడ్‌ను వివాదాస్పదుడిని చేశాయి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు చోటు ఉందని విశ్వసిస్తే కర్నాడ్‌ అభిప్రాయాలు ఆయనవి అని చెప్పవచ్చు.
-బి.జీవన్‌రెడ్డి