Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాబు చేసిన తప్పే చేస్తున్న జగన్

బాబు చేసిన తప్పే చేస్తున్న జగన్

వైఎస్ జగన్ సిఎమ్ గా అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో, ఇంకా చెప్పాలంటే తొలి రెండేళ్లు పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకు ఓ భయం వున్నట్లు కనిపించేది. చంద్రబాబు తన హయాంలో ఎమ్మెల్యేలకు, పార్టీ నాయకులకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అది అనేక అవకతవకలకు దారి తీసింది. దాంతో జనాల్లో వారి మీద వ్యతిరేకత వచ్చింది. అందుకే జగన్ ముందు జాగ్రత్త పడుతున్నారని అందరూ అనుకున్నారు. ఇదే మంచిదిలే అనుకున్నారు.

కానీ రెండున్నరేళ్ల పాలన ముగిసేసరిగి జగన్ కు కూడా తత్వం బోధపడి పోయినట్లుంది. మెల్లగా ఫ్రీహ్యాండ్ ఇవ్వడం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. అయితే అలా అని జగన్ హయాంలో చేసేయడానికి ఏమీ పెద్దగా లేదు. మహా అయితే వివాదాస్పద లాండ్ సెటిల్ మెంట్లు చేసుకోవడం, చేయడం, బదిలీలు, ఇతరత్రా చిలక్కొట్లు. ఎందుకంటే నిధుల ప్రవాహం ఏమీ లేదు కదా. అక్కడికీ ఇళ్ల స్థలాల భూ సేకరణలో కుదిరిన వాళ్లు ఎవరి చేతివాటం వాళ్లు ప్రదర్శించారు. అయితే ఇది జనాలకు నేరుగా కనెక్ట్ అయినది కాదు కాబట్టి పెద్దగా హడావుడి కాలేదు.

కానీ ఇప్పుడు గుడివాడ కేసినోల వంటి వ్యవహారాలు జనాలకు నేరుగా చేరేవి. నాయకుల విచ్చలవిడి తనానికి పరాకాష్ఠ. కొడాలి నాని వంటివారి మీద జగన్ వంటి వారు కాస్త ఎక్కువ ఆధారపడి వుండొచ్చు. తనను డిఫెండ్ చేయడానికి వారిని వాడుకుంటూ వుండొచ్చు. అంత మాత్రాన వారికి మరీ ఇంతలా బరితెగించడానికి వదిలేయకూడదు. 

తన మంత్రి వర్గ సహచరుడు కన్నబాబు సోదరుడి సినిమా కోసం కర్ఫ్యూ ఆదేశాలను మూడు రోజుల పోస్ట్ పోన్ చేయడం కూడా ఈ తరహా వ్యవహారం కిందకే వస్తుంది కదా?

ఎంత పేదలకు డబ్బులు పంచేస్తున్నా, ఇప్పటికే జగన్ ప్రభుత్వం మీద ముప్పేట దాడి జరుగుతోంది. ఇలా డబ్బులు అందని మిడిల్ క్లాస్ జనాలు చాలా కినుకతో వున్నారు. ధరల వ్యవహారం వీరిని పక్కాగా టార్గెట్ చేస్తోంది.ఉద్యోగస్థులు అయితే నిప్పులు తొక్కుతున్నారు. కొన్ని సామాజిక వర్గాల సంగతి సరేసరి. ఇలాంటి నేపథ్యంలో మరింత జాగ్రత్తలు తీసుకునేది పోయి, పార్టీ నాయకులకు పగ్గాలు వదిలేస్తే జనం ఏమనుకుంటారు?

జనం సంగతి అలా వుంచితే జగన్ మెత్తబడ్డారు అన్న వైనం పార్టీలోకి వెళ్తే ఇక నాయకుల విచ్చలవిడి తనానికి లోటు వుంటుంది. అప్పుడు చంద్రబాబు చెల్లించిన మూల్యమే ఇప్పుడు జగన్ కూడా చెల్లించాల్సి వుంటుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?