తెలుగు సినిమా జెర్సీ హిందీ రీమేక్ సెట్స్ పై హీరో గాయపడినట్టుగా తెలుస్తోంది. నాని తెలుగులో నటించిన ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సందర్భంగా హీరో గాయపడ్డారు.
మొహలీ స్టేడియంలో షూటింగ్ జరుగుతూ ఉండగా.. క్రికెట్ బాల్ వేగంగా వచ్చి హీరో పెదవులకు తగిలిందని సమాచారం. ఈ ఘటనతో షాహిద్ కపూర్ పెదవులకు స్వల్పగాయం అయినట్టుగా తెలుస్తోంది. రక్తస్రావం కావడంతో షాహిద్ ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిందట యూనిట్. చికిత్సలో భాగంగా షాహిద్ కపూర్ పెదవులకు మొత్తం 13 కుట్లు పడ్డాయట.
క్రికెట్ బాల్ పలు సార్లు ప్రమాదకరంగా పరిణమిస్తుంటుంది. లెదర్ బాల్ క్రికెట్ కొంత మంది ఆటగాళ్ల ప్రాణాలను కూడా తీసింది. జెర్సీ సినిమా కూడా అలా మైదానంలోనే ప్రాణాలు వదిలిన భారత క్రికెటర్ రమన్ లాంబా జీవిత ఆధారంగా రూపొందించారనే అభిప్రాయాలున్నాయి. కొంతమేర లాంబా జీవితం ఈ సినిమాకు ఆధారం అంటారు.